చిన్న....ఆ తర్వాత అతడి నోట్లోంచి ఏ మాట వూడి పడబోతున్నదో అని అందరూ ఆతృతగా చెవి వొగ్గారు.
"నా మాట మీకు బాధ కలుగజేస్తుంది. అయినా సత్యాన్ని దాచలేనుకదా! మీఅమ్మాయి కాలేజీలో చదివేటప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించింది అతడితో సినిమాల కెళ్ళింది. షికార్లు తిరిగింది..."
అక్కడున్న అందరినెత్తిన పిడుగులు పడ్డాయి.
రమాకాంతంగారు వణికిపోయారు. అజయ్ మాటలకి అడ్డుతగిలి "ఆపు బాబూ! పిల్ల నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి అంతేగాని మీ అంతస్థుకి తగిన వారం కాదని అపవాదు వెయ్యకండి. మా కోమల్ నిప్పులాంటిది" బాధా ఆవేశం మిళితం కాగా అన్నారు.
"నా మాట నిజమో అబద్దమో మీ అమ్మాయినే అడిగి చూడండి" అజయ్ నిర్లక్ష్యంగా అన్నాడు.
కోమల్ ఓసారి తల ఎత్తి అజయ్ ని చూసి తలవంచుకుంది.
"తల్లీ! అతనేమంటున్నాడో విన్నావా! నేనెవరినీ ప్రేమించలేదని చెప్పమ్మా! మన వంశం నిప్పులాంటిదని చెప్పమ్మా!" రమాకాంతంగారు ఆవేదనగా అన్నారు.
కోమలాదేవి నెమ్మదిగా తల ఎత్తింది "నిజమే, నేను ప్రేమించాను ప్రేమించి నతనితో..."
"కోమల్ ..." రమాకాంతంగారి కంఠస్వరం ఆ గదంతా ప్రతిధ్వనించింది.
అక్కడవున్న అందరూ కొయ్యబారినట్లు వుండి పోయారు.
అజయ్ చందర్ పెదవులు నవ్వీ నవ్వనట్లు నవ్వుతున్నాయి.
లలితాదేవి లేచి నుంచుంది "అన్నయ్యగారూ...! ఆవేశంతో తొందరపడకండి మా అజయ్ మీ కోమల కాలేజీలో చదివింది ఏమిటోగాని అక్కడే వారి ప్రేమ పాఠాలు మొదలయ్యాయి, నాకు కావాల్సింది మీ ప్రేమ వక్కటే కాదు. మీతో పెళ్ళి. పెద్దలని సంప్రదించండి చాటు మాటు వ్యవహారాలూ ఆడదానికి వురితాడు. అంటూ మావాడిని దూరంగా వుంచింది. అజయ్ నావద్దకు రావటం ఏదో చెప్పాలని చెప్పలేక వెళ్ళటం? వాడిలోవాడు మధనపడటం చూసి నేనే ఓ రోజు వాడిని అడిగాను. "అమ్మా! నీ మాట కాదని నిన్ను బాధపెట్టలేను. అలా అని కోమల్ ని వదలలేను. కోమల్ ఈ యింటి కోడలు కాకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా వుంటాననీ చెప్పాడు. వంశ గౌరవం, పిల్ల రూపు రేఖలు ముఖ్యం, డబ్బుతో పనిలేదని తలచి నా ఆమోదం తెలియజేశాను అన్నయ్యగారూ! ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు తిన్నా తరగని ఆస్థి మాది మీరు కానీ ఖర్చు పెట్టక్కరలేదు. కోమలని నా యింటి కోడలిగా పంపండి చాలు..." అంటూ కోమలాదేవి వద్దకు నడిచి కోమల తల మీద చేయివుంచి ప్రేమగా తల నిమిరింది.
"మామగారూ! పిల్లలు తొందర పడతారని అంటారు గాని పెద్దల ముందు పిల్లలం ఎంత! మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని తెలిసి అతనితో హోటళ్ళు బీచ్ లో కలిసి కబుర్లు చెప్పిందని తెలిసి ఎవడైనా పెళ్ళి చూపులకి వస్తాడా? వచ్చి ఈ ప్రశ్న అడుగుతాడా? ఇదేం మీరు ఆలోచించలేదు నే అనటం. వెంటనే మీరు మీ అమ్మాయిని అడగటం సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటేనే చేసిన చిన్న తమాషా. చిన్న తమాషా మిమ్మల్ని బాధించకుండా వుండాలని.....మీ అమ్మాయిని నిప్పే కాందండి బాబూ! నిప్పు మీద పడ్డ వుప్పురాయి" అంటూ చిలిపి చూపొకటి కోమలా దేవివేపు విసిరాడు.
ముచ్చటగా మూతి బిగించుకుని చిరు కోపంతో చూసి మళ్ళీ తలదించుకుంది కోమలాదేవి.
ఏ భయంకరమైన సీను జరక్కపోవటంతో అక్కడి వాతావరణం చల్లగా హాయిగా మారింది. అందరి మనసులు తృప్తితో నిట్టూర్చాయి.
పెళ్ళి మాటలు అప్పుడే జరిగిపోయాయి. ఈ నెల దాటితే ముహూర్తాలు లేవని తెలిసి నెలలోనే పెళ్ళి జరగాలని ఇరువేపులవారు నిశ్చయించుకున్నారు.