కష్టానికి తగిన ఫలితం రావడంలేదా..భగవద్గీతలో చెప్పిన ఈ మాటలు గుర్తు చేసుకోండి!

 

కష్టానికి తగిన ఫలితం రావడంలేదా..భగవద్గీతలో చెప్పిన ఈ మాటలు గుర్తు చేసుకోండి!

కష్టానికి తగిన ఫలితం అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కష్టానికి తగిన ఫలితం కొందరికి రాదు. అలాంటి వారు తాము పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని వాపోతుంటారు. జీవితంలో తాము ఎదగలేకపోవడానికి కారణం కూడా ఇలా కష్టానికి తగిన ఫలితం రాలేదనే అని అంటుంటారు. నిజానికి కష్టానికి తగిన ఫలితం రాకపోతే చాలామంది తమ జీవితంలో దురదృష్టం ఉందని, తమకు జీవితం అంతా ఇంతే అని.. ఇలా పలురకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ హిందూ ధర్మం మాత్రం మనిషి జీవితాన్ని కర్మ సిద్దాంతం ఆధారంగా చూస్తుంది. మనిషి జీవితంలో ప్రతీది కర్మను అసరించే జరుగుతుందని చెబుతుంది.  భగవద్గీతలో కర్మను గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే.. మనిషి ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం ఎందుకు రావడం లేదో అర్థం అవుతుంది. భగవద్గీతలో ఉన్న ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే..

శ్లోకం..

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన్.
మా కర్మఫలహేతుర్భూర్మ తే సంగో'స్త్వకర్మణి."

ఫలితాల గురించి చింతించడం మానేసి, కార్యాచరణపై దృష్టి పెట్టమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు.  చాలామంది తాము చేసే పనికి ఏ ఫలితం వస్తుంది? ఎంత ఫలితం వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. దీని కారణంగా పని తర్వాత వచ్చే ఫలితం తాము ఊహించుకున్న దానికంటే తక్కువగా ఉంటే.. నిరుత్సాహపడతారు. అందుకే ఫలితం గురించి ఆలోచించడం మానేసి పని మీద దృష్టి పెట్టాలి.

శ్లోకం..

సత్త్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారతం.
శ్రద్ధామయోయాం పురుషో యో యచ్ఛ్రదః స ఏవ సః ।

ఒక వ్యక్తి తన ఆలోచనలు, నమ్మకాల ద్వారా రూపుదిద్దుకుంటాడు. మనిషి దేనిని నమ్ముతాడో, దేని గురించి ఆలోచిస్తాడో అదే అవుతారు. మనిషి ఆలోచన సానుకూలంగా ఉండి,  తమపై తమకు అచంచలమైన విశ్వాసం ఉంటే, విజయం సాధించకుండా ఈ ప్రపంచంలో ఏదీ  ఆపలేదు.

శ్లోకం..

 చింతయ జాయతే దుఃఖం నాన్యతేహేతి నిశ్చి.
తాయా హీనః సుఖీ శాంతః సర్వత్ర గలిత్స్ప్రహః ।

అష్టావక్ర గీతలోని ఈ శ్లోకం జీవితంలో బాధకు అతిపెద్ద కారణం మనిషి చింతే అని వివరిస్తుంది. చింతించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని గ్రహించిన వ్యక్తి మానసికంగా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. సంతోషకరమైన జీవితానికి అనవసరమైన చింతలను వదిలివేయడం చాలా ముఖ్యం.

శ్లోకం..

మాత్రస్పర్శస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః.
అగామాపాయినోద్యనిత్యాస్తాంస్తితిక్ష్వ భారత్.

శీతాకాలం, వేసవికాలం ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో, అలాగే సుఖదుఃఖాలు కూడా తాత్కాలికమైనవే. అవి వస్తూ పోతూ ఉంటాయి. సుఖానికి మితిమీరి ఉప్పొంగిపోకుండా, దుఃఖానికి పూర్తిగా కుంగిపోకుండా ఉండేవాడే వివేకి. ఈ పరిస్థితులను ఓర్పుతో సహించడమే జీవితంలో పురోగతికి కీలకం.

శ్లోకం..

 త్రివిధం నక్ష్యేదం ద్వారం నాశన్మాత్మనః ।
కమః క్రోధస్తథా లోభస్తస్మమాదేతత్రయం త్యజేత్ ॥

కామం (అతి కోరిక), కోపం , దురాశ నరకానికి మూడు ద్వారాలుగా పరిగణించబడతాయి. అవి ఒక వ్యక్తి  వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే కాకుండా వారి ఆత్మను కూడా క్షీణింపజేస్తాయి. మనిషి విజయవంతమైన , అర్థవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే, కోపం , దురాశలకు దూరంగా ఉండటం చాలా అవసరం.

తాము ఎంత కష్టపడినా తగిన ఫలితం రాలేదని అనుకునేవారు పైన చెప్పుకున్న శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకుంటే.. తాము నిజంగానే కష్టపడ్డామా లేదా అనే విషయం అర్థం అవుతుంది. అలాగే తాము కష్టపడిన దానికి తమకు వచ్చిన ఫలితం గురించి కూడా స్పష్టత వస్తుంది. అంతేకాదు.. తమకు అసలైన విజయం దక్కాలంటే.. జీవితంలో తాము ఎలా ఉండాలో కూడా అర్థమవుతుంది.

                                        *రూపశ్రీ.