మంత్రదీక్ష వల్ల జరిగే అద్బుతం ఇదే!
మంత్రదీక్ష వల్ల జరిగే అద్బుతం ఇదే..!
ఆధ్యాత్మికత, భక్తి మార్గంలో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి, అనుభూతి చెందడానికి గురువు అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అటువైపు జరిగే ప్రయాణానికి మార్గం చూపేది గురువే.. గురువు ద్వారా మంత్ర దీక్ష, ఆధ్యాత్మిక సాధన, సంత్సంగం వంటివి పొందగలిగిన వారు ఆనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాంటి సాధకులు లోపలి మార్పులను ఎక్కువ ప్రయత్నం చేయకుండానే అనుభవించగలుగుతారు. మంత్రదీక్ష తీసుకోవడం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. మంత్రదీక్ష గురించి, దాని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..
మంత్ర దీక్ష..
మంత్రం అనేది అక్షరాల కలయిక అని అందరూ అనుకుంటారు. కానీ మంత్రం శబ్దాల కలయిక. మంత్రాన్ని ఉచ్చరించడంలోనే దాని శక్తి దాగుంటుంది. సరైన ఉచ్ఛారణతో మంత్రాన్ని జపించినప్పుడు అద్బుతమైన ఫలితాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా గురువు ఉపదేశంతో లభించే మంత్రం ఎంతో గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఉపదేశం ఇవ్వడం అంటే మంత్ర శక్తి అనే బీజాన్ని సాధకుడిలో అంతర్లీనంగా నాటడమే.. అందుకే గురువు ఇచ్చే మంత్రానికి అంత శక్తి ఉంటుంది. దాన్ని సాధన చేస్తే అది మొక్కగా, వృక్షంగా ఎదిగి అద్బుతమైన పుష్పాలు, ఫలాలను కూడా అందించగలదు.ఇదంతా ఆధ్యాత్మిక పరంగానే.. మంత్ర దీక్ష వల్ల కలిగే ప్రయోజాలు ఉన్నాయి. అవేంటంటే..
మంత్రదీక్ష ప్రయోజనాలు..
ఆనందం, దుఃఖం ప్రభావాలు మనిషిపై చాలా తీవ్రంగా ఉంటాయి.కానీ మంత్రదీక్ష చేశాక అలాంటి ప్రభావాలు ఏవీ మనస్సుపై చూపవు. సాధకుడు సమస్థితి వైపు పయనించడం ప్రారంభిస్తాడు. గతంలో కూడబెట్టుకున్న పాపాలు తగ్గడం ప్రారంభమవుతుంది. అాలాగే పుణ్యాలు స్వయంచాలకంగా పోగవడం జరుగుతుంది.
ప్రాపంచిక కోరికలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి, వాటి ఆకర్షణ తగ్గుతుంది. మంత్ర దీక్ష, సత్సంగం ద్వారా మనస్సులో ఉండే అశాంతి తగ్గడం ప్రారంభమవుతుంది. మనస్సు స్థిరత్వం వైపు కదులుతుంది.
మనసులో దేవుని ప్రేరణ మనస్సాక్షిలో కనిపిస్తూ ఉంటుంది. రాముడు, కృష్ణుడు, శ్రీహరి వంటి దైవిక నామాలు ప్రియమైనవిగా మారడం మొదలవుతుంది. నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే సాధకుడి అహంకారం కరిగిపోవడం మొదలవుతుంది. బుద్ధిలో స్వచ్ఛమైన సాత్విక కాంతి కలుగుతుంది.
మూర్ఖత్వం మాయమై జ్ఞానం మేల్కుంటుంది. మనస్సు లోతైన ప్రశాంతతను పొందుతుంది. ఆత్మపరిశీలనలో ఉండే ఆనందం తెలుస్తుంది. ఓంకార జపం స్వయంచాలకంగా మారుతుంది.
ఆత్మ, పరమాత్మ ఐక్యతను గ్రహించడం మొదలవుతుంది. ఆత్మ అనేది పరమాత్మలో విడదీయరాని భాగమని అర్థం అవుతుంది. దేవుని పట్ల ప్రేమ మనస్సులో ప్రకాశిస్తుంది. మనుషులలోనే ఆ భగవంతుడు కూడా ఉంటాడని తెలుసుకుంటారు.
మంత్ర దీక్ష గాఢంగా మారినప్పుడు ఆ పరబ్రహ్మం పట్ల ప్రేమ బలపడుతుంది. భగవంతుడి రూపం భౌతికమా లేదా భగవంతుడు నిరాకారుడా అనే విషయాన్ని ఆలోచిస్తారు. అలాగే భగవంతుడు, ఆయన నామం రెండూ వేర్వేరు కాదని, భగవంతుడి నామం శక్తిని అర్థం చేసుకుంటారు.
చింతామణి, కల్పవృక్షం, కామధేనువు కోరికలను తీర్చినట్టు భగవంతుని మంత్ర సాధన ద్వారా కోరికలు తీరడం స్వయంగా అనుభవిస్తారట. సాధకుడు మంత్ర దీక్షను అలాగే కొనసాగిస్తూ ఉంటే.. అది ప్రపంచంలోని ఎన్ని ప్రలోభాలు అతని దారిలోకి వచ్చినా, అతని మనస్సు భగవంతుడిని స్మరించడంలో నిమగ్నమై ఉంటుంది.
మంత్రదీక్షలో భగవంతుడిని దర్శనం చేసుకున్న సాధకుడికి దుఃఖ నిలయం లాంటి ఈ ప్రపంచం పట్ల, భౌతిక వస్తువుల పట్ల మునుపటి అనుబంధం అంతం కావడం మొదలవుతుందట. ఇదీ మంత్ర దీక్ష వల్ల జరిగే అద్బుతం.
*రూపశ్రీ.