మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు నిలవడానికి గల ఓకే ఒక కారణం ఇదే..
మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు నిలవడానికి గల ఓకే ఒక కారణం ఇదే..
కురుక్షేత్రంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టాడు. ఈ విషయం తెలిసిన అశ్వత్థామ దుర్యోధనుడికి ఇష్టమైన పని ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పాండవుల శిబిరంలోకి ప్రవేశించి, నిద్రపోతున్న ద్రౌపది కుమారులందరి తలలూ నరికి తీసుకువెళ్ళి దుర్యోధనుడికి ఆత్మకు సమర్పించాడు. ఐదుగురు కుమారులూ ఒక్కసారే మరణించడంతో ద్రౌపది దారుణంగా బాధపడింది. ద్రౌపది దుఃఖాన్ని చూడలేని అర్జునుడు అశ్వత్థామ మీదకి వెళ్ళాడు.
తన మీదకి వస్తున్న అర్జునుడిని చూసి అశ్వత్థామ భయంతో వణికిపోతూ, గుర్రాలకి ఓపిక ఉన్నంతసేపూ అర్జునుడికి అందకుండా రథం మీదే పరుగులు తీశాడు. చివరికి ఏమీ చెయ్యలేక, పారిపోలేక, ఆపడం ఎలాగో తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. గొప్ప అగ్ని జ్వాలలను విరజిమ్ముతూ వస్తున్న అస్త్రాన్ని చూసి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు "దుర్మార్గుడైన ఆ అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం కూడా తెలీదు. కాబట్టి అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి నువ్వు మళ్ళి బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించి ఉపసంహరించు" అని అర్జునునికి ఆదేశించాడు కృష్ణుడు.
శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరింపచేశాడు. తరువాత పారిపోతున్న అశ్వత్థామను తరిమి తరిమి పట్టుకుని కట్టి, శిబిరానికి ఈడ్చుకు వచ్చి, అందరిముందు చంపే ప్రయత్నం చేశాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు “అర్జునా! వీడు నిద్రపోతున్న వారిని చంపడం తప్పే. తన జోలికి రానివాళ్ళనీ, నిద్రపోతున్న పసివారిని చంపిన క్రూరుడే వీడు. కానీ 'భయపడే వాడినీ, దిగులుతో మతిపోయిన వాడినీ, ఓడిపోయిన వాడినీ, సాధువై జడత్వంతో తిరిగేవాడినీ, రక్షించమని మొరపెట్టుకునే వాడినీ, స్త్రీలనూ చంపకూడదు'. క్రూరత్వంతో ఇతరులను చంపేసి తన ప్రాణాలను రక్షించుకోవాలనుకునే వాడు నరకానికి వెళ్ళి అక్కడ దుఃఖాలను అనుభవిస్తాడు. రాజదండన తప్పించుకుని యమదండానికి గురి అవుతాడు. కనుక వీడిని ఆ యుముడికే వదిలెయ్యి" అంటూ అర్జునుడి కోపాన్ని తగ్గించేశాడు.
అప్పుడే ఎంతటి తప్పు చేసినా బ్రాహ్మణుని చంపకూడదన్న ధర్మం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి. వెంటనే అశ్వత్థామను ద్రౌపది ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. అశ్వత్థామ సిగ్గుతో ద్రౌపది ముఖం చూడలేకపోయాడు. ముఖం పక్కకు తిప్పుకుని, తలవంచుకుని నిలబడ్డాడు. అతడిని చూసి ద్రౌపది గురుపుత్రుడైన అశ్వత్థామకు నమస్కరించి "కుమారుని రూపంలో ఉన్న ఆచార్యుడివై ఉండి కూడా ఏమాత్రం దయలేకుండా మీ తండ్రి దగ్గర చదువుకున్న వారినే చంపేశావు. గురువు శిష్యులను చంపడం ధర్మమేనా? ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పిల్లలను చంపడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? పుత్ర శోకంతో గుండెలు పగిలిపోతున్న నాలాగానే నీ తల్లి కూడా అర్జునుడికి బంధీవైన నిన్ను గురించి గుండెలు పగిలేలా విలపిస్తుంటుంది. కనుక నాకు కలిగించినట్లుగా నీ తల్లికి కూడా గర్భశోకం కలగకుండా చూడాలి” అని కృష్ణార్జునులతో అశ్వత్థామను వదలిపెట్టమని చెప్పింది. ఒక్క భీముడు తప్ప మిగిలిన వారంతా ద్రౌపది మాటలను అంగీకరించారు.
భీముడు అశ్వత్థామ మీదకి విజృంభించాడు. ఒక్క గుద్దుతో వీడి తలను వెయ్యి ముక్కలు చేస్తానన్నాడు. ద్రౌపది అడ్డుపడింది. అయినా భీముడు ఆగలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నాలుగు చేతులలోని రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు త్రోసి, రెండు చేతులతో భీముడిని ఆపాడు. "భీమసేనా! నువ్వు అన్నట్లే చెయ్యాలి వీడిని. నిజంగానే వీడిని వదిలిపెట్టకూడదు. కానీ వీడు ఎంత నీచుడైనా బ్రాహ్మణుడై పుట్టాడుగా! 'బ్రాహ్మణో నహంతవ్యః' బ్రాహ్మణుని చంపకూడదు అని వేదం ఘోషిస్తోంది కదా! కాబట్టి నువ్వు శాంతించి, ఈ అశ్వత్థామను వదిలిపెట్టు" అన్నాడు. అర్జునుడితో "ద్రౌపదికీ, నాకూ, భీముడికీ కూడా నచ్చే విధంగానూ, ఇంతకు ముందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరే విధంగానూ చెయ్యి" అని ఆదేశించాడు. వెంటనే అర్జునుడు అశ్వత్థామపై కత్తి దూసి, అతడి వెంట్రుకలను నరికి వాటిలోని ఉన్న ముడిని తీసుకుని, 'పోరా పో' అని శిబిరంలో నుంచి బయటకు గెంటేశాడు. ఇలా మహాభారతంలో అశ్వత్థామ ప్రాణాలు కేవలం బ్రాహ్మణుడనే కారణంతో నిలబడ్డాయి.
*నిశ్శబ్ద.