భాగవతంలో సుదర్శనుడి వృత్తాంతం ఇదే..!
భాగవతంలో సుదర్శనుడి వృత్తాంతం ఇదే..!
ఒకసారి నందాదులు అంబికావనంలో వున్నప్పుడు ఒక పెద్ద పాము నందుని కరిచి అతడ్ని మింగబోయింది. అది చూసి గోపికలు పెద్ద పెట్టున హాహాకారాలు చేశారు. నందుడు కూడా భయంతో 'కృష్ణా! కృష్ణా' అని ఆక్రందన చేశాడు. ఆ ఆక్రందన విన్న కృష్ణుడు పరుగు పరుగున వచ్చి తండ్రిని పట్టి పీడిస్తున్న పాముమీదికి పదునయిన ఆయుధాలు విసిరాడు. కాని అది నందుడ్ని వదిలి పెట్టలేదు. కృష్ణయ్య అది గ్రహించాడు. ఆ మహా నాగం మీద ఆయనకు అమితంగా కోపం వచ్చింది. చరచరా దాని దగ్గరికి వెళ్ళి తన వామపాదంతో ఒక్క తన్ను తన్నాడు. శ్రీకృష్ణుని పాదస్పర్శవల్ల ఆ పాము తన రూపాన్ని వదిలి గంధర్వరూపం ధరించింది. గంధర్వుడు శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేశాడు. అది చూసిన గోపాలులందరూ ఆశ్చర్యపోయారు.
'స్వామీ! నేను సుదర్శనుడనే ఒక విద్యాధరుణ్ని. విద్యాధర వంశంలో పుట్టిన నాకు వినయ విధేయతలు లేకపోయాయి. నా ఐశ్వర్యం, నా అందచందాలు, నా భోగభాగ్యాలు నాకు అణకువ నేర్పకపోగా అమితమయిన గర్వాన్ని కలిగించాయి. ఆ గర్వంతో నాకు పెద్దా చిన్నా తారతమ్యం తెలియలేదు.
ఒకసారి నేను ఆకాశంలో విహరిస్తూ ఒకచోట అంగిరసులయిన ఋషులను చూశాను. వికృతంగా వున్న వారిపట్ల సానుభూతి కనబరచడానికి బదులు నేను వారిని అసహ్యించుకున్నాను. నానా దుర్భాషలాడాను. వారిని చూసి విరగబడి నవ్వాను. నేను అలా అనుచితంగా ప్రవర్తించినందుకు అంగిరసులు ఆగ్రహించారు. ఆ వెంటనే వారు 'ఏ రూపమూ సంపదా వల్ల నువ్వు మమ్మల్ని చిన్నచూపు చూసి చీదరించావో అవన్నీ హరించుకుపోయి నువ్వు ఒక పాముగా మారతావు' అని శపించారు.
'అప్పటికి తెలిసింది నాకు మహర్షులపట్ల ఎంత అమర్యాదకరంగా ప్రవర్తించానో! నా అనుచిత ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో క్షమించమని వాళ్ళను వేడుకున్నాను. మహర్షుల శాపానికి తిరుగులేదని తెలిసింది. వారి పాదాలమీద పడి శాపవిమోచనమెప్పుడో తెలుపవలసిందిగా అనేక రకాలుగా ప్రార్థించాను.
అంగిరసులకు నామీద జాలి కలిగింది. 'యదుకులంలో జనార్దనుడు ఉదయిస్తాడు. ఆయన పాదస్పర్శ తగిలి నీ పాము రూపం పోయి తిరిగి నీకు గంధర్వ రూపం లభిస్తుంది' అని చెప్పారు.
'తండ్రీ! నువ్వు భక్తుల భయాన్ని పారద్రోలడానికి గోపాలుడవై జన్మించావట. నిన్ను స్మరించినంతనే, నీ నామాన్ని ఉచ్చరించినంతనే పాపాలు హరించి పోతాయట. అలాంటిది నీ పాద స్పర్శ లభించిన నాకు శాప విమోచనం కలగడంలో వింతేముంది!' అని వినయంగా అన్నాడు. శ్రీహరి చిద్విలాసంగా నవ్వాడు. స్వామికి ప్రదక్షిణ చేసి సెలవు తీసుకొని తీసుకుని విద్యాధరుడు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి పాద స్పర్శ కూడా ఎంతో మహోన్నతమైనమైనదని ఈ సంఘటన తెలుపుతుంది.
*నిశ్శబ్ద.