కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఏమి జరిగింది?

 

కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఏమి జరిగింది?

సహజంగానే దాయాదుల మధ్య రాజ్యాధిపత్యం ఉంటుంది. దానికోసం  పోరు మొదలయింది. రాజ్యవిభజన జరిగింది. పాండవులకు ఎందుకూ పనికిరాని ఖాండవప్రస్థం ఇచ్చారు. వారు దానిని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. రాజసూయ యాగం చేసారు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. అది చూసి ఓర్వలేకపోయాడు సుయోధనుడు. వారి రాజ్యం ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. దానికి తన మేనమామ, కుటిలుడు, అయిన శకుని సాయం తీసుకున్నాడు. ద్యూత క్రీడకు పాండవులను ఆహ్వానించాడు. ఓడించాడు, అవమానించాడు. వారినే కాదు వారి భార్య ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించాడు. రాజ్యం అపహరించి అడవులకు పంపించాడు.

అరణ్యవాసానంతరము పాండవులు తిరిగివచ్చి తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగారు. ద్రుపద పురోహితుని, శ్రీకృష్ణుని, రాయబారం పంపారు. అటునుండి సంజయుని, ఉలూకుని రాయబారం పంపారు. ఎవరి వాదన వారిది. చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి కానీ సూదిమొన మోపినంత కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ విధంగా యుద్ధం అనివార్యం అయింది. శ్రీకృష్ణుని  సేనలు అన్నీ దుర్యోధనుడికి పోయాయి. పాండవులకు కేవలం శ్రీకృష్ణుడు దక్కాడు. అర్జునుడికి సారధిగా ఉండటానికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు.

లోకంలో ఉన్న రాజులంతా రెండు పక్షాలుగా విడిపోయారు. పాండవులు వారి మిత్రపక్ష రాజుల సైన్యం ఏడు అక్షౌహిణీలు అయితే, కౌరవులు వారి మిత్రరాజుల సైన్యం పదకొండు అక్షౌహిణీలు, కురుపాండవులకు యుద్ధం జరగబోతోంది అని తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూస్తావా, దివ్యదృష్టి ఇస్తాను అని అడిగాడు వ్యాసుడు. ఇక్కడ మరొక చిక్కుకూడా ఉంది. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. అతడు తన కుమారులనే గుర్తుపట్టలేడు. ఇంక పాండుకుమారులను ఎలా గుర్తు పట్టగలడు. ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు. కాబట్టి ధృతరాష్ట్రునికి దివ్యదృష్టి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఈ విషయం దాచి పెట్టి, అన్నదమ్ములపోరు, వారి చావులు చూచి తట్టుకోలేను అన్నాడు గుడ్డిరాజు. యుద్ధ విశేషాలు చెబితే వినాలని ఉంది. అని అన్నాడు. 

వ్యాసుడు ఆ పనికి సంజయుని నియమించాడు. సంజయునికి ఇతరులు మనసులలోకి దూరి వారి మనోభావాలు తెలుసుకునే శక్తి, ఎక్కడికైనా మనోవేగంతో పోయే శక్తి, యుద్ధరంగంలో తిరుగుతున్నా ఎటువంటి అస్త్రశస్త్రములు తగలకుండా ఉండే శక్తిని ప్రసాదించాడు. యుద్ధం అంతా చూసి వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పమని ఆదేశించాడు. సంజయుడు శిరసావహించాడు.

సంజయుడు వెంటనే యుద్ధభూమికి వెళ్లాడు. పది రోజుల యుద్ధం చూశాడు. భీష్ముడు. అంపశయ్యమీద పడి పోయాడు. ఆ విషయం చెబుదామని వ్యాసుడు ఇచ్చిన శక్తితో యుద్ధభూమి నుండి క్షణంలో హస్తినకు వచ్చాడు. ధృతరాష్ట్రునికి భీష్ముని అంపశయ్య గురించి చెప్పాడు. పెదతండ్రి పతనం వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు. ఆ తరువాత తేరుకున్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు. ఆ అడగడంతోనే భగవద్గీత ప్రారంభం అవుతుంది. ధృతరాష్ట్రుని ప్రశ్న గీతలో మొట్టమొదటి శ్లోకం.

ఇదీ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగినది.  భగవద్గీతకు మూలమైన యుద్ధానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతే భగవద్గీతలో అర్జునుడు ఎందుకు అంత భయపడతాడు, ఎందుకు పిరికివాడు అవుతాడు అనే విషయం అర్ధం కాదు. 

                                ◆ వెంకటేష్ పువ్వాడ.