నమో నారసింహా (నేడు నృసింహ జయంతి)

 

నమో నారసింహా (నేడు నృసింహ జయంతి)

 

వైశాఖ మాసం ఎంతో శ్రేష్ఠమైనది అనటానికి మరో కారణం ఈ మాసంలో వచ్చే నృసింహ జయంతి. విష్ణుమూర్తి అవతారాల్లో నాలుగో అవతారమైన నృసింహ అవతారం సగం మనిషిని, సగం సింహాన్ని కలిగి ఉంటుంది. భక్తులను హింసిస్తూ పాపాలను మూటకట్టుకున్న హిరణ్యాక్షుడుడిని సంహరించటానికి ఆ స్వామి ఈ అవతారాన్ని ప్రదర్శించిన రోజునే మనం నృసింహ జయంతిగా జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి నాడు వచ్చే ఈ నృసింహ  జయంతిని మన ఆలయాల్లో పెద్దఎత్తున వైభవంగా జరుపుతారు.

 

ఇందుకలడు అందులేడని సందేహం వలదు అని అణువణువునా ఆ శ్రీహరినే చూసిన భక్త ప్రహ్లాదుడి మాట వమ్ము కాకుండా స్థంభంలో నుంచి బయటపడిన నారసింహుడు హిరణ్యాక్షుడిని వధించి ఆ కోపంలో ఉగ్ర నారసింహుడిగా అవతారమెత్తుతాడు. ప్రహ్లాదుడి విన్నపం మేరకు ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టి నారసింహుడిగా కూడా అనేక చోట్ల వెలిసాడు.

 

మన పురాణాల ప్రకారం నరసింహుడిని పూజిస్తే ఆపదాలన్నీ నశిస్తాయట. ఎంతటి ఆపదలో ఉన్నవారైనా నియమ నిష్టలతో ఆ స్వామిని కొలిస్తే ఆపదల నుంచి గట్టేక్కుతారని ప్రతీతి. నరసింహ కరావలంబం చదివి శరణు వెడితే కష్టాలు మన దరికి చేరవు అలాగే రుణ విమోచన నారసింహ స్తోత్రం చదివితే అప్పుల బాధలు సమసిపోతాయి కూడా.

మన తెలుగు రాష్ట్రాల్లోని  నారసింహ క్షేత్రాలలో యాదగిరి గుట్ట, కదిరి, మంగళగిరి, వేదాద్రి, సింహాచలం మొదలైనవి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. నృసింహ జయంతి రోజు వేదాద్రిలోను, మంగళగిరిలోనూ కళ్యాణం జరిపిస్తారు. ఈ రోజు పానకం, వడపప్పు దేముడికి నైవేద్యంగా పెడతారు చాలామంది. శ్రీరామనవమికి, నృసింహ జయంతికి పానకం నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టటంలో కూడా ఒక రహస్యం ఉంది. ఇవి ఎండాకాలంలో రావటం వల్ల ఈ కాలంలో బెల్లం, యాలకులు, మిరియాలు వేసిన పానకం తాగటం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే వడపప్పు అంటే పెసరపప్పు తిన్నా కూడా చలవ చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనకోసమే అనటానికి మరో నిదర్శనమే ఈ ఆచారాలు.

నృసింహ జయంతి నాడు ఎంతో మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజు ఆ నారసింహుడిని స్మరించి  

                                               మాతా నృసింహ, పితా నృసింహ

                                               భ్రాతా నృసింహ, సఖా నృససింహ

                                               విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ

                                              స్వామి నృసింహ , సకలం నృసింహ

అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో కష్టాలనేవి దగ్గరకి కూడా రావు. నృసింహ ఉపాసన చేస్తే అది ఒక రక్షణ కవచంలా మనని నిత్యం కాపాడుతూ ఉంటుంది. అందరం ఆ నార సింహుడిని కొలిచి అతని కృపకు పాత్రులమవుదాం.

- కళ్యాణి