అక్కడ ఆడవారికి సమాన జీతం ఇవ్వాల్సిందే!
అక్కడ ఆడవారికి సమాన జీతం ఇవ్వాల్సిందే!
స్త్రీ ఆకాశంలో సగం అంటారు. కానీ నేల మీద మాత్రం తగిన ప్రాముఖ్యత ఇవ్వరు. అడ్డాకూలీల దగ్గర నుంచీ ఆఫీసర్ల వరకూ ఆడవారు చేసే పనికి చాలీచాలని వేతనమే లభిస్తుంది. ఈ విషయం మన కళ్ల ముందు కనిపించేదే! ఇది నిజమని రుజువుచేసేందుకు కావల్సినన్ని పరిశోధనలు కూడా జరిగాయి. నోరు తెరిచి అడిగినా కూడా ఆడవారికీ జీతాలు పెరగవనీ, సున్నితంగా ఉండే ఆడవారి జీతాలు అస్సలు మెరుగుపడవనీ గణాంకాలు రుజువుచేస్తున్నాయి. ఈ సోత్కర్షంతా ఎందుకంటే ఐస్లాండ్లో జరిగిన ఓ విప్లవం గురించి చెప్పుకోవడం కోసం!
మిగతా దేశాలతో పోలిస్తే ఐస్లాండ్లో జీవన పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అందుకే సంతోషకరమైన దేశాలలో ఐస్లాండ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడ స్త్రీపురుషుల మధ్య వివక్షా తక్కువగానే ఉంటుంది. మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల జీతాల మధ్య 14 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ అక్కడి ఆడవారు ‘తక్కువ వ్యత్యాసం’తో సరిపెట్టుకోలేదు. అసలు వివక్షే లేని సమాజం కావాలని ఉద్యమించారు.
గత అక్టోబరులో ఐస్లాండ్లోని మహిళా ఉద్యోగులు... తమకు సమానమైన జీతాలు కావాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ఆ తరువాత విధులలో చేరినా... తక్కువ జీతాలను తీసుకునేందుకు నిరాకరించారు. వీరి ఆవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది. ఇక మీదట స్త్రీపురుషు ఉద్యోగులందరికీ సమానంగా జీతాలు ఇవ్వాలంటూ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై అక్కడ 25మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా... తాము సమానమైన వేతనాలను చెల్లిస్తున్నామంటూ ఒక ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో చట్టబద్ధంగా సమాన వేతనాలని అమలు చేస్తున్న తొలిదేశంగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది.
ఉద్యోగరంగంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఐస్లాండ్కి కొత్తేమీ కాదు. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న సంస్థల బోర్డులో కనీసం 40 శాతం మంది మహిళా సభ్యులుండాలని ఇప్పటికే ఓ నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనల వల్లే world economic forum ఐస్లాండ్లో మహిళా సాధికారత అత్యుత్తమం అంటూ కితాబు ఇచ్చింది. ఇక మహిళలకు సమాన వేతనాలతో ఐస్లాండ్ మరే దేశానికీ అందనంత ఎత్తుకి చేరుకుంది.
ఐస్లాండ్ని చూసి మన దేశం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఒకపక్క భారతదేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారని డప్పు కొడుతూనే వీలైనంతగా అణచివేతకి గురిచేయడం కనిపిస్తుంటుంది. పార్లమెంటులో మూడోవంతు రిజర్వేషన్ కోసం రూపొందిన బిల్లు దాదాపు 20 ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని ఉంది. ఇక సమాన ఉద్యోగాలు, వేతనాలు గురించి ఏమని చెప్పుకోగలం.
- నిర్జర.