Read more!

శ్రీరాముడిని శిష్యుడిగా భావించిన సాధువు కథ!

 

శ్రీరాముడిని శిష్యుడిగా భావించిన  సాధువు కథ!

ఇది ఈనాడు జరిగినది కాదు, అయోధ్యలో రామాయత సంప్రదాయానికి చెందిన సాధువుల సమ్మేళనం జరుగుతున్నది. చిత్రకూటం నుండి ఒక మహాత్ముడు కూడా విచ్చేశాడు. గంభీర వదనం, శ్వేతవస్త్రధారి, మెడలో స్ఫటికమాల, కాళ్ళకు పావుకోళ్ళు. ఆయన శిరోజాలు తెల్లబడిపోయాయి. సరయూ నదీతీరాన నిశ్శబ్దంగా నివసించేవాడు. రామాలయానికి కానీ, కనకప్రాసాదంలో ఉన్న సీతారాములను కానీ దర్శించుకోవడానికి  వెళ్ళడు. అడపా, దడపా 'ధుని'ని ప్రజ్వలింపజేసి, వేదమంత్రాలు పఠిస్తూ ఆహుతి సమర్పిస్తాడు. రాత్రిపూట హఠాత్తుగా 'లాలా', ''లాలా' అంటూ పిలుస్తాడు. కానీ ఎవరైనా చూడబోతే అక్కడ ఆయనొక్కడే ధ్యానమగ్నుడై ఉంటాడు! భిక్షకు వెళ్ళిన దాఖలాలూ కనపడవు కానీ, ఎవరో గోధుమపిండి, పప్పు, కూరగాయలు అక్కడ పెట్టి వెళతారు. ఆయన చితికల మంటపై రొట్టెలు కాల్చి, పప్పు, కూర వండుకుంటాడు. భోజనానంతరం నదీతీరాన్నే పడుకుంటాడు. ఋషితుల్యుడైన ఆయన సాన్నిధ్యానికి వెళ్ళడానికి జనం సంశయించేవారు. తెలతెలవారక మునుపే నీటిలో మునిగి లేస్తున్న 'బుడుగు' శబ్దాలు, దానితోపాటు గంభీర స్వరం - ఎవరికో పాఠాలు చెబుతున్నట్లు. 

ఎంత విచిత్రమైన సాధువో! రామ సంకీర్తన చేయడు, రామాయణ పఠనం లేదు. పోతే తన వద్ద యోగవాసిష్ఠ రామాయణ గ్రంథం మాత్రం ఉంది. అది చదవడం, లేదంటే ధ్యానం చేయడం.. ఇంతే! ఆయన ఎవరికో బోధిస్తాడు. కానీ ఎవరికి, ఏమని బోధిస్తున్నదీ స్పష్టంగా వినపడదు. చూడబోతే మరొక వ్యక్తి కనపడడు.

మిగతా సాధువులకు సైతం ఏమీ అంతు పట్టడం లేదు. ఎటువంటి సాధువండీ! రామ దర్శనానికి వెళ్ళడే! కానీ ఆయన వ్యక్తిత్వం, వదనం ముగ్ధమోహనాలు. ఆయనలో ఒక అలౌకిక ప్రశాంతత దర్శనమిస్తుంది. అజగర వృత్తిని అవలంబిస్తాడు. ఆహారం దానంతట అదే లభిస్తుంది. ఒకసారి అక్కడి వారు ఎవ్వరమూ భిక్ష పంపకుండా ఉందాం. ఏం జరుగుతుందో చూద్దామని నిర్ణయించుకున్నారు. ఆశ్చర్యం! సరిగ్గా సమయానికి దినుసులు అక్కడ ఉన్నాయి! వాటిని తీసుకొచ్చిన వ్యక్తిని ఎవ్వరూ చూడలేదు.

ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. రామాయత సాధువుల్లో ఒక సాధువు 'ఈ సాధువు కూడా మన సంప్రదాయానికి చెందినవాడే కానీ ఆయన సాధన మనకు అర్థం కావడం లేదు. ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకొందాం రండి' అన్నాడు. అందుకు అందరూ సమ్మతించారు. సాధువులు కొంతమంది ఆయన వద్దకు వెళ్ళి 'మీరు అయోధ్యకు వచ్చి రామాలయం సందర్శించరు. ఈ నదీ తీరంలోనే కూర్చొని, శ్రీరామచంద్రుణ్ణి ఏ విధంగా భజిస్తున్నారో తెలుపండి' అని అడిగారు.

'నేను బాల్యం నుండి మా తండ్రిగారి వద్ద యోగవాసిష్ఠం వినేవాడిని. నాకు వసిష్ఠ మహర్షి పట్ల ఆకర్షణ రానురాను పెరిగి, చివరకు ఆయనతో మమేకం చెందాను. నా ఆరాధ్యదైవమైన రామచంద్రుణ్ణి నా శిష్యుడిగా భావింపసాగాను! ఆయనకు బోధనలు చేయసాగాను, రామునితో కూడి గ్రంథపఠనం చేస్తాను. ఆయనతో శాస్త్రసమాలోచనలు చేస్తాను. దేవాలయానికి వెళ్ళి సీతారాములను దర్శించాలనే ఆలోచనే నాకు రాలేదు. 

ఇటువంటి సాధన గురించి తామెప్పుడూ విననే లేదు అని మిగతా సాధువులు నిరుత్తరులైనారు. వారంతా ఆ సాధువును 'రాముని వివాహానంతరం కైకేయి సీతమ్మకు కనకప్రాసాదం బహూకరించింది. అక్కడ సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఒక రామాలయం కూడా ఉంది, దాన్ని రామదర్బారు అంటారు. ఒక్కరోజు మాతో వచ్చి దర్శనం చేసుకోండి' అని అభ్యర్థించారు. ఆ సాధుమహాత్ముడు కొంచెం తటపటాయిస్తూ 'చూడండి! నేనక్కడకు వెళితే సీతాదేవి నన్నుచూసి సిగ్గుపడుతుంది. రాముడు కూడా దిగ్గున లేచి నిలబడతాడు. నేను వెళ్ళడం 'సముచితం కాదు' అని అన్నాడు.

మిగతా సాధువులు ససేమిరా అన్నారు. ఆయనను బలవంతంగా కనకప్రాసాదానికి తీసుకొని వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం! మహాత్ముడు అడుగు పెట్టీపెట్టగానే, కనకప్రాసాదంలో హఠాత్పరిణామం జరిగింది. సీతాదేవి శిరస్సు వంగిపోయింది. చీరకొంగు ముఖంపైకి మేలిముసుగులా జారింది! ఆసీనమై ఉన్న శ్రీరాముని విగ్రహం లేచి, నిలబడింది. మహాత్ముడు వెంటనే వెలుపలకు వెళ్ళిపోయాడు. రామాయత సాధువులు ఆయనను క్షమాపణ వేడుకోవాలని వెళ్ళారు. కానీ ఆ సాధువు కనిపించలేదు. 

                                   ◆నిశ్శబ్ద.