మహావిష్ణువును మూడు జన్మలు సంతానంగా పొందినవారు!
మహావిష్ణువును మూడు జన్మలు సంతానంగా పొందినవారు!
ద్వాపరయుగం చివరలో ఈ భూమిని రాక్షసరాజులు పరిపాలిస్తుండేవారు. వారందరూ అధికారమదంతో ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోకుండా విందులూ విలాసాలలో మునిగితేలుతుండేవారు. నిరంకుశులుగా ప్రవర్తించేవారు. ధర్మదూరులై చరించేవారు. యథా రాజా తథా ప్రజ. ప్రభువు ఉత్తముడయితే... ప్రజలు ఉత్తములవుతారు. ప్రభువు అధర్మపరుడయితే ప్రజలు కూడా అధర్మపరులవుతారు. రాక్షసుల దుష్టపాలనలో ప్రజలు మంచిచెడ్డల విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వశులయ్యారు. ధర్మానికి విరుద్ధంగా నడిచారు. నీతిమాలిన పనులు చేశారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి, భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు.. ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమయ్యేముందు శ్రీకృష్ణుడు అవతరించాడు.
శ్రీహరి సర్వజ్ఞుడై వుండి కూడా భూలోకాన వ్రేపల్లెలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మనలానే తనూ జన్మించినట్టూ, పెరిగి పెద్దవాడైనట్టూ. మమతానుబంధాలకు కట్టుబడివున్నట్టూ, కష్టసుఖాలను అనుభవిస్తున్నట్టూ, శత్రువుల పట్ల విరోధం వహించినట్టూ, మిత్రులను చేరదీసినట్టూ నటించాడు. నటన చెయ్యడంలోనూ లీలలు ప్రదర్శించడంలోనూ శ్రీకృష్ణుడు అగ్రేసరుడు కదా..
శ్రీకృష్ణుని కుమారునిగా పొందే అదృష్టం దేవకీ వసుదేవులకు దక్కింది. పెంచి పోషించుకునే మహాభాగ్యం యశోదానందులకు కలిగింది. జగన్నాటక సూత్రధారుని కని దేవకీవసుదేవులూ, లాలించి, పోషించి, పెంచి పెద్దచేసి యశోదానందులూ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఉత్తమోత్తమ గతి సాధించుకున్నారు.
పూర్వం సుతపుడనే ప్రజాపతి వుండేవాడు. అతని భార్య పృశ్ని ఆమె మహా పతివ్రత. ఆ దంపతులు శ్రీహరిగూర్చి పన్నెండువేల దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సుచేశారు. వారి తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యేకమై ఏదైనా.. వరం కోరుకోమని అడిగారు. సుతపుడూ ఆయన భార్యా ఏది అడిగినా ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా వున్నాడు. ముక్తిని కోరినా ఇచ్చేవాడే. కాని ఆ దంపతులు పరమ మంగళాకారుడయిన దేవదేవుని మహోన్నత సౌందర్యం చూసి ముగ్ధులై మాకేమీ వద్దు తండ్రీ! నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే పదివేలు' అన్నారు. ఆ అనడం కూడా ముచ్చటగా మూడుసార్లు అన్నారు. శ్రీమన్నారాయణుడు సరేనని వారికి మూడుజన్మల్లో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు. ఆ జన్మలోనే పృశ్ని కడుపున చేరి పృశ్నిగర్భుడుగా పేరుపొందాడు.
ఆ తరువాత జన్మలో పృశ్ని, సుతపుడు - అదితి కశ్యపులైనారు. అప్పుడు క్షీరాబ్ధిశయనుడు వారికి వామనుడై జన్మించాడు. మూడవ జన్మలో సుతపుడు, పృశ్ని- దేవకీ వసుదేవులైనారు. వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడై జన్మించాడు.
మరీచి కుమారుడయిన కశ్యప ప్రజాపతి ఒకసారి ఒక మహా యజ్ఞం తలపెట్టాడు. ఆ యాగానికి చాలా గోవులు కావల్సివచ్చాయి. అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు. మరునాడు తల్లులు కనిపించక లేగదూడలు తల్లడిల్లాయి. తమ తల్లులకోసం అవి దీనంగా రోదించాయి. వరుణుడికీ సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు. అతని భార్యలు అదితి, సురస వరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దురుసుగా మాట్లాడారు. వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వాళ్ళను శపించాడు. తిన్నగా వెళ్ళి జరిగిన సంగతంతా బ్రహ్మతో చెప్పి "గోవత్సాలు ఇప్పుడు తమ తల్లులకోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అదితి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్నబిడ్డల కోసం అలా దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది" అన్నాడు.
'తప్పు అని తెలిసి కూడా గోవులను దొంగిలించిన కారణాన నువ్వూ నీ భార్యలు అదితీ, సురసా గోకులంలో జన్మిస్తారు' అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు. ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగానూ అదితి దేవకిగానూ సురస రోహిణిగానూ జన్మించారు.
◆ నిశ్శబ్ద.