Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 18



    సాయంత్రం కాఫీ, టిఫెన్లు అయ్యాయి. వంటకూడా తొందరగా చేసేసింది సీత.
    శరత్ బాబు ఫ్రెండ్ ఇంటినుంచి ఇంటికి ఇంకా రాలేదు.
    నీరద ఫ్రెండ్ యింటికెళ్ళోస్తానని వెళ్లింది, బుక్స్  యిచ్చిరావడానికి.
    రాఘవేంద్రరావు సీత కోరినవి తేవటానికి బజారువెళ్ళాడు.
    వెంకటరావు కింద  డిస్పెన్సరీలో రోగులను చూడటానికి రౌండ్ కెళ్ళాడు మేడ దిగి.
    సీత, శాంతకుమారి మిగిలిపోయారు.
    సీత ఈ ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు ఏ సంచీ, ఏ గుడ్డలతో అయితే  వచ్చిందో తనవయిన  అవిమాత్రమే తీసుకుంది. శాంతకుమారి వద్దకెళ్ళింది.
    "నాలుగు రోజుల అవసరం లేకపోయింది. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. రాత్రికీ వంట కూడా చేశాను. సెలవిప్పించండి." అంది సీత.
    సీత ఈ రోజే వెళుతుందనుకోలేదు శాంతకుమారి. సీత మాటలు విని తెల్ల  బోయింది. "అదేమిటి సీతా!" అంది.
    "మీ మంచితనం ఎప్పటికీ  మర్చిపోను." అంది సీత.
    "అదికాదు సీతా....."
    "క్షమించండి. ప్రశ్నలెయ్యవద్దు. నాకు మీపై ఎటువంటి కోపం లేదు. మిమల్ని అర్థం చేసుకున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకోకుండా వుంటే అంతే చాలు! ఇదిగో ఈ వంద రూపాయల నోటు రాఘవేంద్రరావుగారు ఇచ్చారు. ఎందుకిచ్చారో చెబితే అదో కల్పిత కథ అవుతుంది. తనది కానిది సీత కానీ ముట్టదని ఆయనతో చెప్పి ఆయన  వంద ఆయనకివ్వండి. నాకోసం బజారునుంచి ఏవేవోబహుమతులు తెస్తానన్నారు. నాకెందుకు చెప్పండి? ణా జ్ఞాపకార్థం ఆయన్ని వుంచుకోమనండి. సెలవు!" అంది సీత.
    "సీతా......"
    సీత వెనుతిరిగి శాంతకుమారిని చూడకుండానే "ఎందుకు....?" అంది.
    "ముందుగా మాట మాత్రం  చెప్పకుండా వెళ్ళిపోతున్నావ్ సీతా!"
    "ఇవాళగాకపోతే రేవయినా వెళ్ళాల్సిందే కదా!"
    "అదికాదు సీతా! నీకేదయినా ఇద్దామని."
    "నాకు తెలుసు నాపై జాలితలచి ఏదోఒకటి ఇస్తారని.... అందుకే  హఠాత్తుగా వెళ్ళిపోతున్నాను. మీరు ఏదో ఒకటి ఇవ్వటంలో తప్పులేదు. గొప్పవారు. నేను  తీసుకోటంలోనూ తప్పులేదు. న్నెఉ మామూలు వంటమనిషిని. కాని, మీరనుకున్నట్లు ఈ సీత......ఈ సీత....ఉహూఁ....అదే నాలోనే ఉండిపోనివ్వండి. సెలవు." సీత తిరిగి చూడకుండా  గబగబా మెట్లు దిగింది. సరాసరి వెంకటరావు వద్దకెళ్ళింది.
    వెంకటరావు బిజీగా  వున్నాడు. రూమ్ లో నలుగురు పేషంట్లు, వారి తాలూకా  వారు మరో అరడజను మంది వున్నారు.
    వెంకటరావు సీతని చూశాడు. "ఏమ్మా సీతా! ఇలా వచ్చావు?" అన్నాడు.
    "ఏం లేదు. మీతో ఏదో చెపుదామని వచ్చాను. ఇక్కడ మీరు డాక్టరు. పర్సనల్ విషయాలు చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పేషంట్ గా మీ వద్దకొస్తాను. అప్పుడు మీరు బోలెడు ప్రశ్నలేస్తారు. నేను, నాబాధ, గాధ గంటలతరబడి చెప్పొచ్చు. నమస్కారం." అని సీత రూమ్ లోంచి బయటికొచ్చేసింది.
    "సీత ఈరోజు ఏమిటిలా మాట్లాడింది? రాత్రికి భోజనాలప్పుడు కారణమేమిటో శాంతనడగాలి.  శాంతనెందుకు సీతనే అడిగితేసరి. అనుకున్నాడు డాక్టర్ వెంకటరావు.
    సీత కాంపౌండ్ గేటు దాటగానే ఎక్కడలేని నిస్సత్తువ వచ్చింది. అంజమ్మ హొటల్  కి నడిచివెళదామనుకున్న సీత రిక్షా పిలిచి బేరమాడింది.
    సీత నెక్కించుకున్న రిక్షా అంజమ్మ హొటల్ వైపు పరుగుతీసింది.
                                            16
    'అక్కడేదో జరిగింది, అందుకే ఇక్కడికొచ్చింది. లేకపోతే ఈ మొండి సీత మళ్ళీ ఈ హొటల్లో అడుగుపెడుతుందా....?' హొటల్లో  పనిచేసే అందరూ అనుకున్నారు. సీత కథ విన్న అంజమ్మ అనుకోలేదు. అందుకే సీత హొటల్ కి రాగలిగింది. ఎప్పటిలా తన స్థానం నిలబెట్టుకో గలిగింది.
    హొటల్ బాగానే వుంది.
    హొటల్ అంజమ్మ బాగానే వుంది.
    హొటల్లో సీత బాగానే వుంది
    హొటల్లో పనిచేసేవారే కాస్త మారారు. మగాళ్లు వాళ్ళల్లో కాస్త మార్పురాకుండా ఎలా వుంటుంది? సీత మామూలు పనిచేసే మనిషిలా లేదు. పనిచేసే మనిషికాదు, కాబట్టి మళ్ళీ వాళ్ళల్లో మార్పు వచ్చింది.
    సీతకి వున్నది తన తల, రెండు కళ్లు, అయినా ఓకంట అన్నీ కని పెడుతూనేవుంది.
    సీత రోజూ పైకి మామూలుగా వుంటూ లోలోపల తీవ్రంగా ఆలోచిస్తున్నది.
    'ఆ రోజు రాత్రి జరిగిందాన్ని గురించి ముగ్గురూ తీవ్రంగా తర్జన భర్జనపడి పూర్తిగా కాకపోయినా తను కావాలని నాటకం ఆడినట్లు, గ్రహించే వుంటారు. రూఢీ లేదు కాబట్టి మళ్ళీ అనుమానంతో నోరు మూసుకుని ఉండి వుండవచ్చు. తన బ్రతుకు  తంతే బూర్లె గంపలోపడ్డట్లు ఏ మహారాజు పుణ్యానో ఎగిరి బుట్టలోంచి భూమ్మీద పడుతున్నది. ఈ  వూళ్ళోవుంటే ఇంతేగతి. ఏ ఊరయినా పోవాలి. అక్కడ మాత్రం....?' ఇలా సాగేవి సీత ఆలోచనలు.
    ఆ రోజు సాయంత్రం బజారులో ఏదో ముఖ్యమైన పనివుండి సీతని కౌంటరు ముందుంచి అంజమ్మ వెళ్ళింది.
    తింటానికొస్తున్నారు కొందరు. తిని వెళుతున్నారు మరికొందరు. సీత బిల్లు తీసుకుని చెక్కకి బిగించిన మేకుకి గుచ్చి డబ్బుతీసుకుని తనపని తను చేసుకుంటున్నది.
    వరదరాజులు బుడ్డిగాడ్ని తీసుకుని హొటల్ కి వచ్చాడు. వరదరాజులు ఏం పని చేస్తాడంటే ఎవరూ చెప్పలేరు. వరదరాజులు చెప్పలేడు. ఓ ఉద్యోగం చేసేవాడయితే ఆ చేసే ఉద్యోగం పేరు చేవుతాడు. వరదరాజులు అలా కాదు. గంటకో ఉద్యోగం లాంటి పనిచేస్తాడు. అందుకని వరదరాజులు చేసేది ఫలానా ఉద్యోగం అని చెప్పలేం.
    వరదరాజులు ఎలా వుంటాడంటే సినిమా విలన్  వేషంతోవుంటాడు. అందుకే వాడ్నిచూస్తే గౌరవం కలగదు. భయపడేవాళ్ళకి భయం కలుగుతుంది.
    బుడ్డిచెంబు, మరుగుజ్జు వాళ్ళందరూ వాడ్ని బుడ్డిగాడు అని పిలుస్తారు. వాడెన్నాళ్లు బ్రతికినా, వాడిన్నేళ్లు వచ్చినా బుడ్డిగానే వుంటాడు. గాబట్టి వాడికాపేరు అతికినట్టు సరిపోయింది.
    అర్జంటు వార్తలు, టెలిగ్రాం లాంటివి ముఖ్య ప్రదేశాల్లోకి చేరేయటానికి బుడ్డిగాడు ఉపయోగపడతాడు. కాబట్టి వరదరాజులు వాడిని వదిలి పెట్టడు. వాడూ వరదరాజులుని వదిలిపెట్టాడు. జంటకవుల్లా తిరుగుతుంటారు.
    వరదరాజులు ఈమధ్య చాలా  చికాకుల్లో వున్నాడు. వరదరాజులో అన్ని విటమిన్లు పుష్కలంగా వున్నాయి ఏ మధ్యనే విటమిన్ 'యమ్' తక్కువయింది. తీరిక లేకకాదు, పని లేకకాదు. పెద్ద ప్లానేసి పెద్ద  పనిలో జొరబడితే ఎర్రటోపీలు ఏడు నెలలు కటకటాల్లో వుంచి, కమ్మని కూడెట్టి ఏడు నెలల తర్వాత  బయటికి పంపేశారు.
    అది వరదరాజులి పూర్వకథ. డబ్బుకోసం కటకట లాడుతూ, ఆకలితో నకనక లాడుతూ హొటల్లో దూరాడు వరదరాజులు, బుడ్డి గాడితో.
    ఆరు పెసరట్లు, ఎనిమిదిడ్లీ, నాల్గు చపాతీలు కౌంటరు ముందున్న సీతని  చూస్తూ ఆవురావురుమంటూ తింటున్నాడు వరదరాజులు.
    వరదరాజులి ముఖం చూస్తూ తింటున్నాడు బుడ్డిగాడు.
    వరదరాజులి తిండి పూర్తయింది. బ్రేవ్....మని తేన్చాడు. వేడి కాఫీ తెచ్చిన పుల్లరావుని ఆగమన్నాడు. పుల్లారావు ఆగాడు. 'ఏంటీ?' అన్నట్లు చూశాడు. వరదరాజులు కౌంటర్ వైపు చూస్తూండిపోయాడు. 'ఎవరు?' అన్నట్లు ఓసారి కనుబొమ్మ లేగరేశాడు.
    అంజమ్మకి, పుల్లారావుకి హొటల్లోవున్న మిగతావారికి వరదరాజులు తెలుసు. వరదరాజులి కథా తెలుసు. వరదరాజులికి ఫ్రీగానే కాఫీ, టీఫెన్ ఇచ్చి పంపిస్తుంది అంజమ్మ. అవసరం వచ్చినప్పుడు  ఇలాంటి వారి సహాయంఅవసరమవుద్దనిఅతన్ని గౌరవంగాచూస్తుంది అంజమ్మ. హొటల్లో మిగిలినవారూ గౌరవంగా చూస్తారు, వరదరాజులు ఆ గౌరవం నిలబెట్టుకున్నాడు.
    వరదరాజులు చోరుతెరిచి అడగకపోయినా గ్రహించిన పుల్లారావు టూకీగా సీత కథ  చెప్పాడు. కొట్టే, కట్టె, తెచ్చే, అంటే రామాయణగాథంతా తెలిసిపోయినట్లు- వచ్చింది, పోయింది , వచ్చింది. అని మూడు ముక్కల్లోచెప్పినా సీత కథంతా అర్థమయింది వరదరాజులుకి. "అహాఁ!" అని తలపంకించి కుర్చీలోంచి లేచాడు.
    సీత ఓ కంట వరదరాజుల్ని గమనిస్తూనే వుంది.
    కాఫీ, టిఫెన్ తిన్న వరదరాజులు బుడ్డిగాడితో బయటికి రాబోయాడు. ఎందుకైనా మంచిది. పొరపాటుపడితే బాగుండదని సీతని నఖశిఖ పర్యకతం చూశాడు- వస్తూ, వస్తూ.
    "బిల్లు, డబ్బులివ్వటానికి?" అన్నాడు వరదరాజులు. సీతతో మాట్లాడటానికి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ అక్కడే ఆగి పోయాడు.
    "బిల్లు తీసుకోకుండా తేరగా తిని బయటికి  పోవటమేనా......?" అంది సీత.
    "అడినడుగు-బిల్లెందుకివ్వలేదో?" మహా గీరగా అన్నాడు వరదరాజులు.
    "పుల్లారావ్___" గట్టిగా పిలిచింది సీత.
    పుల్లారావు పిలిపుకి సిద్దంగా వున్నవాడిలాగా పరుగెత్తుకుంటూవచ్చాడు.
    "ఈయనకి బిల్లెందు కివ్వలేదు?" అంది సీత.
    "ఆయనెప్పుడొచ్చినా బిల్లూ గిల్లూ వుండదు. ఊరికే తిని వెళతారు." పుల్లారావు వినయంగా చెప్పాడు.

 Previous Page Next Page