Previous Page Next Page 
భవ బంధాలు పేజి 26


    అలా అరగంట నీళ్ళలో కూర్చుని లేచి పైకి వచ్చాడు రాజారావు. నైటు సూటు తొడుక్కుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. తొమ్మిదిన్నర . పిల్లలిద్దరూ సిల్కు నైట్ డ్రస్సుల్లో ఫోమ్ బెడ్ల మీద. ఎయిర్ కూలర్ చల్లపరచిన గదిలో నిద్రపోతున్నారు ప్రశాంతంగా! వాళ్ళ ఆయా క్రింద పడుకుని గుర్రుపెడుతూ నిద్రపోతుంది. అదృష్టవంతురాలు. నిట్టూర్చాడు రాజారావు. వంగి, పిల్లలిద్దర్ని ముద్దు పెట్టుకున్నాడు..... కర్టన్లు లాగి నెమ్మదిగా గదిలోంచి బయటికి వచ్చాడు. అంతా మరచి పిల్లలతో హాయిగా కాసేపు గడపడాని కన్నా నోచుకోలేదు తను. వాళ్ళ టైము తన టైము కుదరదు ప్రొద్దుట ఎనిమిది గంటలకే లేచి తయారై బ్రేక్ ఫాస్ట్ తీసుకుని పైకి వచ్చేసరికే ఇద్దరూ కారులో కాన్వెంటు కి వెళ్ళిపోతారు. రాత్రి తను వచ్చేసరికి నిద్రపోతారు. ప్చ్! .....ఏం బ్రతుకో ! పిల్లలకి, మంచి ఇంగ్లీషు సినిమా..... పిల్లల సినిమా వచ్చింది తీసికేడతానని ప్రామిస్ చేశాడు. రోజూ కంటే ముందు బయలుదేరాడివాళ ! వెధవలు కూలీలందరూ కట్టకట్టుకుని ఘోరవో చేశారు రెండుగంటలు! రాస్కెల్స్, డర్టీ రోగ్స్ ! షూట్ చేసి పారెయ్యాలి వెధవల్ని! రోజూ స్ట్రయికులు, ఘోరావోలు! రోజుకోసారి జీతం పెంచాలి! తిండి లేని వెధవల్ని పిలిచి కూలియిస్తే తల తిరుగుడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్న కొద్దీ పెరుగుతుంటాయి. వాళ్లనని ఏం లాభం? వాళ్ళని నేత్తెక్కించుకుని తమ మీదకి ఉసిగొల్పే ప్రభుత్వాన్ని అనాలసలు! వెధవ ఫ్యాక్టరీలు మూసిపారేసి, ఏదో ధరకి అమ్మి పారేసి, ఆ ఉన్న డబ్బుతో ఎక్కడో ప్రశాంతంగా జీవితం గడపాలనిపిస్తుంది. కానీ!....లాభం లేదు యిదో ఊబీ! యిందులో దిగాక మరి లేవలేరు; యీ జీవితం అందించే సౌఖ్యాలపై లోభం తమని ఆ ఊబిలోంచి పైకి రానీయదు !.....
    పదిగంటలు కొట్టింది! ఆవిడ గారి కోసం ఎదురు చూడడం దండగ! రాజారావు లేచి డైనింగ్ రూములోకి వెళ్ళాడు. కునికి పాట్లు పడుతున్న వంటవాడు గాభరాగా లేచి అన్నీ అమర్చాడు. టేబిల్ మీద! భోజనం అయిందనిపించుకుని ఇవతలకి వచ్చాడు. బెడ్ ప్రక్కన లాంప్ స్విచ్ నొక్కి ఓ యింగ్లీషు నవల తీసుకున్నాడు చదవడానికి. పదకొండు కొట్టాక కాసేపటికి బయట కారు చప్పుడు వినిపించింది..... దాంతో పాటు నవ్వులు, బైబైలు గుడ్ నైట్లు వినిపించాయి. కూనిరాగం తీస్తూ కులాసాగా లోపలికి వచ్చిన రమని పుస్తకం లోంచి చూశాడు రాజారావు. రమతో పాటు ఖరీదయిన వింత సెంటు పరిమళం గదంతా అలుముకుంది. ఆ సెంటు తమది కాదు! ఎవరిదో రాజారావుకి తెలుసు. రాజారావుని చూసి కూనిరాగం ఆపింది రమ బ్యాగు డ్రస్సింగ్ టేబిల్ మీదికి విసిరి, అద్దంలో వయ్యారంగా తన అందం చూసుకుంది. సావకాశంగా ఫాషన్ గా చుట్టిన సిగలోంచి పిన్ను లన్నీ లాగింది. జుత్తు బుజాల మీదకి జారెట్టు బ్రష్ చేసుకుంది. కర్టెను లాగి బట్టలు మార్చి నైలాన్ నైట్ గౌను తొడుక్కుంది. బాత్ రూము కి వెళ్ళి ముఖం కడుక్కుని పౌడరద్దుకుని వచ్చింది. డైనింగ్ రూములోకి వెళ్ళి భోజనం చేయనని వంటవాడితో చెప్పి వచ్చింది. ప్రక్కదగ్గరికి వచ్చి తలగడలు సర్దుకుని పడుకోబోయింది. అంతా ఒక వంక కనిపెడ్తున్న రాజారావు వళ్ళు ఉడికిపోయింది. ఎంత నిర్లక్ష్యం! ఎంత తల తిరుగుడు! మొగుడన్న మనిషి ఎదురుగా వుంటే చూడనైనా చూడనట్టు, పలకరించకుండా ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో కట్టుకున్న మొగుడుండగానే బయట ఎలాంటి వేషాలు వేస్తుంది?...... హు...... తనే కొమ్ములు యిచ్చాడు మొదట! .... యీ రోజు విచారించి ప్రయోజనం ఏమిటి? ..... పరువు, ప్రతిష్ట కోసం అన్నీ సహిస్తున్న కొద్దీ మరింత చెలరేగుతుంది ....... ఎన్నాళ్ళిలా ...... రాజారావు ఎంత అణచుకుందామని ప్రయత్నించినా ఆవేశం అణగలేదు. నెమ్మదిగా పుస్తకం ప్రక్కన పెట్టాడు.
    "టైమెంతయిందిప్పుడు?" రమ మొహంలోకి సూటిగా చూశాడు రాజారావు.
    "పదకొండున్నర ....." అతి వినయంగా జవాబిచ్చింది.
    "ఇంతవరకు యిల్లు గుర్తురాలేదా?" కోపం వస్తున్నా సౌమ్యంగానే అడిగాడు.
    "వచ్చింది గాబట్టే వచ్చాను....' నిర్లక్ష్యంగా పడుకుంది రమ.
    "ఏం, పాపం తులానీ యింట్లో పడుకోలేక పోయావా , ఇంత రాత్రి రాకపోతేనేం ....."
    రమ గిరుక్కున తిరిగి తీక్షణంగా చూసింది..... ఏదో విసురుగా అనబోయి వూరుకుంది.
    "ఏం మాట్లాడవు? ....అర్ధరాత్రి వరకు యిల్లు పట్టకుండా తిరగటంలో నీ ఉద్దేశం ఏమిటి?" తీక్షణంగా అడిగాడు.
    "ఇంట్లో తోచకపోతే క్లబ్బుకి వెళ్ళడం తప్పా? తమరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీ లో కూర్చుంటే నేనిక్కడ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలా?" రమ గొంతు హెచ్చించింది.
    'తోచకపోతే ....అర్ధరాత్రి వరకు పరాయి మగవాళ్ళతో త్రాగి తందనా లాడుతున్నారా అందరాడాళ్ళు....నీకో మొగుడున్నాడన్న సంగతి గుర్తుందా అసలు?"
    "ఏం గుర్తుండక పోవడానికి నా మతి సరిగానే వుంది యింకా ...."
    "రమా , నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు..... ఇదివరకు చాలాసార్లు చెప్పాను...... మళ్ళీ చెపుతున్నాను..... ఇలా చూస్తూ నే నూరుకోను. ఎన్నాళ్ళో .....అనవసరంగా నన్ను రెచ్చగోట్టకు.....హు....నా యింట్లో నా ఉప్పు తింటూ..... నా ఎదురుగానే నీ నాటకాలు ఆడుతున్నావు....ఇది ఎంత మాత్రం సహించను....." కోపంగా అరిచాడు రాజారావు.
    రమ అడపులిలా ఆవేశంగా లేచి కూర్చుంది. "ఏం బెదిరిస్తున్నారా నన్ను....ఈ బెదిరింపులకు దడవడానికి నేనేం చిన్న పిల్లని కాను..... మీ క్రింద దాసీదాన్నీ కాను.... మీకంత కష్టంగా వుంటే మీకెలా నచ్చితే ఆవిధంగా చేసుకోండి..... అంతేగాని ప్రతిరోజూ ఈ బెదిరింపులు మానండి.....' విసురుగా పడుకుంది రమ.
    రాజారావు నిట్టూర్చాడు....లాభం లేదు! ....రమని తనేం చెయ్యలేడు! తనది ఉత్త బెదిరింపు మాత్రమే నని రమకి తెలిసిపోయింది. అందుకే అంత నిర్లక్ష్యం! లక్షల కధికారి రాజారావు భార్యని వదిలేశాడని లోకం చెప్పుకోడం తను భరించలేడు! పరువుకోసం, ప్రతిష్ట కోసం హాలాహలం అమృతంలా మింగుతాడు. ఆ సంగతి రమకీ తెల్సు. అందుకే లేక్కచేయ్యటం లేదు తనని. సంఘంలో హోదా కొసం , పరువు కోసం రమ, తను భార్యా భర్తలలాగ .....అన్యోన్య దంపతులుగా నటించాలి తప్పదు. ఈ సొసైటీ లైఫ్. ఈ అడంబరాలకి దాసోహ మనక తప్పదు తనలాంటి వారు.
    రమ.... ఎంత నిశ్చింతగా నిద్రపోతుంది. అదృష్టవంతులు అందరూ! ఎయిర్ కూలర్లు, డన్ లప్పిల్లోల మధ్య కూడా నిద్రకి నోచుకోని దురదృష్టవంతుడు తను..... ఎందుకీ లక్షలు తనకీ! ఇంటా బయటా కూడా సౌఖ్యము లేని బ్రతుకు..... ఈ సంగతి ఎందరికి తెలుసు?....
    ఆలోచనలకి స్వస్తి చెప్పి, లైటార్పి బలవంతాన కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టని రాజారావు కళ్ళముందు.....రమ, తులానీ, ఫ్యాక్టరీ ఘోరావ్ చేస్తున్న కూలీలే కన్పిస్తున్నారు. పాపం లక్షాధికారి రాజారావుకి నిద్ర ఎలా పడ్తుంది ?

                                 ***

 Previous Page Next Page