త్రిజటకు వచ్చిన కల ఎలాంటిది?
త్రిజటకు వచ్చిన కల ఎలాంటిది?
సీతను దండించమని రావణాసుడు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోగానే అక్కడున్న రాక్షస స్త్రీలు సీతతో ఇన్నాళ్లు ఇలా మొండిగా ఉంటావు. నీకు చెబితే అర్థం కదా!!" అని అడిగారు.
"మీరు ఇలా చెప్పడం తప్పు" అని సీత వాళ్లకు చెప్పింది.
అప్పుడు హరిజట అనే రాక్షసి అందరితో "రావణాసుడు సీతను దండించమని చెప్పాడు కాబట్టి ఈ సీతను తినేద్దామ. ఇన్నాళ్లు ఈమెను ఎదురుగా పెట్టుకుని తినకుండా ఉండాలి?? నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి" అనింది. మిగిలిన రాక్షస స్త్రీలు కూడా అదే మాట చెబుతూ సీత శరీరంలో భాగాలను వాంతులు వేసుకున్నారు. అదే సమయంలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి "ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వారు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వారు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.
పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుండి వస్తున్నాయో, ఎవరివలన నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.
ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడామె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.
ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క!, ఓ తండ్రి!, ఓ చెల్లి! అనే కేకలు వినపడ్డాయి, లంకంతా బూడిదయిపోయింది" అని చెప్పింది.
◆వెంకటేష్ పువ్వాడ.