యాదగిరి నరసింహ పేరు చెబితే రోగాలు పరార్
యాదగిరి నరసింహ పేరు చెబితే రోగాలు పరార్
వైద్యో నారాయణో హరిః అన్నారు. అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానమని అర్థం. అవును నారాయణుడు కూడా వైద్యుడే. అందరికన్నా పెద్ద వైద్యుడు. తనలోని వైద్యుడిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడు. యాదగిరి గుట్టలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం వుండదని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారన్న నమ్మకం భక్తులో బలంగా వుంది.
యాదగిరి గుట్ట కొండ మీద వున్న నృసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తవ్వించాడని, ఈ పుష్కరిణికి వ్యాధులను నయం చేసే శక్తి వుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. యాదవ మహర్షి ఎవరో కాదు... ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదవ మహర్షి. ఆయనకు విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని వేడుకోన్నా డట. అప్పుడు స్వామి గండ భేరుండ నరసింహ స్వామి, జ్వాలా నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి రూపాలు ధరించి కనిపించాడు.
అప్పుడు యాదవ మహర్షి స్వామిని ఎప్పుడూ తన కళ్ళ ఎదుటే ఉండి పొమ్మని కారాడు. దాంతో స్వామి ఇక్కడే ఉండి పోయాడు. ఇక్కడి ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలున్నాయి. అందులో ఒకటి సింహరూపం. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ మీద గండభేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలానరసింహ, యోగానంద నరసింహమూర్తులు ఉండటం విశేషం నరసింహస్వామి దేవాలయాలకు ఒక ప్రత్యేకత వుంటుంది.
దేశంలో ఎక్కడ నరసింహస్వామి దేవాలయం వున్నా, మూల విరాట్ కొండ గుహలోనే వుంటుంది. ఎందుకంటే సింహం కొండ గుహల్లో వుంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే వుంటుందని చెబుతారు. ఈ పద్ధతి ప్రకారం యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండగుహలోనే వుంటుంది.