ఇచ్చిన మాట కోసం అర్జునుడు చేసిన సాహసం ఎలాంటిదంటే!!

 

ఇచ్చిన మాట కోసం అర్జునుడు చేసిన సాహసం ఎలాంటిదంటే!!

ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గర వున్న సమయంలో ఒక విప్రుడు పుట్టిన వెంటనే చనిపోయిన తన కుమారుడ్ని తీసుకువచ్చి కోట గుమ్మం దగ్గర వుంచి పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు అది చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఆ విపరీతానికి కారణమేమిటని అడిగాడు. 'అయ్యా! బ్రహ్మద్వేషీ, శరుడూ, లుబ్ధుడూ, దుశ్శీలుడూ, దుర్బలుడూ అయిన రాజు పాలనలో వున్నవారు నిరుపేదలూ నిత్యదుఃఖితులూ అవుతారు. ఇప్పుడు నేను కూడా ఆ పరిస్థితిలోనే వున్నాను' అన్నాడు విప్రుడు. అర్జునుడు ఆయనను ఊరడించి 'ఈసారి నీకు పుట్టే పిల్లవాడ్ని నేను రక్షించి తీరుతాను. అలా చేయలేని పక్షంలో నేను అగ్నిప్రవేశం చేస్తాను' అని శపథం చేశాడు.

అర్జునుడి పలుకులు ఆ బ్రాహ్మణునికి ఆశ్చర్యం కలిగించాయి.

'నాయనా! అరివీర పరాక్రమ సంపన్నులైన బలరామకృష్ణులూ, యోధుడైన ప్రద్యుమ్నుడూ, అతని పుత్రుడయిన అనిరుద్ధుడూ చెయ్యలేని పనిని నువ్వెలా చేయగలవు? అయినా ఇంతకీ నువ్వెవరవు?" అని అడిగాడు.

'నేను ధర్మరాజు సోదరుడ్ని. పాండవ మధ్యముడ్ని, గాండీవధారిని, వాసుదేవుడికి మేనత్తకొడుకును! నన్ను పార్థుడని కూడా పిలుస్తారు' అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాలక్రమాన బ్రాహ్మణుని భార్య గర్భవతి అయింది. ప్రసవించే సమయం కూడా వచ్చింది. బ్రాహ్మణుడు వెళ్ళి అర్జునుడికి ఆ సంగతి తెలియజేశాడు. వెంటనే విజయుడు గాండీవసహితంగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన దివ్యాస్త్రాలతో ప్రసూతిగృహాన్ని అన్ని దిక్కులా బంధించాడు. పురిటింటిని ఒక శరపంజరం మాదిరి చేశాడు. అది చూసిన విప్రుడు కూడా ఇంక తన ఇంట్లోకి మృత్యువు ప్రవేశించడం అసంభవమనుకున్నాడు. కానీ అంతలోనే పుట్టిన పిల్లవాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడన్న అరుపులు పురిటింట్లోంచి వినిపించాయి. అది విని గాండీవి అదిరిపడ్డాడు. విప్రుడు పార్థుడ్ని అనరాని మాటలన్నాడు. అర్జునుడి చెవులకు అవి ములుకులయినాయి. వెంటనే యోగవిద్య ద్వారా యుమపురికి వెళ్ళాడు. అక్కడ విప్రుడి కొడుకు కనిపించలేదు. దిక్పాలకుల పురాలన్నీ గాలించాడు. పిల్లవాడిజాడ తెలియలేదు. స్వర్గ పాతాళాలకు వెళ్ళి చూశాడు. అక్కడా లేడు.

ఇక లాభం లేదనుకుని బ్రాహ్మణుడికిచ్చిన మాట ప్రకారం కిరీటి అగ్ని ప్రవేశం చెయ్యబోయాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి 'ఆ కుర్రవాడ్ని నీకు నేను చూపిస్తాను' అని చెప్పి అర్జునుడు అగ్నిప్రవేశం చెయ్యకుండా వారించాడు. పార్ధుడ్ని తన దివ్యరథంమీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు.

రథం సప్తద్వీపాలు దాటింది. సప్తసముద్రాలనూ దాటింది. సప్తగిరులనూ అధిగమించింది. చివరికి చిక్కటి చీకటి సీమలోకి ప్రవేశించింది. అక్కడకి వెళ్ళేసరికి గుర్రాలకు దారి కనిపించలేదు. శ్రీకృష్ణుడు వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే తన చక్రాన్ని ముందుకు వదిలాడు. ఆ కాంతిలో రథం ముందుకు సాగింది. రథం వెళ్ళి వెళ్ళి ఒక మహా సముద్రంలోకి ప్రవేశించింది. ఆ జలరాశి మధ్యలో ఒక దివ్య భవనం వుంది. అక్కడ నీలమేఘచ్ఛాయలో, పూర్ణచంద్రునివంటి ముఖంతో, శంఖు, చక్ర, గదలతో, కౌస్తుభమణితో, వనమాలతో శ్రీమన్నారాయణుడు పండిత మునిజన సేవితుడై విరాజిల్లుతున్నాడు. కృష్ణార్జునులు ఆయనకు వినయంగా సమస్కరించారు.

శ్రీమన్నారాయణుడు వారిని చూసి మందహాసం చేశాడు. 'ధర్మరక్షణకు ధరణిపై నా అంశతో నరనారాయణులుగా అవతరించిన మీకు ఏ సహాయం కావాలో చెప్పండి - తక్షణమే చేస్తాను' అన్నాడు.

కృష్ణుడు వచ్చినపని చెప్పాడు.

శ్రీమన్నారాయణుడు విప్రుడి కొడుకులందరినీ శ్రీకృష్ణుడికి అప్పగించాడు. కృష్ణార్జునులు వాళ్ళను తీసుకువెళ్ళి విప్రుడికి అప్పగించారు. బ్రాహ్మణుడు సంతోషించి కృష్ణార్జునులకు కృతజ్ఞతగా అంజలి ఘటించాడు.  అర్జునుడు తను ఇచ్చిన మాటకోసం అగ్నిప్రవేశానికి కూడా వెనుకాడలేదు. 


                                      *నిశ్శబ్ద.