సీతమ్మ చనిపోదామని ఎందుకు అనుకుంది?

 

సీతమ్మ చనిపోదామని ఎందుకు అనుకుంది?

రావణుడు సీతను దండించమని రాక్షస స్త్రీలతో చెప్పి పోగానే రాక్షస స్త్రీలు అందరూ సీతను చంపి పంచుకుని తినడానికి శరీరభాగాలను వంతులు వేసుకున్నారు. అప్పుడు సీత బాధతో శింశుపా వృక్షం మరొకవైపుకు వెళ్లి కూర్చుంది. అప్పుడే త్రిజట అనే రాక్షసి లేచి అక్కడున్న మిగిలిన రాక్షస స్త్రీలతో తనకు వచ్చిన కల గురించి వివరంగా చెబుతూ కలలో రాముడు సీతను తీసుకెళ్తున్నట్టు, రావణాసుడు గాడిద మీద ఊరేగుతున్నట్టు కల వచ్చిందని చెప్పింది. కానీ సీత మాత్రం నిరాశకు లోనయ్యింది.

 అక్కడున్న రాక్షస స్త్రీలను చూస్తూ "నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక, నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి" అని, ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు అందుకనే నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది, నేను అల్ప భాగ్యం ఉన్నదానిని అందుకనే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి, రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి. రాముడి తరువాత పుట్టిన వాడిని వదిలాను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు.

రామా! రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభాపెట్టాలని చూశాడు, కాని నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను, భూమిమీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను, ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. కాని నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమయ్యింది. కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవారు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చే 'వారు లేరు' అనుకొని, తన కేశపాశములని(జుట్టుని) చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది.

సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చాప అక్కడినుండి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది, అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది.

                              ◆వెంకటేష్ పువ్వాడ.