Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 11


    "ఆ...ఇప్పుడు తగ్గుండాలి, తగ్గింది కదండీ?" సీత వినయంగా అడిగింది.
    రాఘవేంద్రరావు గుర్రుగా చూశాడు సీతని. ఏమీ అనలేక తగ్గింది అన్నట్లు తల వూపాడు.
    సీత మళ్ళీ మాట్లాడలేదు. చారులో తిరగమోత పెడుతూ అటు తిరిగినుంచుంది.
    వెనకటికెవరో "పడితేపడ్డాను, రాలితేరాలాయి పళ్ళు, డాక్టరుగారి ఇంటి గుమ్మంలోనే పడ్డాను లక్కీ ఫెలోని" అనుకున్నాడట. అలాగే రాఘవేంద్రరావుకి అక్కడినుంచి కదలబుద్ది కాలేదు. సీతతో కబుర్లేసుకుందామని బోలెడు సరదాగా వుంది.
    "సీతా?"
    "ఊ."
    "మొన్నోరోజు మా నీరద, ఫ్రెండ్స్ కి, రామాయణం పాత్రల గురించి గొప్పగా చెప్పావట...?"
    "గొప్పగా కాదు, తమాషాగా!"
    "అదే, తమాషాగానేలే, రామాయణం మొత్తం చదివానా సీతా?"
    సీత వెనక్కి తిరిగి ఓ చూపు రాఘవేంద్రరావువైపు చూసి, తిరిగి గ్యాస్ పొయ్యిమీదపడ్డ నూనె చుక్కల్ని తడుస్తూ వుండిపోయింది.
    "రామాయణమూ చదవలేదు, భారతమూ పరించలేదు."
    "మరెలా అంత వివరంగా చెప్పావ్?"
    "ఆ....అదేమంత కష్టం, చదివితేనే తెలుస్తాయా ఏమిటి? మీ ఈడు వాడే మా తాతయ్య వున్నాడు. ఆయనకెప్పుడూ రామా కృష్ణ తప్ప మరో మాట లేదు. పెద్దవాడు కదా? పెద్దవాడికి అంతకుమించి వ్యపకాలేముంటాయి చెప్పండి? రామాయణ, భారతాలు, ఆయనకు తోచినప్పుడు చెప్పేవాడు. ణా బుద్ది నిలకడగా వుండేటప్పుడు వినేదాన్ని. మా తాతయ్య...."
    సీత తనని తాతయ్యతో పోల్చటం రాఘవేంద్రరావుకి చేదుకషాయం చప్పరిస్తూ తాగుతున్నట్లుంది. సీత "తాతయ్య" అంటూ చెప్పబోతుంటే చేతులతో చాలు అన్నట్లు వారిస్తూ..."చూడు సీతా?" అన్నాడు.
    "ఏమిటండీ?"
    "నీకు దేముడు లేడా?"
    "ఏ దేముడు?"
    "ఏ దేముదేమిటి ?  దేముడు వున్నాడా, లేడా అని అడుగు తున్నాను."
    "దేముడంటే ఎలా తెలుస్తుందడీ? రాముడు దేముడే, కృష్ణుడే, కృష్ణుడు దేముడే, అల్లా దేముడే, ఏసుక్రీస్తు దేముడే, ఆఖరికి భర్తకూడా దేముడే ఇంకా వివరాలు చెప్పాలంటే మనిషికోదేముడు, మతానికో దేముడు, ఉన్నాడు."
    "ఏ ప్రసక్తి ఎత్తినా ఈ పిల్ల డొంకదారి తిప్పుతుంది. హారినీ....? ఎలా సరిఅయిన మార్గానికి సీతని రప్పించాలి? వయసులో వున్నప్పుడు తనకి ఎన్ని పేర్లుండేవో? మగువలపాలిట మహారశికుడని .... గ్రంధసాంగుడని .... ఎన్నో? వయసులోవున్న ఆడపిల్లలకి సినిమాలు, చీరలు, నగలు చాలా సరదాలుంటాయి. సీత సరిగ్గా మాట్లాడితే, చాటుగా కొన్ని కోరికలు తీరుద్దామనుకున్నాడు. తనేం మాట్లాడబోయినా సీత మాట మరో మార్గానికి తిప్పుతున్నదే? తన తెలివి దెనికి? తగలబడను? చూడాలి. సీత తెలివి గొప్పదో, తన  తెలివి గొప్పదో, ఆ....పిచ్చికమీద బ్రహ్మాస్త్రమా అని.... తెలివిదాకా పోవటం ఎందుకు? నాలుగు మాటల్లో పడగొట్టనూ?
    "అదేమిటి? మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు?"
    రాఘవేంద్రరావు తృళిపడ్డాడు.
    "అవును ఆలోచిస్తున్నాను."
    "ఏమిటి? దేముడ్ని గురించా?"
    "ఆ....ఆ...అదే, నీ దేముడు ఎవరు....అహా...కాదు....కాదు...నీకు దేముడు లేడా? అని కాబోలు అడిగాను."
    "పెద్దవారవుతున్నారు కదూ? మతిమరపు."
    "ఊ....సరేలే, ణా మతి బాగానే వుంది. నే అడిగింది నీకు భగవంతుడు వున్నాడా? లేడా? నాస్తికురాలివా? ఆస్తికురాలివా అని...."
    "నాస్తికూరాలినీ కాదు, ఆస్తికురాలిని కాదు."
    "అదేం, ఆ రెండూ కాకుండా ఎలా వుంటారు?"
    "ఎందుకుండరు? పూజలు, వ్రతాలు నాకు తెలియవు. నాకు లాటరీలో లక్ష వచ్చేటట్లు చేస్తే నీకు పదివేలు ఇస్తానని, దేముడికి లంచం ఇస్తాననే మొక్కు మొక్కుకోనూ. మనసుకి బాధ కలుగుతుందనుకోండి."భగవాన్! నువ్వున్నావా? ఉంటే ఇదేమిటి?" అని కనపడని దేముడిని ఓ ప్రశ్న వేస్తాను. లేకపోతే "భగవాన్" అనుకుంటూ ఓసారి కళ్ళు మూసి తెరుస్తాను. శరీరానికి గాయం తగులుతుందనుకోండి. "అబ్బా! అమ్మా!" అని తల్లి తండ్రిని తలుచుకుంటాను.
    ఇక్కడ ణా కాలికి దెబ్బ తగిలితే "అబ్బా, అమ్మా" అని పిలిస్తే ఎక్కడోవున్న తల్లితండ్రులు ఎలారారో, అలాగే ఇక్కడ నా మనసు బాధపడ్డప్పుడు "భగవాన్!" అన్నా మాట్లాడడు. సమయానుకూలంగా అయ్యని, అమ్మనీ, భగవంతుడినీ తలుచుకుంటూనే వుంటాను. కాబట్టి నేను నాస్తికురాలినీ కాదు, ఆస్తికురాలిని కాదన్నానే, కారణం వుండే అన్నాను. ఆస్తికురాలిచే అయితే వంట చేసుకు బ్రతికే ఖర్మేమిటండీ? కాలుమీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని, ఎవరిచేతనన్నా వంటచేయించుకుంటూ....వాళ్ళని వెధవప్రశ్నలేసి వేధిస్తూ....
    "సీతా!"
    "అదేమిటి? ఏముంది? అంత పెద్దగా పిలిచారు?"
    "సీతా!"
    "అరే. చెప్పమంటున్నాకదా?"
    అప్పుడే రాదనుకున్న శాంతకుమారి వచ్చింది. రాఘవేంద్రరావు జేవురించిన ముఖంతో ఏదో చెప్పబోతున్నాడు. "మామగారూ!" అన్న పిలుపు విని టక్కున నోరు మూసుకున్నాడు.
    "ఏంకావాలండీ?" అంది శాంతకుమారి. అర్థం ఎలావుందంటే "మీకిక్కడేం పని?" అన్నట్లు వుంది. ముఖ కవళికలు అలా మార్చి  శాంతంగానే  ప్రశ్నించింది. మామగారి సంగతి బాగా తెలుసు.
    రాఘవేంద్రరావుకి వెంటనే ఏంచెప్పాలో తెలియలేదు. తడబిడ పడ్డాడు. శాంతకుమారి వస్తుందని అనుకోలేదు. "మరి....మరి...." అంటూ ఆగాడు.
    "తలనొప్పి, కాఫీకావాలని వచ్చారండి. కాఫీ ఇచ్చాను. కాఫీతాగుతుంటే ఎందుకో పొలమారింది. మంచినీళ్ళిచ్చాను. తర్వాత "దేముడున్నాడా? లేడా? నీకు ఆస్తివుందా అని ఏమిటో అడుగుతుంటే జవాబిస్తూ వంటచేస్తున్నాను. ఇంతలో మీరోచ్చారు," అంది సీత.
    "నీకు ఆస్తివుందా? యిల్లుందా? వాకిలుందా? అని నే అడిగానా?" రాఘవేంద్రరావు కోపం దిగమింగుకుంటూ అన్నాడు.
    "అలా అడగలేదనుకోండి. ఎలా అడిగారంటే మొదటేమో, అంటే రాగానే అన్నమాట...." 
    సీతమాటలు ఎక్కడిల్సివస్తుందో అని "ఊ సరేలే" అంటూ రాఘవేంద్రరావు వెళ్లిపోయాడు.
    శాంతకుమారి, సీత వంటింట్లో మిగిలిపొయ్యారు. నొసలుముడేసి పరిశీలనగా సీతనుచూస్తూ ఉండిపోయింది శాంతకుమారి. ఏంజరగనట్లుగా సీత ముఖం పక్కకు తిప్పుకుంది.
    "సీతా!"
    "ఏమిటండీ!"
    "అహ, ఏంలేదు వంటయిందా?"
    శాంతకుమారి ఏదో అడగాలని పిలిచి మళ్ళీ అడగటం ఎందుకులే అని మాటమార్చిందని సీత  గ్రహించింది.
    "అయిదు నిమిషాలయింది వంటయి. గ్యాస్ మీద చిందిన నూనె చుక్కలు తుడుస్తూ నుంచున్నాను. వేపుడుకూరలుచేస్తే నూనె చిందక తప్పదు. గ్యాసుమీద పడకతప్పదు. దాందేముందిలెండి. తడిగుడ్డతో తుడిస్తే అదేపోతుందిలే అంటే పోదు. గ్యాసు పాడవుతుంది."
    "అవునవును" అంది శాంతకుమారి అర్థంచేసుకుని.
    "మీకుతెలియంది ఏముంది చెప్పండి" అంది సీత.
    శాంతకుమారి మెచ్చుకోలుగా సీతముఖం చూసింది. సీతముఖంలో ఏభావం వ్యక్తంకావటంలేదు.
    "సీతా! నువ్వు నాకు నచ్చావు. మెచ్చుకుంటున్నాను."
    "వద్దండి" వెంటనే అంది సీత.
    "అదేం?"
    "ఓవిషయానికి మెచ్చుకోవచ్చు. మరోవిషయానికి నొచ్చుకుని నొప్పించవచ్చు. నావిషయంలో ఎవరుమెచ్చుకున్నా నొచ్చుకున్నా భరించలేనండి. కారణంలేకుండా నొప్పిస్తే అసలు భరించలేను. నా గురించి మీరెలా అనుకున్నా అది మీ మనసులో ఉంచుకోండి. మీమనసు నాకు తెలుసుకాబట్టి మీరేమనుకున్నా నాకు గౌరవమే కలుగుతుంది."
    శాంతకుమారికి ఏంమాట్లాడాలో తెలియలేదు.
                                            10
    "సీతా! ఓసీతా!"
    రెండోసారి నీరద పిలిచింతరువాత సీతకి నీరదపిలుపు వినపడింది. వస్తున్నాననిచెప్పి టవల్ కి తడిచేతులు తుడిచి హాల్లోకి వెళ్లింది. సీతని చూస్తూనే నీరద "గుడ్న్యూస్ సీతా! గుడ్ న్యూస్" అంది.
    "ఏమిటి."
    "అమ్మా! అంతతొందరగా చెపుతానా."
    "ప్రస్తుతం చేయవలసినపనిలేదు. ఏపనీలేక ఏమీతోచక వంట గదిని సర్డుతున్నాను. కాబట్టి నాకేంతొందరలేదు. మీయిష్టమొచ్చినప్పుడే చెప్పొచ్చు."
    "అలాఅంటే నావుషారు చచ్చిపోతుంది. గుడ్ న్యూస్ అనగానే ఏమిటీ! ఏమిటీ! అని తొందరపడిపోవాలి."
    "ఏమిటి....? ఏమిటి....?" సీత తెలుసుకోవాలని మహాఆతృత పడుతున్నట్లు ముఖంపెట్టి అంది.

 Previous Page Next Page