ఆడవారి సందడికి అదనపు హంగులు!

 

ఆడవారి సందడికి అదనపు హంగులు!

శ్రావణ మాసంలో పెళ్లిళ్లు హడావిడి ముగియగానే ఇక అమ్మాయిల అందాల సందడి కూడా తగ్గిపోతుందని అందరూ అనుకుంటారు. పెళ్లిళ్లు గట్రా ఉన్నప్పుడే కదా ఆడవారి నగలకు, చీరలకు బాగా పని పడేది. అయితే అందరూ అనుకున్నట్టు ఆడవారి సింగారం శ్రావణ మాసంతో ముగిసిపోదు. ఆ తరువాత మెల్లగా దేవినవరాత్రులతో పాటు ఆడవారి సందడి కూడా వెంటబెట్టుకుని వస్తాయి. ఆ మాసం మొత్తం అమ్మవార్లకు నీరాజనాలు మార్మోగిపోతాయి. ఇంకా అట్లతద్ది నోము, ధన త్రయోదశి, దీపావళి, ఇలా ఒక దాని తరువాత మరొకటి అలరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆడవారి సందడికి కొదువ ఏమి లేదు. అయితే వచ్చిన చిక్కల్లా అన్నిటికీ ఒకే విధంగా తయారవ్వడం అంటే ఎలా?? పైగా ఒక్కోసారి ఒకో నగలు పెట్టుకోడానికి మరీ అంత కలెక్షన్ లేదే అనుకుంటున్నారా?? మరేం ఖంగారు పడక్కర్లేదు కొన్ని టిప్స్ ఫాలో అయితే హాయిగా అన్నిటికి వెరైటీ స్టయిల్స్ లో డిఫరెంట్ డ్రెస్సింగ్ లో షేక్ చేయచ్చు.

డ్రెస్సింగ్!!

అన్నిటికీ డ్రెస్సింగ్ అనేది పెద్ద అట్రాక్షన్. ముఖ్యంగా అట్లతద్ది, దీపావళి నాడు మహాలక్ష్మి పూజ, ధన త్రయోదశి ఇలా ఆడవారు అట్రాక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. వీటికోసం మంచి మంచి వేరు వేరు కలెక్షన్ కావాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైనా టూర్స్ కి అలా వెళ్లినప్పుడు అక్కడి స్పెషల్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఉంటాయి. వాటి గురించి అడిగి తెలుసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. పండుగలు, ప్రత్యేక దినాలు కాబట్టి వీటికి సాంప్రదాయ దుస్తులే బాగుంటాయి. అయితే ఒకే రకమైన చీరను కూడా విభిన్న రకాలుగా కట్టుకోవడం, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ను వేరు వేరుగా ఉండేలా,  ఆ చీరలోకి సరిపోయేలా సెట్ చేసుకుంటే వెరైటీగా కనిపించవచ్చు. 

అంతే కాదు దీనికి మరొక మార్గం కూడా ఉందండోయ్. స్నేహితుల సమన్వయమే దీనికి మంచి మార్గం. స్నేహితులు కొందరు కలసి తమ దగ్గరున్న దుస్తులను ఒక కలెక్షన్ లా చేసి అందరూ కలసి వాటిని షేర్ చేసుకుని వేసుకుంటే ఎంత మంది ఉంటే అన్నిరకాల దుస్తులు అన్ని రోజులు వేసుకోవచ్చు.

జ్యువెలరీ!!

జ్యువెలరీ విషయంలో ఇప్పుడు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి మహిళలకు. బంగారాన్ని తలదన్నేట్టుగా వందలు, వేలకొద్ది డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. పైగా గోల్డ్ ప్లేటెడ్, వన్ గ్రామ్ గోల్డ్ వంటి జ్యువెలరీ మాత్రమే కాకుండా రంగు రంగుల  పూసలు,  రాళ్లు పొదిగిన బోలెడు ఆభరణాలు తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. 

ప్లానింగ్!!

ప్లానింగ్ అనేది అందరికీ ఎంతో అవసరం. దుస్తుల దగ్గర నుండి జ్యువెలరీ వరకు. ఇంకా అట్రాక్షన్ ఉండటానికి మేకప్, ఫుట్ వేర్ మరీ ముఖ్యంగా సెలబ్రేషన్ లో ఎవరు ఏ పని చేసుకుంటూ అన్ని హ్యాండిల్ చేసుకోవాలి మొదలైన విషయాలు అన్నీ ప్లానింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అన్ని విధాలుగా అమ్మాయిలు అట్రాక్షన్ గా ఉంటారు. 

ఆడవారి హడావిడికి ఎప్పుడూ ముగింపు అనేది ఉండదు. శుక్రవారం, మంగళవారం లాంటి రోజులే చాలు వారి సందడి కనిపించడానికి. కాబట్టి మహిళలూ మీ సందడి తగ్గనివ్వద్దు.

                                         ◆నిశ్శబ్ద.