Previous Page Next Page 
అర్చన పేజి 4

    "ఏంటండి ఇది? కోడలు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి? అబ్బాయి మనకీ విషయం తెలియచేయకపోడం ఏంటి? పట్నంలో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా బతుకుతున్నారనుకుంటున్నాం. అందుకేనా, అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా, రావడానికి కుదరదు, క్షమించు అంటూ రాస్తున్నాడు. భగవంతుడా! ఏంటి ఏం చేశావు? కోడలు ఎందుకిలా చేసింది? ఏం జరిగింది వాళ్ళ మధ్య. కనీసం మాకు మాటమాత్రం చెప్పకుండా పెళ్ళిచేసుకుని తీసుకొచ్చినా, లక్ష్మీదేవిలాంటి పిల్ల ఇంటికోడలైందని మురిసిపోయి ఆదరించామే. అందుకేనా మాకీ శిక్ష?"
    ఆవిడ వెక్కిళ్ళ మధ్య తన ఆవేదన వెళ్ళబోసుకుంటుంటే మౌనంగా వింటోన్న కృష్ణస్వామి, కొంతసేపటికి స్వరం విప్పాడు "తాయారూ!" ఆయన స్వరం గంభీరంగా పలికింది.
    "నెమ్మదించు కర్తఃవ్యం ఆలోచించు. తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తోన్న పరువు, ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంటగలిసిపోకుండా, అలాగని ఈ పసివాడికి మన వలన అన్యాయం జరక్కుండా ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచించు. నేను ఈ రోజే హైదరాబాదు వెడతాను. అబ్బాయిని కలుస్తాను. అసలేం జరిగిందో, అమ్మాయి ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిందో? వాడు మనకీ విషయం తెలియచేయకుండా ఒక్కడే కుమిలిపోవడానికి కారణం ఏమిటో అంతా తెలుసుకుని వస్తాను. ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి, మన బందువులకూ తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నీది. ఈ విషయం నీకూ, నాకూ, సూరయ్యకీ తప్ప ఇంకెవరికీ తెలియకూడదు" అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం పరపరా చింపి మూలకి విసిరేసి, దివాన్ మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నుయ్యి దగ్గరకు నడిచాడు.
    తాయారమ్మ మాత్రం ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడి ఉండి నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగింది.
    
                * * * *

    ఏలూరు వెడుతోన్న బస్సులో కూలబడింది అర్చన. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది.
    ఎవరూ తనని చూడకూడదనుకుంది. అందుకోసం ఎంతో సాహసం చేసింది. కానీ, సూరయ్య చూడనే చూశాడు. సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆపాదమస్తకం వణికింది.
    కొంపదీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా!
    "అమ్మాయిగారూ!" అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. భయంతో వణికిపోతోంది. సూరయ్య చూశాడు. కేవలం అత్తగారికీ, మావగారికీ మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది ఎలా? ఇప్పుడెలా? ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకు తిరగ్గలరు?
    వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామిగారంటే ఊరివారందరికీ ఎంతో గౌరవం, మరెంతో అభిమానం. పవిత్రతకూ, పరమనిష్ఠకూ మారుపేరైన కృష్ణస్వామిగారు ఇవాళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా! కృష్ణస్వామిగారి కోడలు, పిల్లవాడిని కని ఊళ్ళో వదిలేసిపోయింది అని ఈపాటికి ఊరంతా గుప్పుమని ఉంటుంది.
    చచ్చిపోయిందనుకున్న కోడలు తిరిగి రావడం ఏంటి? పిల్లవాడిని వదిలేయడం ఏమిటి? ఇంతకాలం ఎక్కడ తిరిగిందో? ఆ దిక్కుమాలిన పిల్లాడిని ఎవరికి కన్నదో?
    అర్చన నిలువునా వణికిపోయింది. తప్పకుండా జనమంతా తనని అసహ్యించుకుంటారు. మావగారిని, అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చి గుచ్చి చంపుతారు. వాళ్ళని చూసి నవ్వుతారు. అబ్బ ఎంత్ గొప్ప కోడలు అని హేళన చేస్తారు. ఉన్నతమైన కుటుంబానికి కోడలైన తాను వాళ్ళకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది. ఇదేనా వాళ్ళు తనకు చేసిన ఉపకారానికి, తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం? ఇదేనా చూపవలసిన కృతజ్ఞత! అర్చనకి దుఃఖం ఎగధన్నుకు వస్తోంది. మనసంతా వేదనతో నిండిపోయింది. తను పొరపాటు చేసిందా? ఖచ్సితంగా ఇది పొరపాటే. కానీ, చేయక తప్పలేదు.
    పాపం పెద్దవాళ్ళు!
    కొడుకు తమని సంప్రదించకుండా, తమతో ఒక్కమాట కూడా చెప్పకుండా పెళ్ళిచేసుకుని నేరుగా వాళ్ళ ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళినా, ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు. బాగా చదువుకుని ఉన్నతస్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు, చదువు అర్దాంతరంగా ఆపేసి, హఠాత్తుగా పెళ్ళి చేసుకుని వస్తే, ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటికోడలిగా స్వీకరించారు. నిష్కల్మషమైన ప్రేమా, ఆప్యాయతని అందించారు. అలాంటి అత్తగారిని, మావగారినీ వంచించింది, వాళ్ళ స్వచ్చమైన ప్రేమని కాలదన్ని.... ఛీ... అర్చనకి తనమీద తనకే కోపం వచ్చింది. 'ఎందుకెళ్ళావు అర్చనా? ఏం సాధించావు?' అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది.
    అర్చన కళ్ళనుంచి కన్నీళ్ళు చెంపలమీదకి జారాయి. నెమ్మదిగా చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది.
    పల్చగా పరుచుకుంటున్న వెలుగురేఖల మధ్య చల్లని ప్రభాతవేళ మంచిపనులు చెయ్యమంటారు పెద్దలు. తనేం చేసింది? దారుణం చేసింది. ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాడిని, తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుడిని... అనాధలా వదిలేసి వచ్చింది. మావయ్యగారు బాబుని స్వీకరించారా? అక్కున చేర్చుకుని ఆదరిస్తారా? నిజంగా వాళ్ళబ్బాయి రక్తమేనని, వాళ్ళ వంశాంకురమే అని నమ్ముతారా? అక్రమసంతానంగా భావించి బాబుని ఏ అనాధాశ్రమంలోనో వదిలిపెడతారా? తానలాంటిది కాదని వాళ్ళని నమ్మించేదెలా?
    అనాధ....! నో బాబు అనాధ కాకూడదు! అర్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది. బస్సు చాలా వేగంగా వెళుతోంది. దారి అస్తవ్యస్తంగా ఉన్నా, ఎగుడు దిగుళ్ళను దాటుకుంటూ, ఎత్తి ఎత్తి వేస్తూ వేగంగా వెడుతోంది. ఎలాగోలా ప్రయాణీకులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని.
    "లాభం లేదు. వెళ్ళలేదు. ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకుని పోయి ఉంటాయి. తను ఇంక వెళ్ళలేదు. ఎన్నటికీ వెళ్ళలేదు."        అర్చన కళ్ళు మూసుకుంది. ఆ మూసుకున్న కాళ్ళ వెనకనుంచి, అస్పష్టంగా ఏవో ఆకారాలు....ఏవో సంఘటనలు..... ఎన్నో జ్ఞాపకాలు....తరుముతున్నకొద్దీ వెంటబడుతున్నట్టుగా తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు.
    
                                                                             * * * * *

    సికింద్రాబాదు స్టేషనులో గోదావరి ఎక్స్ ప్రెస్ ఆగింది. చేతి సంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు.

 Previous Page Next Page