Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 16


    "సీత ఎంతసూక్ష్మగ్రాహి? సీత నిజంగా వంటమనిషికాదు. ఐనా నేనేంచేయగలను? సీత ఇక్కడవుంటే పరిస్థితులు తీవ్రరూపందాల్చవచ్చు. శరత్ ఎదురు తిరగవచ్చు. ఏదీ  విషమపరిస్థితులకి దారితీయకముందే కఠినంగా వ్యవహరించకతప్పదు. "శాంతకుమారి గట్టినిర్ణయాని కొచ్చేసింది.
    "సీతా!"
    "ఆ...."
    "రేపటినుంచి....."శాంతకుమారి చెప్పలేకపోతున్నది.
    "చెప్పండి." తనూ ఓ గట్టినిర్ణయానికొచ్చిన సీత స్థిరంగా అంది.
    "రేపటినుంచి వేరేవంటమనిషిని చూసుకుంటాను."
    "అలాగే చేయండి. కాని, ఒకచిన్నమాట....."
    "అడుగు సీతా!"
    "నలుగురోజులు టైము ఇవ్వండి. రేపే అంటే నెను౮ నడిబజారులో నిలబడాలి. మీరు మరోసారి చెప్పకముందే ఇచ్చటినుంచి వెళ్ళిపోతాను. ఒక్క నాలుగురోజులు. చాలు. ఈ నాల్గురోజుల్లో మీకెలాంటి బాధ కలిగించను."
    "అలాగే సీతా! అలాగే, నేనూ మనిషినే. ఉన్నపళంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టను. నాలుగురోజుల తర్వాత....."
    "ఈ సీత ఎట్టిపరిస్థితులలో ఈ ఇంట వుండదు."
    "సీతా! నువ్వు నిజంగా....." శాంతకుమారి ఆగింది. ఆపై గొంతుపెగలక.
    "వంటమనిషి." సీత పూర్తిచేసింది ముఖం పక్కకు తిప్పుకుని.
    శాంతకుమారి ఓ గొప్ప డాక్టరుగారి భార్యకావచ్చు, ధనవంతురాలు కావచ్చు, ఇంటి యజమానురాలు కావచ్చు, అయినా తనింట్లో వంటచేసే మామూలుమనిషి సీతని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. సీతతో మాటలు పెంచలేక అక్కడినుంచి గబగబా వెళ్లిపోయింది.
    సీత చీరచెంగుతో కళ్ళుతుడుచుకొని మంచంకేసి నడిచింది.
                                           14
    మర్నాడు ఏమీ జరగనట్లు ఎవరికివారు ఉండిపోయారు.
    సీత ఉదయం కాఫీ, టిఫెన్ చేసింది. టైమ్ ప్రకారం మధ్యాన్నం వంటచేసింది.
    "రాత్రి అమ్మ సీతనేమీ అనలేదా? ఏంజరిగిందో?" అనుకున్నాడు శరత్ బాబు టిఫెన్ తింటూ.
    "నా నిర్ణయం మార్చుకొను. మార్చుకుంటే సీత ఇక్కడే వుండిపోతుంది.  పరిణామాలు విపరీతంగా తాయారవుతాయి. సీత మంచిది ఐనా లాభంలేదు." అనుకుంది శాంతకుమారి కాపీతాగుతూ.
    "శరత్! నువ్వు  మంచివాడివి, అంతే. నావాడివిమాత్రం కాలేవు." సీత మూగగా అనుకుంది.
    ఎప్పటిలా నీరద సరదాగా జోక్స్ వేస్తూ మాట్లాడింది. ఏంజరిగిందీ నీరదకు తెలియదు.
    వెంకటరావు టిఫెన్ బాగుందని మెచ్చుకుంటూ తిన్నాడు. ఏమిజరిగిందీ, ఏంజరగబోతున్నదీ వెంకటరావుకి తెలియదు.
    రాఘవేంద్రరావుకి లోలోపల మంటగావుంది. సీతసంగతి వివరంగా చెప్పాకదా, కోడలువిని మామూలుగావుందని ఇటు సీతపై, అటు శాంత కుమారిపై మండిపోతుంటే ఏంచేయాలో తోచక అయోమాయంలోపడ్డాడు.
    మధ్యాహ్నం వంట, ఇంట్లో అందరిభోజనాలు కాగానే శాంత కుమారితోచెప్పి ఇంట్లోంచి బైటపడింది సీత సరాసరి అంజమ్మహొటల్ కి దారితీసింది.
    సీతని చూడగానే అంజమ్మకి సంతోషంవేసింది. ఆరోజు సీత హొటల్ వదిలి వెళ్ళింతరువాత మళ్ళీ ఈరోజుదాకా సీతని చూడలేదు అంజమ్మ. "రా....రా...ఏంటీ ఇలా దారితప్పివచ్చావు?" అంది.
    "దారితప్పటం నాకు అలవాటులేదు. ఈవూరికి కొత్తదాన్నాఏమిటి? దారితప్పటానికి. రావాలని సరాసరి ఇక్కడికే వచ్చాను. ఏం? రాకూడదా?" అంది సీత.
    "అదిగో అలా మాట్లాడితేనే నాకు కోపంవచ్చేది. నే పొమ్మనలేదు. నాకు నీపై కోపంలేదు. నీవే కోపంతెచ్చుకు వెళ్ళిపోయావు." అంది అంజమ్మ కౌంటర్ ముందునుంచి లేచొచ్చి సీతచెయ్యి పట్టుకుంది.
    తననిచూసి అంజమ్మ సరిగ్గామాట్లాడుతుందో లేదో అనుకున్న సీత ఆప్యాయంగా అంజమ్మ పలకరించటంచూసి ఆనందంతో నోటమాటరాలేదు.
    కౌంటర్ లో కుర్రాడిని కూర్చోపెట్టి సీతతో పక్కగదిలోకినడిచింది అంజమ్మ.
    సీత రావటం గమనించిన కుర్రాళ్ళు సీతని పలకరించే ధైర్యంలేక ఏదోపనున్నట్లు ఓసారి గదిలోకి వచ్చి వెళ్ళిపోయారు.
    "ఏంటీసంగతులు? ఇన్నాళ్లు ఎక్కడున్నావు?" అంది అంజమ్మ.
    "ఇక్కడినుంచి వెళ్ళగానే అదృష్టం బాగుండి చిన్నఉద్యోగం దొరికింది. ఓవదిరోజులుచేశాను. కావాలని ఎవరోలంచంఇచ్చి ఆఉద్యోగం లాక్కుని పొమ్మన్నారు. మళ్ళీ నీవద్దకే వద్దామనుకున్నాను, ఇంతలో పెద్ద డాక్టరుగారింట్లో పనికుదిరింది. నెలకి ఎనభై రూపాయల జీతం కాఫీ, టిఫెన్, భోజనం. ఆరునెలలకోచీర అన్నీ బాగానేవున్నాయి. నాలుగు నెలలు చేశాను. ఇప్పుడు మళ్ళీ శనిపట్టింది." అంది సీత.
    "ఏమయింది?"
    "ఓరోజు బజారునుంచి వస్తున్నాను. మన హొటల్లో ఎవరోగాని నన్ను సీతా! సీతా!' అని పిలిచారుట. అది నేవినిపించుకోలేదు, వచ్చేశాను. నన్ను పిలవటం  డాక్టరుగారి పినతండ్రి విన్నాడు. సీత నీకెలాతెలుసు? ఏమిటి? అని అడిగాడుట. సీత హొటల్లోవుండగా నానాగొడవచేసేది. ఉత్త రౌడీపిల్ల. సీతని హొటల్లో చాలామంది పాడుచేశారు. హొటల్ అంజమ్మ మంచిదైనా సీతని హొటల్లో చాలామంచి పాడుచేశారు. హొటల్ అంజమ్మ మంచిదైన నా సీతని హొటల్లోంచివెళ్ళగొట్టింది. అదీఇదీకల్సించి చెప్పాడట.
    "ఎవడాచెప్పింది? పేరుచెప్పు. వాడినాలుక కోయించి దాన్ని వాడి చేతనే ముక్కలుగా తరిగించి ఈపూట సాంబారులో వేయిస్తాను." మండిపడుతూ అంది అంజమ్మ.
    "డాక్టరుగారి పినతండ్రికి వాడిపేరు తెలియదు. ఇంటికొచ్చి ఈకథ చెప్పాడు. ఇప్పుడుఅక్కడ నాఉద్యోగం ఊడేపరిస్థితి ఏర్పడింది. నిజంగా మనహొటల్లో ఎవరైనా ఈకథ కల్సించిచెప్పారా? లేక ఆ మూసలినక్క అంటే డాక్టరుగారి పినతండ్రి కల్పించాడా? అని తెల్సుకోవాలని వచ్చాను. బ్రతకలేకపోతే కృష్ణలోదూకైనా చస్తాగాని ముందు నిజం తెల్సుకోవాలి!" అంది సీత.
    "ఛా.....ఏంమాటలవి? అక్కడ ఉద్యోగంపోతే ఇంకోచోట ఉద్యోగం చూసుకుందువుగానిలే. ఈలోపల  నీకేం బాధలేకపోతే నాదగ్గరుందువుగాని. ఇంతకీ ఆమాట చెప్పినదెవరో ఎలా తెల్సుకోటం?"
    "నేచెపుతాగా? అందరినీ ఓసారి పలకరిస్తే అసలుకథ బైటికొస్తుంది." అంది సీత.
    "అయితే కానియ్." అంది అంజమ్మ.
    "ఆరోజు నన్ను పిలిచావట నేవినలేదు. మా డాక్టరుగారి పినతండ్రి విని చెప్పారు. వారితోపాటు ఇంటికి రాకపోయావా?" సీత అందరితో ఇదేమాట అంది.
    ఎవరికివారు "నువ్వెక్కడ మళ్ళీ మాక్కనపడ్డావు? మేమేం ఎరగం ఇవాళ చూడటమేనిన్ను" అన్నారు.
    బాలకృష్ణమాత్రం ఓరోజు ఆలంకార్ టాకీస్ వద్ద  బ్రిడ్జీమీద అటు పక్క సీతని చూసి పిలవటం, సీత వెళ్ళిపోవటం, ఆయనెవరో పలకరిస్తే మాట్లాడటం చెప్పాడు.
    బాలకృష్ణ మంచివాడు. పెళ్ళాం పిల్లలు వున్నారు. హొటల్లో వున్నవాళ్ళు పనిగట్టుకు సీతజోలికి రాలేదు. బాలకృష్ణ అబద్దాలల్లి తన మీదో కధ సృష్టించాడంటే సీతకి నమ్మబుద్ది కాలేదు. బాలకృష్ణని ప్రశ్న లేసి ఆరాలు తీసింది.
    సీత మంచిపిల్ల. అంజమ్మకి సీతంటే ఇష్టం. హొటల్లో అందరికీ సీతంటే ఇష్టమేగాని, కొందరికి భయమూ, ప్రేమ కూడా వున్నాయి. సీత ఎక్కడినుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. సీతదీవూరు కాదు. సీతకి ఎందుకో కోపం వచ్చి హొటల్ విడిచి పోయింది. సీత వెళ్ళిపోయింతరువాత అంజమ్మ అందరినీ తిట్టింది.
    ఈ మాటలుమాత్రమే చెప్పానని అదీ ఆయన మాటల్లోపెట్టి ఆరాలు తీశాడని బాలకృష్ణ చెప్పాడు.
    ముసలినక్క రాఘవేంద్రరావు కల్పించిన కథ అని సీత గ్రహించింది. రాఘవేంద్రరావు కథ.....రాత్రి శరత్ ని  తన పక్కమీద కూర్చుని వుండగా చూసిన శాంతకుమారి, అదలావుంచి తను సాక్ష్యాలు తీసుకెళ్ళి మంచిదనిపించుకున్నా, రాఘవేంద్రరావు తనని కోరింది బైటపెట్టినా ఫలితం వుండదు. తనకి, ఆ ఇంటికి బుణం తీరిపోయింది. బలవంతం బ్రహ్మణార్థంలా ఉంటే ఫలితాలు వికటిస్తాయి. ఏదీ జరక్కముందే, ఏదీ కాకముందే అన్నటైమ్ కి  ఆ ఇంట్లోంచి బై టపడితే అంతేచాలు. ఈ సీత మాటలు మార్చగలరు. మాట నిలబెట్టుకోనూగలదు." అనుకుంది సీత.
    "ఇప్పుడేం చేద్దాం?" అంది అంజమ్మ.
    "అదే, ఏం చేయాలో తోచటంలేదు." అంది సీత.
    "నే వచ్చి డాక్టరుగారింట్లో చెప్పనా?"
    "వద్దు. తప్పు చేయనిచోట తప్పుడు మనిషిగా కనిపిస్తే అది నా లోపం కాదు. ఆ ఇంట్లోవారి లోపం."
    "అయితే ఓ పని చెయ్యి, ఇవాళే హొటల్ కి వచ్చేవెయ్యి, నేనేం అనుకోను. నువ్వెళ్ళిపోయావని నేనెంత బాధపడ్డానో తెలుసా?" అంది అంజమ్మ.
    సీత హొటల్ కి రావటానికి ఒప్పుకుంది.
    అంజమ్మ, సీత ఓ  అరగంట మాట్లాడుకున్నారు.
    సీత తప్పకుండా వస్తానని చెప్పి డాక్టరుగారింటికి బైలుదేరింది.
    ఇంటికొచ్చిం తరువాత......
    "ఎక్కడికెళ్లొచ్చావని" శాంతకుమారి అడగలేదు.
    తనెక్కడికెళ్ళి వచ్చిందీ సీత చెప్పలేదు.

 Previous Page Next Page