సీత పూర్తి చేయలేదు. నీరద, శారద, జానకి పక్కున నవ్వారు. శాంతకుమారి కూడా నవ్వకుండా వుండలేకపోయింది.
వాళ్ళ నవ్వులు పూర్తయిందాకా ఆగింది సీత.
ఇప్పుడు సీత గురించి చెపుతాను. సీతపాత్ర బలహీనమైనది. కీలు బొమ్మలా ఎటుతిప్పితే అటు తిరిగేరకం. ఓ వ్యక్తిత్వం అంటూ లేదు. కష్టాలుపడటానికి, కన్నీళ్లు కార్చటానికి స్త్రీ జాతి వుండాలి అన్నట్లు రామాయణం మొత్తంమీద ప్రవర్తిస్తుంది. సీతని చూసి మనం నేర్చుకోవలసింది బొత్తిగా ఏమీలేదు. ఖర్మకాలి సీతని ఆదర్శంగా తీసుకుని, కష్టాలుపడుతూ, కన్నీళ్ళు కారుస్తూ, పడున్నామనుకోండి. మరోవెయ్యేళ్లు పోయినా స్త్రీ జాతికి విముక్తి వుండదు. ఈ మగాళ్ళు కాస్త అనుమానం పిశాచంగాళ్ళయితే, మాటకు ముందు, మాకు అగ్నిలో, పో.....పాతాళలోకానికి, అంటూ ఇంకా ఇంకా చంపుతూనే వుంటారు. అన్ని రంగాలలో మగువలకే ఉన్నతస్థానం, అన్ని పదవులలో అతివలదే ముందంజ, అన్ని కబుర్లూ, ఆడాళ్ళు ఆనాడు ఇంట్లో ఓ మూల పడి ఏడ్చేవారు, ఈనాడు వీధిలో తిరిగే స్వాతంత్రం పోంది, ఏదో ఓ కారణాన ఏడుస్తున్నారు. కారణం వెన్నెముక లేని సీతలు, ఆ సీతలను ఏడుపిస్తున్న రావణులు. సీత చెప్పటం ఆపింది.
సీత గురించి సీత చెపుతుంటే ఏవరూ మాట్లాడలేదు.
"రాముడు, సీత, రావణుడు, అయ్యారు. లక్ష్మణుడి గురించి చెపుతాను. లక్ష్మణుడి దోరకంతెలివి. అన్న రాముడు రాజు, అతన్ని అనునరిస్తే రాముడిపక్క తన పేరుంటుందని ఏదో ఆశపడ్డాడు. లేక స్త్రీ పై కోరిక బొత్తిగా లేదేమో, పెళ్ళాంపేరు తలవకుండా అన్నతోపడి అడవి కెళ్ళిపోయాడు. పద్నాలుగేళ్ళు అన్నగారితోపాటుతను వనవాసం చేస్తే తన పెళ్ళాంగతి ఏమిటి? అని ఆలోచించాడా? పెళ్ళాం అంటే బొత్తిగా లక్ష్యం లేని లక్ష్మణుడు భర్తగా ఏ ఆడదానికీ తగడు. అతడ్ని నే లెక్కచేయను ఐ డోంట్ కేర్," ఎవరూ మాట్లాడకపోవటం చూసి సీత మళ్ళీ మొదలు పెట్టింది. "బహుశా ఊర్మిళకూడా భర్తప్రవర్తన సహించలేక పద్నాలుగేళ్లు నిద్రపోయే కొత్తరకం ఆనాటి గార్దినాల్ టాబ్లెట్స్ వాడివుంటుంది."
"హాయ్...., హాయ్.....జోక్ పేలిపోయింది." నవ్వుతూ అంది శారద.
"ఉంటే ఎంతబాగుండును?" అంది జానకి.
"నీకెందుకే?" అడిగింది నీరద.
"ఎందుకేమిటి? ఓటాబ్ లేట్ మింగి పడుకుందామని చూస్తున్నది." శారద అంది.
"తల్లీ! మళ్ళీ నీవు నిద్రలేచేటప్పటికే, సగం ముసలిదానివయిపోతావు. ఎందుకొచ్చిన గోల నోరుమూసుకు విందూ!" కోప్పడింది నీరద.
"భరతుడ్ని గురించి రెండుముక్కలు చెప్పి ముగిస్తాను. దీన్నింకా పెంచకండి. అవతల నాకు వంటటైమ్ కూడా అవుతున్నది." అంది సీత.
"సరే." అన్నారు ముగ్గురూ.
"చాపకింద నీళ్ళలాగా కొందరు చల్లగా మెల్లగా వచ్చి చేరతారంటారే ఆ మాట భరతుడికి వర్తిస్తుంది. పిరికితనంలో కూడా ఏ ఎండకా గొడుగు పట్టే తెలివుంది. భరతుడికి రాజ్యం చేయాలని వుంది. యుద్ద మంటే భయం. ఆఖరికి అన్నగారిని చాటుగా దెబ్బకొడదామన్నా దైర్యంలేదు. రాముడు అడవులపాలయ్యాడు. ఓ పద్దానుగేళ్ళపాటు హాయిగా రాజ్యం చేసుకోవచ్చుకదా? ప్రజలేమనుకుంటారో అని భయం. లోకులు కాకులు "వీడుచూడు అన్నావి అడవులపాలుచేసి హాయిగా రాజ్యం చేస్తున్నాడు" అనొచ్చు. అందుకని.....రాముడి పాదుకల తీసుకొచ్చి సింహా సనంమీద ఆ పాదుకల వుంచి హాయిగా ఓపక్క తనకి అన్నంటే ఎంతో గౌరవం అని చెపుతూ రాజ్యం చేశాడు. భార్యతో సుఖ భోగాలు అనుభవించాడు. భార్యతో సుఖభోగాలు అనుభవించటం నువు చూసొచ్చావా? అని అంటారేమో? రాజ్యం చేస్తున్నావాడు భార్యతో కాపురం చేయకుండా వుంటాడా? అని నా అనుమానం.
రాముడి పాదుకలుతెచ్చిన భరతుడు రాముడిమీద గౌరవంవుండి కాదు. రాముడు తిరిగేది అడవిలోకదా? రాముడికాళ్ళల్లో ముళ్లు విరగాలని....విషప్పురుగులు కాలికి కుట్టాలని.... ఎదురురాళ్ళ దెబ్బలు కాళ్ళకి తగిలి గాయాలుకావాలని....అబ్బో....! ఆలోచించి చాలా పెద్దఎత్తువేశాడు. ఫలించలేదు.
పద్నాలుగేళ్ళ తర్వాత రాముడు తిరిగి రావచ్చాడా? ఈలోపలే అడవిలో కృరమృగాల పాల్బడి ఏదో అయిపోతాడు అనుకున్నాడు. రాముడు ఏదో అయిపోతే రామాయణం ఏమవుతుంది? కాబట్టి...రాముడు నిక్షేపంగా తిరిగి రావటం, వెంట బోలెడు కోతిమూక, ఇదంతా చూసి హడలి పోయాడు భరతుడు. వెంటనే అన్నగారికి ఎదురెళ్ళి సగౌరవంగా ఆహ్వానించి, "ఈ రాజ్య భారం ఎప్పుడొదులుతుందా? అనుకున్నాను. నువ్వొచ్చావ్ నా కష్టాలు తీరాయి." అని రాజ్యం అప్పగించి చల్లగా పక్కకి తొలిగిపొయ్యాడు. మంచివాడనిపించుకున్న ఈ భరతుడి వెనుక ఇంత కథ వుంది." అంటూ సీత ముగించింది.
"బాబోయ్! ఏ పాత్రకాపాత్ర బలంగా, బరువుగా వుంది. ఏదిరాస్తే ప్రయిజోస్తుందో? సీతా! నీవోపని చెయ్యకూడదూ?" అంది నీరద.
"ఏవని?"
"భరతుడి పాత్ర తీసుకుని వ్యాసం రాయి. ప్రెయిజు రావచ్చు"
"ఓహ్, ఆపనా? ఏదో తమాషాగా నాలుగుముక్కలు మాట్లాడాగాని వ్యాసాలు రాయటం నాకేం వచ్చు? నాకొచ్చిందల్లా వంటచేయటం, అంతే. అరే..., మాటలతో టైము చాలా అయినట్లు గమనించనేలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి." అంది సీత.
"ఊ." అంది నీరద.
"ఫరవాలేదు. నాకధే కాదు రామాయణం కూడా మార్చగలను. నా గీత తప్ప" అనుకుంటూ లేచి వెళ్ళింది సీత.
"చాలా బాగా చెప్పింది కదూ?" జానకి అంది.
"రోజూ ఎక్కువ మాట్లాడదు. మాట్లాడిన నాలుగు మాటలూ చాలా పదునుగా వుంటాయి. ఒక్కోసారిమా కెంతో ఆశ్చర్యం కలుగుతుంటుంది. పొరపాటున భగవంతుడు సీత ముఖాన వంటలుచేసుకుని బ్రతుకు అని రాశాడేమో, ధనవంతుల కుటుంబంలో సీత పుట్టివుంటే గ్యారంటీగా కలెక్టరో, అంతకన్నా ఇంకా పెద్ద ఉద్యోగమో చేసేది, ప్చ్...ప్చ్......ప్రాప్తం లేదు." నీరద అంది.
"ధనవంతుల ఇళ్ళలో పుట్టినవారికి అందరికీ చదువులొస్తున్నాయేమిటి?" అంది శారద.
"నిజమే." వెంటనే ఒప్పుకుంది నీరద.
ముగ్గురూ సీతచెప్పిన మాటలు మననం చేసుకుంటూ వ్యాసం ఎలా రాయాలా అని ఆలోచనలో పడిపొయ్యారు.
శాంతకుమారి మాత్రం "ఏమిటో, ఈ సీతని చూస్తుంటే వంట మనిషి అనిపించటంలేదు." అనుకుంది.
9
సీత గ్యాస్ స్టవ్ మీదనుంచి కుక్కర్ దించింది, ఓపక్క చారు గిన్నె ఎక్కించి రెండోపక్క బంగాళాదుంపలు వేయించటానికి బూర్లె మూకుడు లాంటి డిష్ ఎక్కించింది. గ్యాస్ పొయ్యి రెండువేపులా మండుతున్నది. సీతకి వున్నది ఒకటే హృదయమైనా అది పలురకారలుగా మండుతున్నాది.
డిష్ లో నూనె కాగింది, సీత బంగాళాదుంపలు నూనెలో వేసింది. ముక్కలు అటూ, ఇటూ కదుపుతుండగా రాఘవేంద్రరావు వంటగది గుమ్మంవద్దకొచ్చి గుమ్మానికి అటోచెయ్యి, ఇటోచెయ్యి ఆనించి సీత వెనకవేపు చూస్తూ నుంచున్నాడు.
ముక్కలు వేగాయి.
రాఘవేంద్రరావు గుమ్మంలో అలాగే నుంచున్నాడు.
వేగిన ముక్కలలో కారం ఉప్పు చల్లటానికి.....ఉప్పుసీసా, కారం డబ్బా తేవటానికి సీత వెనక్కి తిరిగింది.
రాఘవేంద్రరావు కంగారు పడ్డాడు. "మరి....మరి..." అంటూ మరి దగ్గరే ఆగిపొయ్యాడు. మరి సీత వెనక్కు తిరుగుతుందని రాఘవేంద్రరావు అనుకోలేదు కదా?
సీత గ్రహించింది, చిన్నగా నవ్వింది.
సీత నవ్వుముఖం చూసి రాఘవేంద్రరావు... తను అనవసరంగా కంగారుపడ్డానని, తను చాలాసేపటినుంచి గుమ్మంలోనుంచోటం సీత చూడలేదని అనుకుని స్థిమితపడ్డాడు. తనూ నవ్వాడు.
"ఏంటిలా వచ్చారు?" అంది సీత ఉప్పుసీసా తీస్తూ.
"మరి.... ఆహా... కాస్త తలనొప్పిగా వుంది, కాఫీ యిస్తావేమో అని...?"
"దానికేం భాగ్యం కాఫీయేగా.....,ఇస్తాను." అంది సీత.
రాఘవేంద్రరావు ప్రాణం హాయిగా వుంది. శాంతకుమారి తనకి తెలిసినవాళ్ళింటి కెళ్ళింది. వెంకట్రావు డిస్పెన్స్ నరీలో వున్నాడు. పిల్లలిద్దరూ కాలేజీకెళ్ళారు. సీతతో ఒంటరిగా మాట్లాడటానికి సమయం చిక్కింది. సీత ముఖం ఎప్పుడూ ధుమధుమలాడుతున్నట్లో తీవ్రంగా అనబోతే తమాషాలోనే కారం గూటించి తిప్పి అదేమాట కొడుతుంది. అలాంటిది. అలాంటిది ఈరోజు నవ్వింది. నవ్వుతూ అంది కాఫీ ఇస్తానని....
"అందరూ అలాగే అంటారు. నా.....చేతి రుచి చూసినావాళ్ళు మాత్రమేనండోయ్!" అంది సీత కారండబ్బా మూత తీస్తూ.
చేతిరుచి అంటే రెండర్థాలుగా తోచాయి. రాఘవేంద్రరావుకి.
"బాగుంది సీతా! నువ్వన్నీ తమాషాగా మాట్లాడతావు. మేం నీచేతివంట రుచి చూశాముగాబట్టి బాగుందన్నాము. రుచి చూడనివారు బాగుందీ లేనిది ఎలా చెపుతారు?"
"తమాషాకాదండి! కొందరు వంటచేస్తారు. చాలా బాగా చేస్తారు. రుచి అద్భుతంగా....అమోఘంగా....వుంటుంది. ఏం లాభం. అందరూ వంట బాగుండదని అనొచ్చు. కొందరు బాగుండలేదని అనొచ్చు. ఎందుకంటారు?"
రాఘవేంద్రరావుకి సీత అన్నది నిజంగానే అర్థంకాలేదు.
"చేసిన వంట బాగుంటే బాగుండలేదని ఎలా అంటారు? వాళ్ళది నాలుకా, తాటి పట్టా?"
"రెండూ కరెక్టే, నాలుక, తాటిపట్టాగాకుండా ఇంకోటి వుంది బుద్ది."
"బుద్ధా! రుచికి, బుద్దికి ఏం సంబంధం?"
సీత వెంటనే ఏం అనలేదు. ఫిల్టర్ డికాషన్ రెడీగా వుంటే కాఫీ కలిపి ఇచ్చింది.
"నువ్వూ కాస్త తాగు." రాఘవేంద్రరావు అన్నాడు కాఫీగ్లానందుకుంటూ.
"నాకు తల నొప్పిలేదు. అనవసరంగా ఒకటికి రెండుసార్లు కాఫీ తాగాననుకోండి. సైత్యం ఎక్కువయి, వెధవ ప్రేలాపన పేలతాను. అప్పుడేమవుతుంది? ఎదుటివారిని ఈడ్చి చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుంది. ఎందుకొచ్చిన గోల."
"ఏంటో!" రాఘవేంద్రరావు కాఫీతోపాటు నాలుక చప్పరించాడు.
"ఏంటో, ఏమిటండీ? ఇందాక రుచికి బాగా వంటకాలున్నాయనుకోండి, అయినా కొందరికి నచ్చావు. కారణాలు బోలెడు. ఓ ఆమెకి మరో ఆమెకి మనస్పర్థలున్నాయనుకోండి, మొదటి ఆమె కమ్మగా వంటచేసినా రెండో ఆమె కావాలని "కూర ఉప్పు కషాయం, పచ్చడి తినబోతే కారం, పులుసు తినబోతే పళ్లు పులిసే పులుపు, ఛీ....ఛీ....ఛా....ఛా...ఇది వంటా? లేక...? అంటూ సవాలక్ష వంకలు పెడుతుంది. కారణం...?బుద్ది.
ఓ వంటమనిషి వుందనుకోండి, ఆమె అష్టావకృడి చెల్లెలివుండవచ్చు. ఆమె చేసే వంట అమృతంలా వుండవచ్చు, కొందరు వంటని అద్బుతంగా వుందని మెచ్చుకొని తింటే, మరికొందరు ఆమె రూపంతో వంటకాలు పోల్చుకుని ఏవగించుకోవచ్చు, ఇదోరకం బుద్ధి.
ఓ జగదేక సుందరి మొదటిసారిగా గరిటపుచ్చుకుని గిద్దెడుపప్పుకి రెండు గిద్దల ఉప్పువేసి, కిలో వంకాయలకి రెండుకిలోల పచ్చిమిరపకాయల కారము తగిలించి వంట చేసిందనుకోండి, వంట రుచి మాత్రమే చూసేవాళ్ళయితే ఉప్పు ఎక్కువయింది, కారం ఎక్కువయింది అంటూ వున్నమాట చెపుతారు, అలాగాక కొందరు వెర్రిపీనుగలున్నారనుకోండి. ఏంచేస్తారు. ఉప్పు ఎక్కువయినా, కారం ఎక్కువయినా, నిజం చెప్పరు ఆ సుందరి రూపం మదిలోనిలుపుకుని "ఆహా....పప్పు బాగుంది, ఓహొ..... కూర బాగున్నది. కడు రమ్యంబుగా మరీ మరీ తినబుద్దేస్తుంది." అంటూ అన్నం ముద్దలతోపాటు ఇంకోరకం గుటకలుకూడా మింగుతుంటారు. చాచి లెంపకాయ కొట్టేవాళ్ళేక....," సీత అభినయం చేస్తూ అంది.
రాఘవేంద్రరావు తన్మయత్వంలో గుటకలేస్తూ కాఫీ తాగుతున్నాడు. కాఫీ మామూలుగాను, గుటకలేయటం సీతనిచూసి, సీతచెప్పేది వింటూ. ఎప్పుడయితే సీత "చాచి లెంపకాయ" అందో, తాగుతున్నా కాఫీ గొంతుకడ్డంపడి పోలమారింది. దగ్గి మాడుమీద కొట్టుకున్నాడు.
"ఎబ్బే అలా చిన్నగా కాదు. కాస్త మాడు అదిరేటట్లు కొట్టుకోవాలి. ఎవరో మిమ్మల్ని బాగానే తలుచుకుంటున్నారు. అరే, ఇంకా దగ్గు తగ్గలేదే? ఈ మంచినీళ్ళు తాగండి. గ్లాసెడు గటగటా తాగండి. ఊ.... ఊ...." ఉప్పు, కారం చేతులు కడుక్కున్న నీళ్ళు ఇచ్చింది సీత.
రాఘవేంద్రరావు నిజంగానే గ్లాసెడు నీళ్ళు మూడు గుక్కల్లో తాగాడు. సీత వెంటనే ఖాళీగ్లాసు తీసుకుంది. నీళ్ళు తాగింతరువాత రాఘవేంద్రరావుకి అనుమానం వచ్చింది.