Read more!

విషయానందాలను ఎందుకు వదులుకోవాలి??

 

విషయానందాలను ఎందుకు వదులుకోవాలి??

భగవంతుడంటే ఎవరు? ఆయన అసలున్నాడా! ఉంటే ఎక్కడ! అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు తమకు తగినట్టుగా ఎన్నో వాదాలు వినిపిస్తూ ఉంటారు.  అంతులేని ఆస్తిక, నాస్తిక వాదాలతో తలలు బాదుకునే ఈ అమాయక ప్రాణులను కాసేపు పక్కన పెడితే..! తర్కానికీ, మానవ మేధా వికాసానికీ విలువనిచ్చే వేదాంతం ఈ ప్రశ్నకు సరళమైన సమాధానాన్ని ఇస్తుంది.

“భగవంతుడు” అనే తత్త్వాన్ని 'సచ్చిదానందం'గా అది అభివర్ణిస్తుంది. “నిజమైన ఆనంద అనుభవం” అని దాన్ని వివరించవచ్చు! బాధలూ, దుఃఖాల బారిన పడాలని ఎవరూ అనుకోరు. సంతోషంగా ఉండాలనే ప్రతివారూ ప్రయత్నిస్తారు. బుద్ధి పూర్వకంగానో, అప్రయత్నంగానో అందరూ ఆ అఖండ సచ్చిదానందం వైపే సాగిపోతున్నారు.

ఈ ఆనందాన్ని మూడు విధాలు అని చెబుతారు అవి విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. సాధారణ ప్రాపంచిక వస్తువుల్లో లభించేది విషయానందం. దాన్ని అనుభవించే కొద్దీ ఆ అనుభూతిని పొందాలనే తాపత్రయం మరింత పెరుగుతుంది. క్రమంగా మనం వాటికి బానిసల్లా మారుతాం! ఇలా క్షణిక సుఖాలుగా మొదలైన చివరికి దారుణమైన దుఃఖాలుగా పరిణమించడం వీటి లక్షణం. ఇక భజనలో లభించేది భజనానందం. 'భజన' అంటే ఆనందాన్ని గురించిన చింతన! ఉన్నత, కళాత్మక భావాలలో మునిగి తేలడం! విద్యావేత్తలు ఆయా రంగాల్లో నిష్ణాతులు వారి పనిలో, కళల్లో, శాస్త్రాల్లో ఇలాంటి అనుభూతిని పొందుతూ ఉంటారు. వాటినే బౌద్ధిక సుఖాలు అనవచ్చు! వీటి కోసం ఆరాటం అధికమయ్యేకొద్దీ వ్యక్తులకు సమాజంలో ఉన్నతి లభిస్తుంది.

ఆధ్యాత్మిక పరులకు ఆరంభంలో కొన్ని పవిత్ర భావనల ఆలంబన అవసరం. అలా ధ్యానంలో పురోగమించే కొద్దీ విషయ వస్తువుల పట్ల వ్యామోహం నెమ్మదిగా నశిస్తుంది. మనసు పూర్తిగా ఏకాగ్రమైన మరుక్షణం అఖండ అద్వితీయ బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. అదే మనందరి ఏకైక లక్ష్యం! తెలిసినా తెలియక పోయినా జీవులందరి గమ్యస్థానం.

ప్రతి ఒక్కరి జీవితం ఈ మూడు ఆనందాల మిశ్రమమై ఉంటుంది. కానీ అవి ఏ యే పాళ్ళలో కలిసి ఉన్నాయనే విషయం మన జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. స్వామి ! వివేకానంద మాటల్లో "ఆధ్యాత్మికత అంటే ఆనందంగా ఉండడం. ఉన్నత ఆనందాలవైపు ప్రయాణించడమే జీవిత పరమార్థం. జంతువులు మాత్రమే విషయానందాలను ఆస్వాదిస్తుంటాయి”.

విషయానందాల పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వారినే అన్ని భౌతిక, మానసిక సమస్యలూ పట్టి పీడిస్తాయన్నది గమనార్హం! విషయానందాల తపన తగ్గి, బౌద్ధిక ఆనందాలపై ఆసక్తి పెరిగితే తప్ప జీవితంలో దేన్నీ సాధించలేం. వ్యక్తులతో ఉన్న పరిపక్వత, వారి అభిప్రాయాలు మొదలైన వాటి గురించి ఎవరెంత మాట్లాడినా విజయ రహస్యం మాత్రం ఇదే. విషయానందాలను వదలడమంటే అంతకు మించిన ఆనందాలను పొందడమే! దీన్ని అర్థం చేసుకుంటే, ఆ పని కొంత సులభమవుతుంది! వికసించే బుద్దికి ఆధ్యాత్మికతను మేళవిస్తే నేటి సమాజంలోని ఒత్తిడి, అశాంతులు దూరమవుతాయి.

                              ◆నిశ్శబ్ద.