నృసింహ జయంతి రోజు ఈ మంత్రాలు చదివితే విజయమే!
నృసింహ జయంతి రోజు ఈ మంత్రాలు చదివితే విజయమే!
విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖశుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలన్నీ ఘంటాపధంగా చెబుతున్నాయి. తెలుగునాట ఇష్టదైవంగా కొల్చుకునే ఈ అవతారానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాలు దాల్చే సందర్భంలో... మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తర్వాత మానవాకృతిని పోలిన తొలి అవతారం ఇది. భక్తుల ఆపదలను తీర్చేందుకు భగవంతుడు ఎక్కడి నుంచైనా, ఏ రూపంలో అయినా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారం ఇది.
హిరణ్యకశిపుడు చాలా తెలివిగా నరులతో కానీ, మృగాలతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంటగానీ, బయటగానీ, ప్రాణమున్నవాటితో కానీ, ప్రాణం లేనివాటితో కానీ, ఆకాశంలో కానీ, నేల మీద కానీ- అంటూ చాంతాండ జాబితా చెప్పి, వాటితో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మను కోరతాడు. ఇన్ని షరతులనీ దాటుకుని విష్ణుమూర్తి స్తంభాన్ని బద్దలుకొట్టుకుని నరసింహుని రూపులో వచ్చే విషయం తెలిసిందే. పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో, ఇంటాబయటా కానీ గడప మీద, ప్రాణమున్నా లేనట్లుగా తోచే గోళ్లతో, ఆకాశమూ నేల మీదా కాకుండా తన ఒడిలో ఉంచుకుని హిరణ్యకశిపుని అంతం చేస్తాడు.
హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు. ఆ నృసింహుని జయంతి నాడు నృసింహ మూర్తిని పూజిస్తే, జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.
నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుప రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
- నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు.
- ‘నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్’ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట.
- ‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం.
- నిర్జర.