Read more!

ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే పరమాత్మను అర్థం చేసుకోగలం!!

 

ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే పరమాత్మను అర్థం చేసుకోగలం!!


మనిషికి జీవితంలో ఎన్నో విషయాలు మనసును నిలకడ లేకుండా చేస్తాయి. ఎన్ని విషయాలను పరిష్కారం వైపు తీసుకెళ్లినా చివరికి మరొక ప్రశ్న అంటూ పుడుతుంది మళ్లీ ఆలోచన, సంఘర్షణ మొదలవుతుంది. అయితే మనిషికి ఒకానొక ప్రశాంత ప్రపంచం ఏర్పడాలంటే, ఆ పరమాత్మ చల్లని చూపు మనిషిపై నిలవాలంటే మనిషి రెండు విషయాలను అర్థం చేసుకోవాలి.


దుఃఖం నుంచి దుఃఖానికే..!  ఈ లోకంలో భగవంతుడు తప్ప, ఆనందాన్నిచ్చే వస్తువు ఇంకోటి లేదు. ఈ సుఖాల సరంజామా అంతా మనల్ని ఒక దుఃఖం నుంచి మరో దుఃఖం వైపునకు తీసుకెళతాయే కానీ, సుఖం వైపు కాదు. అవి సంపాదించుకునే వరకు 'కావాలి, కావాలి' అనే ఆశ. తీరా వచ్చాక, పోతాయేమోననే భయం! ఇలా మనం వాటిని యౌవనం, వృద్ధాప్యం ఇలా మనల్ని కష్టనష్టాల మరలో , పీల్చి పిప్పి చేసి కాటికి చేర్చేస్తున్నాయి. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఇలా అంటారు.... అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరాన్వితమె, మేనంతా భయభ్రాంతమే యంతానంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్నిన్నుదలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!


ఓ శ్రీకాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా, ఈ జగత్తు అంతా సందేహంతో కూడినదే. ఈ శరీరం పుట్టుక పరిశీలించి చూడ వలసిన విషయమే. లోపలనున్న జీవుణ్ణి చూస్తే, ఒక దుఃఖం నుంచి మరో దుఃఖం మాదిరిగా ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణించడమే! శరీరమంతా భయభ్రాంతులతో కూడుకున్నదే! పరిశీలిస్తే, శరీరాన్నంతా శుష్కింపజేసే విషయాలే! ఈ ప్రాణికి చివరకు మిగిలేదంతా చెడు నడతే! కాబట్టి మనుష్యులు నిన్ను తలంచినచో ఇలాంటి చింతలేవీ పొందరు కదా! అని ధూర్జటి స్పష్టం చేస్తున్నాడు.


పరమాత్మలోనే పరమానందం పొందడం అనే విషయం చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది. ఒకదానికొకటి అనుబంధంగా ఉన్నావే ఆ రెండూ అనే విషయం అర్ధం చేసుకోలేని వారు అలా అనుకుంటారు.  ఒక్కసారిగా భగవంతుడి వైపు ఆకర్షితులమైతే, ఈ లౌకికమైన విషయాలన్నీ తుచ్ఛమైనవిగా తోస్తాయి. పరమాత్మ అందించే పరమానందం ముందు ఈ సంసార సుఖాలు అల్పమైనవిగా కనిపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ, మనం ఆయనను విశ్వసించడం లేదు, సేవించడం లేదు. అందుకే మనల్ని ఆ విధాత అలుపెరగకుండా పరుగులు తీయిస్తున్నాడు. మనకు మనమే శరణాగతులమై, ఆ భగవంతుడికి విన్నవించుకుంటే మనల్ని బంధనాల నుంచి తొలగిస్తాడు. కానీ మనుష్యుల మనస్సుల్లో ఎక్కడో ఇంకా ఇల్లూ, పిల్లలు, సంసారంపై అనురక్తి మిగిలే ఉంటుంది. అందుకే అందులోనే పడి కొట్టుకుపోతున్నా, ఆయన ఒడ్డుకు చేర్చలేకపోతున్నాడు. శ్రీమద్భాగవతం ఇలా అంటోంది....


మిము సద్భక్తి భజింపనొల్ల కిల దుర్మేధం ప్రవర్తించు నీ చ మతివ్రాతము నేర్పునం పసుల పాశశ్రేణి బంధించు చం దమునంపెక్కగు నామరూపములచేతన్ వారి బంధించు దు ర్గమ సంసార పయోధి త్రోతువు దళత్కంజాత పత్రేక్షణా!


'మహాత్మా! నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి, సంసారసాగరంలో పడదోస్తావ'ని జ్ఞాపకం చేస్తోంది.


ఇకనైనా ఈ భౌతికమైన వ్యామోహాలు తగ్గించుకొని, మనస్సులో పరమాత్ముణ్ణి స్మరించుకుంటే ఆయనే మన బాధల్ని తొలగించి, బాధ్యతను తన చేతిలోకి తీసుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

                                              ◆నిశ్శబ్ద.