బ్రహ్మస్వరూపులుగా ఎలా మారతారు?
బ్రహ్మస్వరూపులుగా ఎలా మారతారు?
బ్రహ్మస్వరూపం అనే పదానికి ఒక్కొక్కరు ఒకో విశ్లేషణ ఇస్తారు. ఒక్కొక్కరు ఒకో విధంగా అభిప్రాయం చెబుతారు. కొందరు యోగులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు ఆయన అనే మాట చెప్పడం వింటూ ఉంటాము. అయితే సాధారణ వ్యక్తులు కూడా బ్రహ్మస్వరూపులు కావచ్చని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. ఈ బ్రహ్మస్వరూపులు కావడం వెనుక మూడు విషయాలను తెలుసుకుని ఆచరించాలని పరమాత్మ చెబుతాడు.
ప్రశాంత మనసం... అంటే మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణం పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగము.
శాంత రాజసం…... అంటే రజోగుణమును శాంత పరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంత పరచడం వీలుకాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువచేసుకుంటే, రజోగుణము దానంతట అదే శాంత పడుతుంది. ఎలాగంటే పాలు, నీరు చెరిసగం ఉన్న పాత్రలో, ఇంకా ఎక్కువ పాలు పోస్తే పాల శాతం ఎక్కువయి నీటి శాతం తగ్గిపోతుంది. అలాగే మనలో సత్వగుణం ఎక్కువగా నింపుకుంటే, రజోగుణము, తమోగుణము వాటంతట అవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణ ప్రధానములైన కోరికలను, కోపమును, అదుపులో పెట్టుకోవాలి.
అకల్మషమ్... అంటే మనసు కల్మషం లేకుండా ఉండాలి. మనసులో ఎవరి మీద కోపము, ద్వేషము లేకుండా చూచుకోవాలి. అప్పుడే యోగి పరమ శాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖము శాంతి లభిస్తాయి. అటువంటి సుఖము సుఖం ఉత్తమమ్ అని అన్నారు.
ఇది ప్రతి వాళ్లకూ సాధ్యమే. ఇంత వివరంగా చెప్పినా మానవులు దాని జోలికిపోరు. ముందుగా అకల్మషమ్ అనేపదాన్ని మనం ఆచరించాలి. మనసులో ఉన్న కల్మషములను తొలగించుకోవాలి. ఈ జన్మలోవేకాదు ఇంతకు ముందు జన్మలలో ఉన్న కల్మషాలు కూడా మన మనసులో నాటుకొని పోయి ఉంటాయి. వాటినన్నిటినీ తీసివేయాలి. అద్దం మకిలిగా ఉంటే అద్దంలో మన ముఖం కనపడదు. అందుకని అద్దాన్ని శుభ్రంగా తుడవాలి. అలాగే జన్మజన్మల నుండి మనలో పేరుకుపోయిన మలినములను, కల్మషములను మనము ఆర్జించిన జ్ఞానముతో, విచక్షణతో, ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యముతో, సమూలంగా నాశనం చేయాలి. ఎందుకంటే, మనస్సు కల్మషంగా ఉంటే మనమెవరో మనం తెలుసుకోలేము.
పరమాత్మ తన మొట్టమొదటి మాటలోనే ప్రశాంత మనసం అంటూ సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, అనవసర విషయాలలో తలదూర్చవద్దు, ఆలోచించవద్దు, అందరినీ సమంగా చూడాలి, నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి మాలిన్యమును మనసుకు అంటనీయవద్దు అని బోధించాడు. ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు. కాకపోతే ప్రయత్నించాలి. మనం అందరం శివస్వరూపులం. శివ అంటే ఆనందం. శవ అంటే ఆ ఆనందం లేకపోవడం. మనం ఎల్లప్పుడూ శివ స్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కొరకు శాంతి కొరకు ఎక్కడా వెతకనక్కరలేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి. పరమ శాంతి పొందిన తరువాత కలిగే పరిణామమే బ్రహ్మభూతమ్ అంటే తానే బ్రహ్మస్వరూపము అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అవుతాడు.
◆వెంకటేష్ పువ్వాడ.