Read more!

ద్వేషం మనిషికి ఎంత ద్రోహం చేస్తుందో తెలుసా?

 

ద్వేషం మనిషికి ఎంత ద్రోహం చేస్తుందో తెలుసా?


ద్వేషంతో కుతకుతలాడే మనుష్యులు ఎల్లప్పుడూ కలవరంతో, క్రూరంగా ప్రవర్తిస్తారు. ద్వేషం మనస్సును సంకుచితం చేసి, ఆలోచనా శక్తినీ, వివేచనా శక్తినీ కుంటుపరుస్తుంది. శత్రుత్వం అంటే నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం! అది మన వివేకాన్ని  మరుగుపరుస్తుంది. నువ్వు ఇతరుల్లో ఏ లక్షణం ఇష్టపడవో, అదే లక్షణం నీలో పెంపొందించుకుంటావు. అలాంటి మనిషిలో పగ అనే తీవ్రమైన ఆవేశం ఉంటుంది. ద్వేషమున్న వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం నాశనమవుతుంది. ద్వేషింపబడే వాడు తనను ద్వేషించేవాణ్ణి అసహ్యించుకుంటాడు. ద్వేషించే వాడు ఒత్తిడికీ, ఆందోళనకు గురైతే, ద్వేషించబడేవాడి మదిలో అవిశ్వాసం, అసహాయత చోటు చేసుకుంటాయి. ఇతరులను ద్వేషించేవారిని అందరూ దూరంగా ఉంచుతారు. వాళ్ళు నిస్పృహ చెంది ఒంటరితనంతో బాధపడతారు.


ఉత్తర భారతదేశంలో ఒక సన్న్యాసి చేతిలో పైసా లేకుండా ఒక చోట నుండి మరొక చోటుకు తిరిగేవారు. ప్రజలు  మహాజ్ఞాని అయిన ఆ సన్న్యాసి పలుకులు శ్రద్ధగా వినేవారు. పెద్ద మనిషి తరహాగా ఉండమనీ, ఇతరులతో క్రూరంగా ప్రవర్తించవద్దనీ ఆయన ప్రజలకు బోధించేవారు. ఒకమారు వేయిమందికి పైగా ఉన్న సభలో ఆయన, "ద్వేషాన్ని మించిన భయంకరమైన పాపం ఇంకొకటి లేదు. ద్వేషం ఓ భయంకర రోగం. ద్వేషంతో ద్వేషాన్ని ఎన్నటికీ జయించలేం. ద్వేషాన్ని ప్రేమ, దయ అనే ఆయుధాలతో జయించండి!” అని చెప్పారు. ఈ పరివ్రాజక సన్న్యాసి ఎవరో కాదు గౌతమ బుద్ధుడే. 


2500 ఏళ్ళ క్రితం బుద్ధుడు చేసిన బోధలు అన్ని కాలాలలో, అన్ని రకాలైన దుఃఖాలకూ, బాధలకూ దివ్య ఔషధం లాంటివి. మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారా? అదే మీలో ఉన్న బలహీనత. అదే మీరు చేసే పెద్ద తప్పిదం. దాన్ని తక్షణం వదిలిపెట్టండి!


ఎప్పుడైతే మీరు ఇంకొకర్ని ద్వేషించడం ప్రారంభిస్తారో, మిమ్మల్ని ఆదేశించే శక్తి వారికి ఇచ్చినట్టే! వాళ్ళు మీ నిద్ర, ఆకలి, రక్తపోటు, ఆరోగ్యం, సంతోషం అన్నింటినీ ఆదేశిస్తారు. వారిని గురించి తలుచుకుంటేనే మీకు ఎంత చీకాకు కలుగుతుందో మీ శత్రువులకు తెలిస్తే వారు సంతోషంతో గంతులేస్తారు. మీకు మీ శత్రువుల పట్ల ఉన్న ద్వేషం వల్ల వారికి ఏ హానీ కలగదు సరికదా అది మిమ్మల్ని బాధ, దుఃఖం అనే నరకానికి తీసుకువెళుతుంది. స్వామి వివేకానంద, “ఇతరుల పట్ల మీరు అసూయా ద్వేషాలు చూపితే ఆ ఫలితం మీకే వడ్డీతో సహా చుట్టుకుంటుంది. దాన్ని ఏ శక్తీ నిరోధించ లేదు. మీరు ఒకసారి వాటిని కదిపితే అవి తిరిగి మీద పడినప్పుడు వాటిని భరించి తీరాల్సిందే! ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మీరు చెడ్డపనులు చేయకుండా ఉంటారు!” అని బోధించారు.


మరణించే ముందు కూడా కొందరు పగతీర్చుకోవడానికీ, ఇతరుల జీవితాలు నాశనం చెయ్యడానికీ పన్నాగాలు పన్నుతూ ఉంటారు. కొందరు, “నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేను. చచ్చి దయ్యంగా మారి అయినా నిన్ను ఏడిపించుకు తింటాను!" అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఈ దేహం పోతుందేమో కానీ పగ తీర్చుకోవాలన్న కోరిక మాత్రం పోదు. కొందరు బయటకు తెలియనీయకుండా పగకు ఆశ్రయం కల్పిస్తారు. మాటలోనూ, ప్రవర్తనలోనూ వారి మనస్సును బయట పడనివ్వరు కానీ, వారిలో పైకి కనపడకుండా దాగిన పగ వారి వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. అందుకే ద్వేషమే మనిషిని దిగజార్చే మొదగి శత్రువు.


                                      ◆నిశ్శబ్ద.