Read more!

కృష్ణుడు తన గురించి చెప్పిన పొలికలు!

 

కృష్ణుడు తన గురించి చెప్పిన పొలికలు!


రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేజో యక్షరక్షసామ్||

వసూనాం పావకశ్చాస్మి మేరుశ్శిఖరిణామహమ్ ||

ఏకాదశ రుద్రులు అంటే 11 మంది. వారు 1. హరుడు 2. బహురూపుడు 3. త్ర్యంబకుడు, 4. అపరాజితుడు 5, వృషాకపి 6. శంభువు, 7. కపర్ది, 8. రైవతుడు 9. మృగవ్యాధుడు 10. శర్వుడు 11.కపాలి. వీరిలో శంకరుడను నేను, అంటే హరుడు అని అర్ధము. శం అంటే శుభములు కరుడు కలిగించేవాడు.

ధనవంతులలో కుబేరుడు. ఆయన యక్షులకు, రక్షసులకు అధిపతి, రావణునికి సోదరుడు.తన సృష్టిలో భాగంగా బ్రహ్మ కొంత మందిని సృష్టించాడు. కాని వారు బ్రహ్మమీదనే తిరగబడ్డారు. 

తమకు వెంటనే ఆహారం కావాలని గోలచేసారు. వీరి బాధ పడలేక బ్రహ్మ వీరిని వదిలేసాడు. కాని వీరు బ్రహ్మను వదలలేదు. కొంత మంది వీడిని రక్షించకండి అని అరిచారు. మరి కొందరు వీడిని చంపండి అని అరిచారు. చంపండి అన్నవాళ్లు యక్షులు గానూ, రక్షించకండి అన్నవాళ్లు రాక్షసులుగానూ ప్రసిద్ధికెక్కారు. వీరిలో కూడా మంచి వాళ్లు లేకపోలేదు. కాని తమోగుణం ఎక్కువగా ఉన్న వాళ్లను యక్షరాక్షసులు అని అన్నారు. వీళ్లు రెండు విధములైన జాతులుగా మనం అర్ధం చేసుకోవచ్చు. కుబేరుడు వీరికి అధిపతి. తరువాత రాక్షసులందరూ కుబేరుడి తమ్ముడైన రావణుడి పక్షాన చేరారు. ఈ కథ మీకు ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది. రాక్షసులు అంటే దయ, జాలి, కనికరం, కరుణ, ప్రేమ, అభిమానము లేకుండా క్రూరంగా ప్రవర్తించేవాళ్లు. ఇటువంటి వాళ్లను ఈ రోజుల్లోకూడా రాక్షసులు అని మనం అంటూ ఉంటాము.

వసువులు ఎనిమిది మంది. వారిని అష్టవసువులు అని అంటారు. 1. ధరుడు, 2. ధ్రువుడు 3.సోముడు 4. అహుడు 5. అనిలుడు 6. అనలుడు 7. ప్రత్యూషుడు 8. ప్రభాసుడు. 

వీరిలో ఆఖరి వాడు ప్రభాసుడు. ఇతడు ద్వాపర యుగంలో వశిష్టుని శాపం వలన గంగా దేవికి కుమారుడుగా జన్మించాడు. భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు. 

వీరిలో పావకుడు అంటే అనలుడు నేను. అనలుడు అంటే అగ్ని. అగ్ని పంచభూతములలో ఒకడు. ఆకాశము నుండి వాయువు. వాయువు నుండి అగ్ని పుట్టాయి. ఆకాశము, వాయువు కంటికి కనపడవు. పంచభూతములలో మొట్ట మొదట కనపడినది అగ్ని. అందుకే అగ్నికి అంత ప్రాధాన్యము. అగ్నికి హవ్యవాహనుడు అని కూడా పేరు. యజ్ఞములు చేసేటప్పుడు అగ్నిని వేలుస్తారు. ఆ అగ్నిలో వేసే ఆహుతులను అగ్ని తీసుకుపోయి అందరి దేవతలకు అందజేస్తాడు. అగ్నికి ప్రతిరూపమే సూర్యుడు. అందుకే వేడి, వెలుతురు ఇచ్చేవాటిలో అగ్ని, సూర్యుడు, ముఖ్యమైన వారు. పూర్వము ప్రతి ఇంట్లో అగ్నిహెూత్రము ఆరకుండా వెలుగుతూ ఉండేది. కుశలప్రశ్నలు వేసేటప్పుడు మీఇంట్లో అగ్నులు బాగా వెలుగుతున్నాయా అని అడగడం మనం పురాణాలలో చదువుతూ ఉంటాము. ఇప్పటికీ కొంతమంది (పార్శీలు కావచ్చు) అగ్నినే వారి ఇష్టదైవంగా పూజిస్తారు. ఆ అగ్నిని నేను అంటున్నాడు కృష్ణుడు.

తరువాత పర్వతశి ఖరములలో అంటే ఎత్తైన శిఖరములలో మేరు పర్వతము నేను. ఈ మేరుపర్వతము ఎక్కడ ఉన్నది అనడం ఒక వివాదాంశము. హిమాలయాలలో, టిబెట్ దగ్గర ఉందని కొంతమంది, ఉత్తరధృవము దగ్గర ఉందని కొంతమంది, దక్షిణ ఆఫ్రికాలో భూమధ్యరేఖ మీద ఉందని కొంత మంది అంటుంటారు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం సూర్యుడు మేరు పర్వతం చుట్టు ప్రదక్షిణం చేస్తుంటాడు అని ఉంది. హిమాలయాలలో ఉంటే అది కుదరదు. కాబట్టి ఇంకెక్కడో ఉండి ఉండాలి. ఆ మేరుపర్వతశిఖము నేను అని అన్నాడు కృష్ణుడు.

                                           ◆వెంకటేష్ పువ్వాడ.