భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుసా?

 

భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుసా?

భగవద్గీత ఈ కలియుగానికి ఒక గొప్ప మనోవిశ్లేషనా గ్రంధం. అర్థం చేసికున్నవారికి, తెలుసుకున్నవారికి తెలుసుకున్నంత జ్ఞానాన్ని పంచుతుంది భగవద్గీత. ఏ వైద్యుడు చేయలేని గొప్ప మానసిక వైద్యం భగవద్గీత ద్వారా సాధ్యం అవుతుంది.భగవద్గీత ఎప్పుడు చదవాలి?? ఎందుకు చదవాలి వంటి విషయాలలో ఒక్కొక్కరు ఒకో మాట చెబుతుంటారు  భగవద్గీత చదవడం వల్ల, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల  మనిషిలో బాహ్య సుఖాల మీద కోరిక తగ్గి, వైరాగ్యం ఏర్పడుతుందని, మనిషి జీవితంలో అనుభవించాల్సిన సుఖాలైన సంసారం, బంధాలు, సంపాదన, కోరికలు వంటివన్నీ భగవద్గీత అర్థం చేసుకున్నవాళ్ళు వదిలేస్తారని, అందువల్ల అలాంటివాళ్ళు దాదాపు సన్యాస జీవితానికి దగ్గరగా వెళతారని పెద్దలు చెబుతారు. భగవద్గీతను చిన్నతనంలోనే అర్థం చేసుకుని ఇలా వైరాగ్యంలోకి వెళ్ళిపోతే తమ పిల్లల జీవితాలలో సంతోషం లేకుండా పోతుందని పెద్దలు భయపడుతూ ఉంటారు. ఆ భయంతో నుండి పుట్టినదే భగవద్గీత కేవలం పెద్దవాయసు వాళ్ళు, ముసలి వాళ్ళు మాత్రమే చదవాలి అనే మాట పుట్టడానికి కారణమైంది. అది క్రమంగా వ్యాప్తి చెందింది.

కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తరువాత, తాంబూలం సేవిస్తూ, "అర్జునా! కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా!” అని చెప్పలేదు. లేక వాహ్యాళికి వెళ్లినపుడు, తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపం అయిన ధర్మరాజుకు చెప్పలేదు. పితామహుడు భీష్ముడికి చెప్పలేదు. నీతికోవిదుడు విదురుడికి చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అదీ యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుభితం అయినపుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినపుడు చెప్పాడు.

 "నాకు ఏమీ తోచడం లేదు. ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు" అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. "నానుశోచంతి" అనే పదంతో మొదలు పెట్టి "మాశుచ:" అనే పదంతో పూర్తిచేసాడు. అంటే ఏడవవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు.

మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారతయుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినపుడు నివారణోపాయము చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపుతట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంధం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందనీ, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయనీ, సరాసరి మోక్షం వస్తుందనీ చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్ధి దశనుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి. కాలేజీలలో డిబెట్లు పెట్టాలి. ఒక పరిశోధనా అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికీ ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించతగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని, సైర్ధ్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత.

కాని నేడు జరుగుతున్నది ఏమిటి. భగవద్గీతను ఘంటసాల గారు మృదుమధురంగా గానం చేస్తే దానిని శవాల దగ్గరా, శ్మశానాలలో పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్టు భావన కలిగిస్తున్నారు. ఈ దౌర్భాగ్యస్థితినుండి మనం బయట పడాలి. అందుకే భగవద్గీతను అందరూ చదవాలి.

    ◆వెంకటేష్ పువ్వాడ.