భాగవతం ప్రజల్లోకి ఎలా వ్యాప్తమైంది!

 

భాగవతం ప్రజల్లోకి ఎలా వ్యాప్తమైంది?

వేదవ్యాసుడిని నారదుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభించాడు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు. పోతనగారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయట.. ఒక అద్భుతమయిన ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది.

అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరు కూడ దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. సత్రయాగము అనే యాగము ఒక విచిత్రమయిన యాగము. దీర్ఘసత్రయాగం అంటే చాలాకాలం పాటు కొనసాగే యాగం. దానిని నైమిశారణ్యంలో చేశారు. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారు. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. దానికి అనువయిన ప్రదేశంగా నైమిశారణ్యమును నిర్ణయించుకున్నారు. ఆ నైమిశారణ్యములో చేసిన క్రతువు చాలా విశేషమయిన ఫలితమును ఇస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రము అది. అటువంటిచోట ఈ దీర్ఘసత్రయాగమును చేసినట్లయితే బాగుంటుందని శౌనకాది మహర్షులందరు కూడ ఈ యాగమును ప్రారంభం చేశారు. 

అక్కడికి సూతమహర్షి విచ్చేశారు. ఒక కోయిల వచ్చిందనుకోండి.. అది పాట పాడితే బావుంటుందని కోరుకుంటాము. ఒక నెమలిని చూసినట్లయితే అది ఒక్కసారి పురివిప్పితే బాగుండును అనుకుంటాము. అలాగే సూతుడు కనపడినప్పుడు 'అయ్యా, భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి' అని అడగకపోతే అలా అడగని వాడు చాలా అదృష్టవంతుడు. సూతుడు పురాణవాఙ్మయము అంతా తెలిసినవాడు. అటువంటివాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను, హరికథామృతమును తెలుసుకోవాలి.

అందుకని శౌనకాది మహర్షులు సూతుడిని అడిగారు 'అయ్యా, నీవు రోమహర్షణుని కుమారుడవు. నీకు పురాణములలో విషయములు అన్నీ కూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడిన భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరిభక్తి, హరికథామృతము, విశేషంగా చెప్పబడ్డాయి. ఏ భగవంతుని గుణములు వినడం వల్ల మళ్లీ పుట్టవలసిన అవసరము కలుగదో, ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో, అటువంటి విషయములను కలిగి ఉన్న గ్రంథము భాగవతము. అటువంటి పురాణమును మాకు వివరించండి. అసలు ఆ శ్రీహరి కృష్ణభగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందునా వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రివేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుడిని ఎందుకు వదించాడు? తాను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ, అంతకాలంపాటు భూమిమీద తాను ఉండి శత్రుసంహారం చేసి జరాసంధుడివంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమయిన ల ప్రదర్శిస్తాడు భగవానుడు.' ఇవన్నీ ఎందుకు చెప్పండి అని అడుగుతారు. 

ఇలా భాగవతం గురించి సూత మహర్షిని శౌనకాది మునులు అడగడంతో వ్యాప్తమైంది.

                                     ◆నిశ్శబ్ద.