Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 15


    సీత పక్కున నవ్వింది.
    "అర్థరాత్రి అంకమ్మ శివాలనే మాటకి ఇదివరకు అర్థం తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఈ మాట పగలే అడగవచ్చుకదా?"
    "వేళాకోళం కాదు సీతా! నిజంగా అడుగుతున్నాను."
    "అర్జంటా?"
    "అవును, యమర్జంటు."
    "బుద్దిమంతులు, సహృదయులు."
    "అంతేనా!"
    "మీరలా నిరాశాపడితే ఇంకా చెపుతాను. అర్థరాత్రి ఆడపిల్లని అర్జంటుగా నిద్రలేపి యమర్జంటుగా ప్రశ్నలడిగే అమాయకులు."
    శరత్ బాబు ముఖం చిన్న బుచ్చుకున్నాడు.
    "నే అమాయకుడ్నా?"
    "అవును. చెడుతలపుతో నిద్రలేపితే దుష్టుడు అనేదాన్ని. మంచి బుద్దితోలేపారు కాబట్టి అమాయకులే. నిద్రలేపటానికి, అమాయకత్వానికి సంబంధ మేమిఅతంటారేమో? వంటరి ఆడపిల్లవద్దకు వంటరిగా ఓ  అబ్బాయి వస్తే అదేవరైనా చూస్తే ఏం జరుగుతుంది? ఆ పిల్లభవిష్యత్తు ఏమవుతుంది? ఆ మాత్రం అర్థం కాలేదా? కాలేదు కాబట్టే ఇలావచ్చారు. మీరు అతి మంచివారు, అమాయకులు.... నా అభిప్రాయం చెప్పాగా! ఇక వెళతారా?"
    "సీతా! అది కాదు...."
    "ఏది?"
    "నిన్ను ప్రేమిస్తున్నాను సీతా! నిజం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ"
    "నేను ఆ సంగతి ఎప్పుడో గ్రహించాను. నేను ఈ ఇంట్లో వంటమనిషిని. ఈ విషయం ప్రతినిమిషం నాకు గుర్తుంటుంది. మీరు మర్చి పోయారా? గుర్తించలేదా?"
    "సీతా! నువ్వు నన్ను ప్రేమించటంలేదా?"
    "నిజంచెప్పాలంటే 'ఊ' అనాలి."
    "సీతా! ఆనందంతో శరత్ బాబు మంచంమీదనుంచిలేవబోయాడు. 'కూర్చోండి' సీత గడమాయించటంతో కూర్చుండిపోయాడు.
    "ప్రేమ చాలారకాలుగా ఉంటుంది. విపరీతంగా పుస్తకాలు చదివేస్తుంటారు. ఆమాత్రం తెలియలేదా? మీచెల్లెలిని ప్రేమిస్తున్నారు. మీ అమ్మని ప్రేమిస్తున్నారు. మీడాడీని ప్రేమిస్తున్నారు. అలాగే నేనూ ఈ ఇంట్లో అందరినీ ప్రేమిస్తున్నాను, అమృతమూర్తులుగా గుర్తించి...."
    "ఆ ప్రేమకాదుసీతా! నే అడిగింది."
    సీత మాట్లాడలేదు.
    "ఓ స్త్రీ, పురుషునిమధ్య పరస్పర ఆకర్షణతో చేరువయ్యే ప్రేమ గురించి నే అడిగేది నేనలాగే పవిత్రంగా ప్రేమిస్తున్నాను. నీవూ నన్ను అలాగే ప్రేమిస్తే చెప్పు. ఆలశ్యంచెయ్యవద్దు సీతా! ప్లీజ్ చెప్పు."
    "చెపితే ఏంచేస్తారు?"
    "నా అంత అదృష్టవంతుడు లేడని ఆనందిస్తాను."
    "నాకొచ్చేది ఏమిటి? ఫలితము, ప్రయోజనము రెండూ చెప్పండి."
    "నిన్ను పెళ్ళాడుతాను." శరత్ బాబు ఆవేశంగా అన్నాడు. 
    "నేను వంటమనిషిని, మర్చిపోయారేమో?"
    "లేదుసీతా? ప్రతినిమిషం నాకు గుర్తుంటుంది. సీత నాయింట్లో వంటమనిషి అని! వంట.....మంసిహి అంటే అదేమైనా హీనమైనపనా? నా ఉద్దేశ్యం వంటచేసి కమ్మనిభోజనం తినిపించే ప్రతిమనిషీ ఓఅన్నపూర్ణ అని...సీతా! నేను చూసింది అంతస్తుకాదు, నాకు నచ్చినమనిషి అంతే. మొదటినుంచీ నాకోరికేమిటో తెలుసా? విడోనిగాని, అనాధాశ్రమంలో అమ్మాయినిగాని, అంగవైకల్యంకలదాన్ని అయినా సరే పెళ్ళాడాలని. కాని...సీతా! నువ్వు కనపడ్డావు....."
    "మీ ఆదర్శాలకు తిలోదకాలిచ్చారా?"
    "నీకంతా ఎగతాళిగావుండా సీతా! నిన్ను పెళ్ళాడటం ఆదర్శం కాదా?"
    "ఏం? నేను విడోనా? అనాధనా? అంగవైకల్యం కలదానినా? ఎలా కనపడుతున్నాను మీకు."
    సీతస్వరంలో తీవ్రతాకి కాస్త జంకాడు శరత్ బాబు "డబ్బు లేకనే కాదా సీతా! నువ్వు  మాయింట్లో వంటమనిషిగావుంది. పొమ్మంటే పోవాల్సిందేకదా? నిన్ను నే పెళ్ళాడి ఈ ఇంటికోడలిగా చేస్తున్నాను. అది ఆదర్శంకాదా?" నెమ్మదిగా అన్నాడు.
    "పెళ్ళయింతరువాత నన్ను ప్రతివారూ ఏమంటారో తెలుసా? ఓనాడు ఈ ఇంట్లో వంటచేసిమనిషి ఈఇంటి కోడలయింది అంటారు."
    "అననియ్, ఉన్నమాటేకదా."
    "అది మీకు బాధాకరం కాకపోయినా మీతల్లిదండ్రులకు బాధాకరమేకడా."
    శరత్ బాబు మౌనంవహించాడు. ఎందుకంటే ఈమధ్య తరచు వెంకటరావు, శాంతకుమారి, శరత్ బాబు పెళ్ళిగురించి మాట్లాడుకోటం__"ఫలానావారి అమ్మాయికి చెడ్డపేరుంది." "ఫలానావారి అమ్మాయి మన కోడలుకాదగిన అర్హతలేదు." "వియ్యానికైనా కయ్యానికైనా సమానం వుండాలి."
    ఈమాటలన్నీ శరత్ బాబు  విన్నాడు, సీత కూడా వింది.
    "సీతా! ప్రేమ బలీయమైంది. మనిద్దరిని మావాళ్లు కాదనరు. ముందు బాధపడ్డా తర్వాత సర్దుకుంటారు."
    "అయితే ఓపనిచేయండి. ముందు మన ప్రేమకథ మీతల్లిదండ్రులకి చెప్పండి. "మన ప్రేమకథ అన్నప్పుడు నొక్కిపలికింది సీత ఆమాటని.
    "ఇప్పుడే తొందరేముంది. సమయంచూసి చెపుతాను."
    "మంచిది. వాళ్ళతో చెప్పింతరువాతనే రండి. ఏది! ఇలా అర్థరాత్రప్పుడు." సీత కరుకుగా అంది.
    శరత్ బాబు ముఖం చిన్నబోయింది.
    "సీతా! నీవు నన్ను ప్రేమించటంలేదా?"
    శరత్ బాబు జాలిగా అడుగుతుంటే సీత స్త్రీహృదయం కరిగింది. హృదయాలు ద్రవించటంతో పనులుకావు. అదీగాక మెతకమనిషిఅయిన శరత్ బాబు మాటమీద  నిలబడతాడని నమ్మకంలేదు. ఇప్పటికే ఇంట్లో ఎంతోమార్పు వచ్చింది. ఈయింట్లో ఉండేదీ, ఊడేదీ, ఊడేది చాలా దగ్గరలో వుంది. ఇప్పుడు ప్రేమా, దోమా అంటే మొదటికే మోసంవస్తుంది. దీనిని పెంచటం కావాలని  నిప్పుల్లోదూకటం లాంటిది. కాబట్టి తనకోమనసున్నా, ఆ మనసుకి ఎన్నో ఆశలున్నా అవి పెంచుకోరాదు. మొలకలోనే తుంచేయాలి. ఆపని తను చేయలేదు, తనకో మనసుంది. అయినా తప్పదు.
    సీత మాట్లాడకపోవటంచూసి "జవాబివ్వు సీతా! నువ్వు నన్ను ప్రేమించటం లేదా?" అన్నాడు షరత బాబు.
    "నా గతం మీకు అక్కరలేదా శరత్బాబూ!"
    "అవసరంలేదు. గతం ఎంతహీనమైనదైనా ఫరవాలేదు."
    "గతం ఫరవాలేదు సరే మనిషి అపవిత్రమైనదైతేనో."
    "ఏమిటి సీతా! నేను అడిగేదేమిటి. కప్పుదాటుగా నీమాటలేమిటి?"
    "కప్పదాటుకాదు, వాస్తవం. నన్ను చెప్పనివ్వండి. మాకులం బోగంకులం. నాతండ్రి ఎవరో, ఏకులమో, తెలియదు. ఓ రోజుబలవంతానా నేను కొందరు విటులకి లొంగి పోయ్యాను. వాళ్ళ రాక్షసకృత్యాలకు భయపడి, బాధపడి ఇంట్లోంచి పారిపోయివచ్చాను. మగాళ్ళంతారాక్షసులుకాదని వాళ్లు చేసేపనుల్లో ఆనందం వుంటుందని ఒకనివల్ల తెలుసుకున్నాను. మంచివాడు అనుకున్నాను. అవసరం తీరగానే వాడూ తనదారి చూసుకున్నాడు. ఇదీగతం, బాగుందా?"
    "అబద్దం! అంతా అబద్దం సీతా! ఎందుకిలా అబద్దాలాడుతున్నావు?"
    "ఏం! నాగతం చేదుగావుందా? నాగతం విన్నతతరువాత ప్రేమ తగ్గిందా? పెళ్లాడుదామనేమాట మార్చి పోయారా."
    శరత్ బాబుమంచంమీదనుంచి లేచాడు. "సీతా! నాకు కావాల్సింది...." అంటూ చటుక్కున ఆగిపోయ్యాడు. కాస్తదూరంలో గుమ్మందగ్గర శాంతకుమారి నుంచునివుంది. తల్లినిచూశాడు. అందుకే ఆగాడు.
    సీత అప్పుడే చూసింది శాంతకుమారి దగ్గరకొచ్చింది.
    "అమ్మా! సీత తప్పేంలేదు. నేనేవచ్చి నిద్రలేపాను." జంకుతూనే నిజంచెప్పాడు శరత్బాబు.
    "అర్థరాత్రి ఎందుకొచ్చావు? ఎందుకు నిద్రలేపావు?"
    "అదికాదమ్మా. నువ్వు నమ్మితే....."
    "శరత్! నువ్వేం సంజాయిషీ ఇవ్వక్కరలేదు. ఊ....వెంటనే వెళ్ళు నీగదిలోకి. లేకపోతే మీనాన్నాగారిని లేపవలసివస్తుంది."
    గోల అవుతుందని శరత్ బాబు భయపడ్డాడు. "వెళతానమ్మా! సీత నేమీఅనకు. తప్పునాది. నేనే నిద్రలేపి ఏవేవోప్రశ్నలేసి వేధిస్తుంటే జవాబు చెపుతున్నది. అంతేనమ్మా. మామధ్య ఏమీ జరగలేదు."
    "శరత్! వెళ్ళమన్నాను వెళ్ళు." శాంతకుమారి తీవ్రతంతా ఒక్క మాటలో చూపిస్తూ అంది.
    శరత్ బాబు తలోంచుకుని "సారీ సీతా!" అని గబగబా వెళ్ళి పోయాడు.
    అన్నింటికీ సిద్దమైనదానిలా సీత అలాగేనుంచుది.
    "సీతా!"
    "ఆ...."
    "అంతా విన్నాను."
    "ఊ."
    "సీత!"
    "ఆ....."
    "సీత! ఆ....ఊ.....లు కాదు నాకు కావలసింది. నిన్ను నేను ఏమీ అనటంలేదు కూడాను. ప్రపంచంపోకడ తెలుసు, క్షణక్షణానికి మారే మనుషుల మనస్తత్వాలు తెలుసు, నువ్వు కల్పించిచెప్పే ప్రతికకథా తెలుసు, అయినా నీ మంచితనమూ తెలుసు, నువ్వు మంచిదానివయినా. నీ వంట రుచిగావున్నా. నీ మనసుకి బాధకలిగినా, నేచేసేదేంలేదు......" శాంతకుమారి ఆగింది.
    శాంతకుమారి ఏమి చెప్పబొతున్నదో సీత గ్రహించింది. "చెప్పండి మనసు.....గాయము....బాధ.....అన్నీ అలవాటైపోయాయి. మీరు కొత్తగా నావల్ల సమస్యలు, బాధలు కొనితెచ్చుకోవద్దు. చెప్పండి, ఏంచెయ్యమంటారో?"   

 Previous Page Next Page