నరసింహ జయంతి… ఆ మంత్రం చదివితే ఆపదలు దూరం!

 

రేపే నరసింహ జయంతి… ఆ మంత్రం చదివితే ఆపదలు దూరం!

 

ఇందుగలడందు లేడని

సందేహమువలదు చక్రిసర్వోపగతుం

డెందెందువెదకి చూచిన,

నందందే గలడు దానవాగ్రణి వింటే!

ఈ పద్యం విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడికీ, అతని తండ్రి రాక్షసుడైన హిరణ్యకశిపునికీ మధ్య జరిగే సంవాదం మాత్రమే కాదు! ఎప్పుడు కష్టంలో ఉన్నా, రక్షించేవారు లేరనే అధైర్యం కలిగినా, భయభ్రాంతుల్లో ఉన్నా… తను ఆర్తిగా పిలిస్తే, దైవం పలికి తీరుతుందనే నమ్మకాన్ని బలపరుచుకునేందుకు ప్రతి భక్తుడూ గుర్తు చేసుకునే పద్యం. ప్రహ్లాదుని నోటి నుంచి ఈ పద్యం వెలువడగానే… స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహుడు అవతరించింది వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ మే 25న.

మత్స్య, కూర్మ, వరాహావతారాల తర్వాత తొలిసారి విష్ణుమూర్తి మానవాకృతిలో కనిపించిన రూపమిది. తనకు గాలిలో కానీ, నేల మీద కానీ, నిప్పుతో కానీ, నీటితో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, అస్త్రాలతో కానీ,
శస్త్రాలతో కానీ… అంటూ హిరణ్యకశిపుడు తన మరణం గురించి ఏకంగా 21 కోరికలు కోరుకున్నాడు. వాటన్నింటినీ అనుసరించి. నర-సింహావతారంలో, ప్రదోషకాలంలో, గడప మీద, తన వాడి గోళ్లతో ఆ
రాక్షసుని అంతం చేశాడు.

వైశాఖశుక్ల చతుర్దశి, స్వాతినక్షత్రం నాడు అవతరించారు నరసింహమూర్తి. ఆ తర్వాత ప్రహ్లాదుని కోరిక మేరకు ఈ భూమి మీద స్థిరంగా నిలిచిపోయి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. ముఖ్యంగా తెలుగువారి
జీవితంలో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. ఆయన కోసం తెలుగునేల మీద వెలసిన క్షేత్రాలు ఓ అద్భుతం! వాటిలో వేటికవి భిన్నమైన పూజలతో కొనసాగడం విశేషం.

మంగళగిరిలో పానకాలస్వామిగా, సింహాచలంలో చందనం ధరించే అప్పన్నగా, అహోబిలంలో నవనారసింహునిగా… తెలుగువారి ఇష్టదైవంగా వెలుగుతున్నారు. నరసింహుని యాదగిరిగుట్ట తెలంగాణకే తలమానికంగా మారింది. కదిరి, మాల్యాద్రి లాంటి ప్రదేశాలలోనూ ఆయనకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. నరసింహ జయంతి రోజున ఈ పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

నరసింహ జయంతి రోజు ఇంట్లో ఆ మూర్తిని ఆరాధిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ స్వామి రూపు లేకపోయినా, విష్ణుమూర్తినైనా ఈ రోజు పూజించుకోవాలి. ఈ రోజున ‘నృసింహ చతుర్దశి వ్రతం’
చేసే ఆచారం కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. ఒకవేళ ఇవేవీ కుదరకపోయినా…

‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’ అనే నారసింహ స్తోత్రాన్ని చదువుకుంటే ఎలాంటి ఆపదలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

నరసింహుడు ఉగ్రమూర్తి. కానీ ఆ ఉగ్రత్వం తన భక్తుల పాలిట కాదు… వారిని వేధించే ఆపదల పాలితే. స్వామి ఉగ్రరూపంతో ఉరిమితే మృత్యువైనా ఆమడదూరం వెళ్లిపోవాల్సిందే.

 

- మణి