సీతమ్మను నమ్మించడానికి హనుమంతుడు చెప్పిన కథ!
సీతమ్మను నమ్మించడానికి హనుమంతుడు చెప్పిన కథ!
హనుమంతుడు సీతమ్మను చూసిన తరువాత "ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్నాను. కానీ వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.
ఇప్పుడు నేను వానర బాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ భాష అర్ధం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయె అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఒదార్చాలి? అని అనుకున్నాడు.
ఆ తరువాత "సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను" అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు.
"పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించినవాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగము చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని, ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేయుటకు రాముడు వెళ్ళాడు, రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది.
అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుండి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను" అని చెప్పి ఆగిపోయాడు.
◆ వెంకటేష్ పువ్వాడ