ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం గురించి ఈ నిజాలు తెలుసా..
ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం గురించి ఈ నిజాలు తెలుసా..
రాముడు భారతీయులకు ఆదర్శ పురుషుడు. ఆయన అనుసరించిన ధర్మం, న్యాయం, ఆయన వ్యక్తిత్వం ప్రతి మనిషికి అనుసరణీయం. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత భారతీయులలో రామ భక్తి మరింత స్పష్టం అయ్యింది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడ ఉంది? దీని విశేషాలేంటి? తెలుసుకుంటే..
రామ విగ్రహం..
దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన రామ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహం కాంస్యంతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయానా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు నవంబర్ నెల 28వ తేదీ న ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ తో పాటు ఇతర రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు సహా ప్రముఖులు కూడా హాజరయ్యారు.
విగ్రహం రూపొందించిందినది ఎవరంటే..
అయోధ్య రామ మందిరం నిర్మాణం సమయంలో బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి పేరు దేశమంతటా మార్మోగింది. అలాగే ఇప్పుడు గోవాలో ఎత్తైన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి కూడా ప్రస్తావనకు వస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన ప్రఖ్యాత శిల్పి రామ్ మతార్ ఏ గోవాలోని ఎత్తైన రాముడి విగ్రహాన్ని కూడా రూపొందించారు. ఈ రాముడి విగ్రహం 77 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.
మఠం విశేషాలు..
శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠ ప్రాంగణం దాదాపు 370 సంవత్సరాల కిందట దక్షిణ గోవాలోని కనకోనాలోని పార్తగల్ గ్రామంలో నిర్మించబడింది. ఈ మఠం తరతరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఈ మఠం ప్రాంగణాన్ని ఇటీవలే కొత్తగా రూపొందించారు. ఈ మఠం తాజాగా 550వ వార్షికోత్సవం సందర్భంగానే రాముని విగ్రహం ఆవిష్కరణ జరుపుతున్నారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 7 వరకు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ 7వేల నుండి 10వేల మంది భక్తులు వస్తారని అంచనాగా చెప్పారు. విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
*రూపశ్రీ.