సాక్షాత్తు పార్వతి అంశగా పిలవబడిన శేషాద్రి స్వామి గురించి తెలుసా?

 

తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రాన్ని తన నివాసంగా చేసుకుని ఎందరో భక్తులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించిన శ్రీరమణ మహర్షి గురించి తెలియనివారుండరు. భారతదేశపు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షుల్లో ఒకరైన వీరి గురించి తెలిసినవారికి యోగిపుంగవులైన శ్రీశేషాద్రిస్వామి గురించి కూడా తప్పక తెలిసి ఉంటుంది. రమణ మహర్షిని స్కందావతారంగానూ, శేషాద్రిస్వామిని పార్వతి అవతారంగానూ భావిస్తుంటారు. తిరువణ్ణామలైలో శ్రీరమణాశ్రమం పక్కనే ఉన్న శ్రీశేషాద్రి స్వామి సమాధి వద్ద ప్రతి ఏటా జనవరిలో ఎంతో వైభవంగా ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి. శేషాద్రి స్వామి గురించి పూర్తిగా తెలుసుకుంటే..

బాల్యంలో రమణమహర్షి అక్కడి అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న పాతాళలింగ గుహలో తపస్సు చేసుకునేవారు. అత్యంత పురాతనమైన ఆ కటిక చీకటి గుహలోకి అడుగుపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. వారక్కడ తపస్సు చేసుకునేవారు. అందులోని కీటకాలు, పురుగులు ఆయన తొడల కింద రక్తం కారేలా తొలిచేస్తున్నప్పటికీ, పుండ్లు ఏర్పడినా వారు ధ్యాన పారవశ్యంలో వీటిని లక్ష్యపెట్టేవారు కాదు. అక్కడి తుంటరి పిల్లలు ఆ గుహలో పడేలా రాళ్ళు, పెంకులు విసురుతుండేవారు. ఆ పిల్లల చేష్టలతో రమణుల తపస్సుకు అంతరాయం కలుగకుండా శ్రీశేషాద్రి స్వామి వారిని కాపాడుతుండేవారు. తపస్సమాధి లోనున్న బాల రమణుల ఉనికిని లోకానికి వెల్లడించినవారు శ్రీశేషాద్రి స్వామి. బాల రమణుని చూపించి, "నా బిడ్డ లోపల తపస్సు చేసుకుంటున్నాడు” అని చెప్పేవారు. "నేను పార్వతినని చెప్పలేదా? అడుగో కందుడు స్కందుడు" అనేవారు. రమణ మహర్షిని పలువురు అప్పట్లో చిన్న శేషాద్రి అని కూడా పిలిచేవారు.

ఇక శేషాద్రి స్వామి విషయానికి వస్తే కాంచీపురం వీరి స్వస్థలం. "అరుణాచలా! అంటే చాలు. ముక్తిని ప్రసాదిస్తాడు” అని చెప్పి మరణించిన తన తల్లి చివరి పలుకులతో ప్రభావితులైన శేషాద్రి స్వామి సుమారు 19 ఏళ్ళ వయసులో అరుణాచలం వచ్చేశారు. తపస్సాధనలతో ఇక్కడే స్థిరంగా ఉండిపోయారు. బాల్యం నుంచీ ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండేవారు. ఎల్లప్పుడూ భగవన్నామ జపం చేస్తూ, ఆధ్యాత్మికంగా ఎంతో సమున్నతిని పొందారు. ప్రగాఢమైన సమాధి స్థితికి చేరుకునే వారు. వీరిని ప్రాపంచిక జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన బంధువుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకసారి బంధువులు శేషాద్రి స్వామిని గదిలో పెట్టి తాళం వేశారు. తరువాత తలుపులు తెరచి చూడగా, స్వామి కనిపించలేదు. వీరి దివ్యత్వాన్ని గ్రహించిన ఆ బంధువులు తమ ప్రయత్నాలను మానుకున్నారు.

అవసరమైనప్పుడల్లా తన లీలలను చూపిన శ్రీశేషాద్రి స్వామి దివ్యజీవితంలో ఎన్నో అమృత గుళికలున్నాయి. ఎవరైనా నూతన వస్త్రాలు తనకు సమర్పిస్తే స్వామి, వాటిని భిక్షకులకు ఇచ్చివేసి వారి చిరిగిన బట్టలను తాము ధరించేవారు. స్త్రీలను చూసి, “నా తల్లి" అని చెప్పి నమస్కరించేవారు. నిద్రపోయే వారిని చూసి "నిద్రపోవద్దు. యముడు పట్టుకుపోతాడు" అనేవారు. అంటే జ్ఞానదృష్టితో మెలకువగా ఉండమని అర్థం. ఒకేసారి పలుచోట్ల దర్శనమివ్వడం, వందల సంఖ్యలో ఆకాశంలో గరుడ పక్షులను చూపడం చేసేవారు.

శేషాద్రి స్వామి పిచ్చివారిలా నటించేవారు. దుకాణంలోకి వెళ్ళి అక్కడి గల్లాపెట్టెలోని చిల్లర విసిరివేస్తే ఆ దుకాణ దారుకి మరింత లాభం వచ్చేది. కన్యలను తాకి ఆశీర్వదిస్తే వివాహమయ్యేది. వీరు ఎవరితోనైనా మాట్లాడినా, తిట్టినా, కొట్టినా వారికి ప్రయోజనాలు ఒనగూడేవి. పశుపక్ష్యాదులపై సైతం తన కరుణను ప్రసరించారు. “మనందరమూ ఒకనాడు వెళ్ళిపోవలసినవారమే... మనకు ఒక్క వస్తువు కూడా సొంతమైనది లేదు" అని స్పష్టం చేసేవారు. భక్తులకు ఆయన త్రిమూర్తులనూ, పార్వతీ దేవినీ చూపించారట. స్వయంగా వారే పరాశక్తిగా దర్శనమిచ్చారట. 


                                             *నిశ్శబ్ద.