శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏం జరిగింది..భార్యలు ఏమయ్యారు.. అర్జునుడి ఎందుకు రోదించాడు!
శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏం జరిగింది..భార్యలు ఏమయ్యారు.. అర్జునుడి ఎందుకు రోదించాడు!
విష్ణు పురాణం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకను చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఒక రోజు వాయుదేవుడు కృష్ణుడిని కలవడానికి వచ్చి, "ప్రభూ, నువ్వు వైకుంఠానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడు.. "ఇప్పటి నుండి ఎనిమిది రోజుల తర్వాత, ద్వారక అంతా సముద్రంలో మునిగిపోతుంది, ఆపై నేను వైకుంఠానికి తిరిగి వస్తాను. ఈ రోజుల్లో నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఉంది." అన్నాడు.
సరిగ్గా ఏడు రోజుల తర్వాత.. సరిగ్గా ఇదే జరిగింది. కానీ ఆ ముఖ్యమైన పని ఏమిటో, కృష్ణుడి మరణం తర్వాత అతని భార్యలకు ఏమి జరిగిందో.. అర్జునుడు దుఃఖంతో వ్యాసుడిని ఎందుకు సంప్రదించాడు అనే విషయాలు చాలా మందికి తెలియవు. వాటి గురించి తెలుసుకుంటే..
ఏడు రాత్రులు ఎందుకు అడిగాడు..
విష్ణు పురాణం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, శ్రీకృష్ణుడు ద్వారకను చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఈ సమయంలో, ఒక రోజు, వాయుదేవుడు కృష్ణుడి వద్దకు వచ్చి, అతనికి ఏకాంతంగా నమస్కరించి, "ఓ ప్రభూ, నువ్వు వైకుంఠానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. అక్కడికి వెళ్లి దేవతలను రక్షించు. నువ్వు భూమిపై కనిపించి వంద సంవత్సరాలకు పైగా అయింది. కాబట్టి, అది సరైనదని నువ్వు భావిస్తే, ఇప్పుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళు." కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి సుఖంగా ఉంటే, నువ్వు ఇక్కడ ఉండవచ్చు. అని అన్నాడు.
వాయుదేవుడి మాటలు విన్న కృష్ణుడు, "నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే, అది నాకు తెలుసు. కానీ నేను యదువంశీయులను నాశనం చేయాలి. వారి నాశనం లేకుండా, భూమి భారం తగ్గదు. నేను వారిని రాబోయే ఏడు రాత్రులలో నాశనం చేసి తిరిగి వస్తాను. ఈ సమయంలో, ద్వారక అంతా సముద్రంలో మునిగిపోతుంది" అని అన్నాడు. దాంతో వాయుదేవుడు తిరిగి వెళ్లిపోయాడట.
శ్రీకృష్ణుడు శరీరాన్ని వదలడం..
శ్రీకృష్ణుడు అలా చెప్పిన ఏడు రాత్రులలో అదే జరిగిందట. శ్రీ కృష్ణుడు యదువంశీయులను నాశనం అయ్యేలా చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలిపెట్టాడట. శ్రీ కృష్ణుడు దీనికి ముందే అర్జునుడికి సందేశం పంపాడట. రాబోయే ఏడు రోజుల్లో ద్వారక అంతా సముద్రంలో మునిగిపోతుందని. అందువల్ల ద్వారక లోని స్త్రీలు, ద్వారక సంపదతో బయలుదేరాలని సందేశం పంపాడట. ఈ సందేశం అందిన వెంటనే అర్జునుడు శ్రీ కృష్ణుడిని కలవడానికి బయలుదేరాడట. కానీ అప్పటికే శ్రీ కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడట.
విష్ణు పురాణం ప్రకారం శ్రీ కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు అతని శరీరాన్ని తమ ఒడిలో తీసుకుని ఆయనతో పాటు దహనం అయ్యారట. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ప్రధాన భార్యలు. భూమిపై ఒక జీవి ఏ రూపంలో ఉన్నా అది చివరికి వెళ్లిపోవాలి. అందుకే శ్రీ కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి తిరిగి వచ్చాడు.
శ్రీకృష్ణుడి ఇతర భార్యలు..
అంత్యక్రియల తర్వాత అర్జునుడు అక్కడి నుండి వెళ్లి, ద్వారక సముద్రంలో మునిగిపోయిందని అందరికీ కృష్ణుడి సందేశాన్ని తెలియజేశాడట. అప్పుడు అర్జునుడు "అందరూ సిద్ధంగా ఉండండి, మనం ఇప్పుడే బయలుదేరాలి" అని ప్రకటించాడట. అర్జునుడు తన భార్యలందరితో, ఇతర కుమార్తెలతో, కృష్ణుడి మనవడు, మధుర రాజు వజ్రుడితో బయలుదేరినప్పుడు, సముద్రం ఉప్పొంగిందట
అయితే సముద్రం భయపడి, శ్రీకృష్ణుడి రాజభవనాన్ని ముంచలేదట. ఎందుకంటే కృష్ణుడు అక్కడే ఉన్నాడని అంటారు. అర్జునుడు స్త్రీలను, సంపదను తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి, దొంగలు దురాశకు గురై దాడి చేశారట. అర్జునుడు తన గాండీవ విల్లును కూడా ఎత్తలేకపోయాడని, అతని మాయా శక్తులు పనిచేయడం ఆగిపోయాయని విష్ణు పురాణంలో ఉంది. అప్పుడు దొంగలు సంపదలను, స్త్రీలను స్వాధీనం చేసుకున్నారట. ఈ కారణంగానే అర్జునుడు విలపిస్తూ వ్యాసుడి వద్దకు వెళ్లాడట.
వ్యాసుడు చెప్పిన రహస్యం..
వ్యాసుని వద్దకు చేరుకున్న అర్జునుడు మొత్తం సంఘటనను వివరించాడు. అంతా విన్న వ్యాసుడు, "నువ్వు దుఃఖించకూడదు. నువ్వు చెప్పినదంతా నిజమే, అది జరగాల్సింది కాబట్టే జరిగింది అని చెప్పాడట. దొంగలు సంపదను, భార్యను దొంగిలించడం వెనుక ఉన్న రహస్యాన్ని నేను నీకు చెబుతాను" అని ఇలా చెప్పాడట..
పురాతన కాలంలో అష్టావక్రుడు బ్రహ్మను స్తుతిస్తూ చాలా సంవత్సరాలు నీటిలో నివసించాడు. రాక్షసులను జయించిన తరువాత, దేవతలు సుమేరు పర్వతంపై గొప్ప వేడుకను నిర్వహించారు. అక్కడికి వెళ్ళేటప్పుడు, వేలాది మంది దేవలోక అప్సరసలు ఆ ఋషిని చూసి ఆయనను స్తుతించడం ప్రారంభించారు. మెడ వరకు నీటిలో మునిగిపోయి.. జడ జుట్టుతో ఉన్న ఋషిని చూసి వారు వినయంగా ఆయనను స్తుతించారు. దీనితో సంతోషించిన అష్టావక్రుడు, "నేను మీ ప్రార్థనలకు సంతోషించాను.. మీకు ఏది కావాలో చెప్పండి, అది కష్టమైనా నేను దానిని నెరవేరుస్తాను" అని అన్నాడట.
అప్పుడు వారిలో చాలామంది శ్రీకృష్ణుడిని తమ భర్తగా పొందే వరం అడిగారు. విష్ణు పురాణం ప్రకారం అష్టావక్రుడు నీటి నుండి బయటకు వచ్చి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. అప్సరసలు అష్టావక్రుడి వికారమైన శరీరాన్ని చూశారు, ఆయన శరీరం ఎనిమిది చోట్ల వంకరలు తిరిగి ఉందట. దీనిని చూసిన అప్సరసలు పగలబడి నవ్వారు, ఎంత నవ్వు దాచాలి అనుకున్నా వారు దాయలేకపోయారు. దీనితో కోపగించిన అష్టావక్రుడు, "నా కృప వల్ల మీకు శ్రీకృష్ణుడు భర్తగా లభిస్తాడు, కానీ నా శాపం వల్ల మీరు దొంగల చేతిలో చిక్కుకుంటారు" అని శపించాడు. అందుకే ద్వారక నుండి బయలుదేరుతున్నప్పుడు, అర్జునుడు కూడా రక్షించలేకపోయేంత సంఘటన జరిగింది.
*రూపశ్రీ