ఏ దేవుడిని ఏ పువ్వుతో పూజిస్తే మంచిదో తెలుసా?
ఏ దేవుడిని ఏ పువ్వుతో పూజిస్తే మంచిదో తెలుసా?
భారతీయ హిందూ ధర్మంలో దేవతలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ముక్కోటి దేవతలున్నారని అంటూ ఉంటారు. అయితే రోజూ పూజలోనూ, పండుగలలోనూ, వ్రతాలలోనూ కొందరు దేవతలను ఎక్కువ పూజిస్తాం. ఆ దేవుళ్లకు సంబంధించి నియమాలు పాటిస్తూ పండ్లు, పూలు, నైవైద్యాలు సమర్పిస్తాం. అయితే దేవుళ్ళ కృప తొందరగా భక్తులమీద ఉండాలంటే ఆయా దేవుళ్లకు ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. దేవుళ్లకు నచ్చిన పువ్వులతో పూజ కూడా చేస్తుంటారు. ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం? తెలుసుకుంటే..
వినాయకుడు..
వినాయకుడు, గణేశుడు, లంబోధరుడు ఇలా ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఏ కార్యంలో అయినా తొలి పూజ అందుకునే వినాయకుడికి తులసి ఆకులను మినహించి మిగతా అన్ని ఆకులతోనూ, పువ్వులతోనూ పూజ చేయవచ్చు. ముఖ్యంగా గరిక అంటే వినాకుడికి చాలా ఇష్టం. పువ్వులేమీ లేకున్నా గరికను సమర్పిస్తే సంతోషిస్తాడు వినాయకుడు.
శివుడు..
విఘ్నాధిపతికి తండ్రి అయిన పరమేశ్వరుడు సృష్టిని పాలించేవాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా చిటుక్కుమనదు అని అంటారు. శివుడి పూజకు ఉమ్మెత్త, పారిజాతం, నాగకేసరాలు, గన్నేరు, జిల్లేడు, గంట పుష్పం, తామర మొదలైన పువ్వులను ఉపయోగిస్తే శివుడు సంతోషిస్తాడు.
విష్ణువు..
త్రిమూర్తులలో ఒకరు అయిన విష్ణువుకు తులసి దళాలు సమర్పిస్తే తొందరగా సంతోషిస్తాడు. ఇది మాత్రమే కాకుండా తామర పువ్వులు, పొగడ పూలు, విరజాజులు, కడిమి పూలులేదా కదంబం పూలు, మొగలి పువ్వులు, మల్లె, అశోక, మాలతి, లిల్లీ, సంపంగి, వైజయంతి మొదలైన పువ్వులు విష్టు పూజకు ప్రీతికరం.
కృష్ణుడు..
కృష్ణునికి తులసి మాల అంటే చాలా ఇష్టం. ఇది మాత్రమే కాకుండా చంద్రకాంత పుష్పాలు, ఎరుపు గన్నేరు, లిల్లీ, మాలతి, మోదుగు పూలు,వైజయంతి పువ్వులు కృష్ణుడికి ప్రీతికరం.
దుర్గాదేవి..
అమ్మవారికి ఎర్రని పువ్వులంచే చాలాఇష్టం. ముఖ్యంగా మందార, గులాబీ పువ్వులు అమ్మకు ఇష్టం.ఇవి కాకుండా తెల్ల తామర, గులాబి, సంపంగి పువ్వులు కూడా అమ్మకు ఇష్టమైనవే..
మహాలక్ష్మి..
లక్షీదేవికి ఎక్కువ ఇష్టమైన పువ్వులు ఎరువు రంగువే. ముఖ్యంగా ఎరుపురంగు కమలం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. పసుపు రంగు పువ్వులు, ఎరుపు గులాబీలు కూడా అమ్మకు ఇష్టం.
హనుమంతుడు..
ఆంజనేయ స్వామికి కూడా ఎరుపు రంగు అంటే ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న గులాబీలు, ఎర్ర బంతిపూలు, మందార, దానిమ్మ పూలు హనుమంతునికి సమర్పించవచ్చు.
శనిదేవుడు..
శనిదేవుడి పేరు చెబితే చాలామంది భయపడతారు. అయితే శని దేవునికి నీలం రంగు అత్తిపత్తి పువ్వులను సమర్పించాలి. ఇవి సమర్పిస్తే శని దేవుడు ప్రసన్నుడు అవుతాడు.
సూర్యుడు..
ఆదిదేవుడు, ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు పువ్వలను సమర్పించి నీటిని అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే సూర్యుని కృప ఉంటుంది.
*నిశ్శబ్ద.