శుభ్రత గురించి మనుశాస్త్రం ఏమి చెప్పింది?

 

శుభ్రత గురించి మనుశాస్త్రం ఏమి చెప్పింది?

భారతీయ ధర్మంలో ఆధ్యాత్మికత, ఆలోచన, గొప్ప అంతరార్థం కలిగి ఉంటాయి. ఇవి చెప్పే విషయాలు మనిషి జీవితానికి ఎంతో ముఖ్యమైనవి అయినా ప్రజలు ఒకానొక మూర్ఖత్వంలో నిండిపోయి జీవన విధానాన్ని మార్చుకుని సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడు.

మనుశాస్త్రం అనేది అందరికీ తెలిసినదే. దాన్ని ఒకానొక మూర్ఖత్వ, అనాగరిక శాస్త్రంగా పరిగణించి విమర్శిస్తూ ఉంటారు చాలామంది. అయితే శరీరాన్ని కడుక్కునేటప్పుడు నీటిని విరివిగా వాడాలి అంటుంది మనుశాస్త్రం. పేపర్ నాప్కిన్లు వాడటం ఆధునికం అయింది. వాళ్ళ దేశంలో నీళ్ళు సరిగ్గా ఉండవు, చలికి నీటిని తాకటం కష్టం కాబట్టి నీటి బదులు పేపర్లు వాడి అనారోగ్యాలు తెచ్చుకుంటారు. కానీ ఆధునికం పేరిట మనం ఉన్న నీటిని వదులుకొని పేపర్లు వాడి శౌచాన్ని వదలి శోకం పాలవుతున్నాం. అంటే వాడు లేక పేదవాడైతే మనం అన్నీ ఉన్నా బీదవాళ్ళం అవుతున్నామన్నమాట.

విశ్వనాథ సత్యనారాయణ 'హాహా హూహూ' అని ఓ నవలిక రాశారు. దాంట్లో లండన్లో హఠాత్తుగా ఓ వింత జీవి ప్రత్యక్షమౌతుంది. దానికి పళ్ళు, ఫలహారాలు ఏం పెట్టినా తినదు. అది నెత్తి మీద నీళ్ళు పోసుకున్నట్టు సైగ చేస్తుంది. చివరికి అక్కడ ఉన్న హిందూ దేశస్థుడు 'అది స్నానం చేస్తుందేమో' అంటాడు. అప్పుడు దాని మీద నీళ్ళు పోస్తే, అది ఒళ్లు తుడుచుకుని ఉత్తరీయం కట్టుకుని, ధ్యానం చేసి, చెంబులో నీళ్ళు తీసుకుని పళ్ల మీద నీళ్ళు చల్లి భగవంతుడిని ధ్యానించి, పళ్ళు తింటుంది. పాశ్చాత్యులకు, మనకూ 'శౌచం' విషయంలో ఉన్న తేడాను వ్యంగ్యంగా చూపిస్తుందీ ఘటన.

అందుకే మన ధర్మశాస్త్రాల్లో ఉదయం లేవగానే కాలకృత్యాలు, స్నానం, ధ్యానం, ఇలా విధులను క్రమపద్ధతి ప్రకారం నిర్వచించారు. కానీ బెడ్ కాఫీ, స్నానం చేయకుండా తినేయటం వంటివి నియమోల్లంఘనలే ఆధునికం అన్న అభిప్రాయం నెలకొనటంతో, ఎవరూ 'ఛాందసుడు అన్న ముద్ర పడకూడదని అంతా ఆధునికం అయిపోతున్నారు. ఎవరైనా 'శుచీ, శుభ్రత' అంటే పనికిరానివాడని ఈసడించి కాలరెగరేస్తాం. అందుకే మనుశాస్త్రంలో గురువు విద్య నేర్పే ముందు విద్యార్థికి 'శౌచం' నేర్పాలని స్పష్టంగా ఉంది.

'ఉపనీయ గురుశ్శిష్యం శిక్షయేచ్ఛాచమాదితః'

'ఉపనయనం తరువాత, ముందు శౌచం నేర్పించాలి.' వ్యక్తి నిర్మల మనస్కుడై ఆహారాన్ని ధ్యానించి భుజించాలని, మధ్యమధ్యలో  భుజించరాదని, మితిమీరి తినకూడదని, ఎంగిలి అన్నం ఎవరికీ పెట్టకూడదని, ఎంగిలి చేత్తో ఎక్కడికీ పోరాదని, అతిభోజనం అనారోగ్యం, ఆయుక్షీణం, అపుణ్యం, అస్వర్గ్యం, లోకనిందా పాత్రమని స్పష్టంగా మనుస్మృతి ప్రకటిస్తుంది.

ఒక రకంగా చూస్తే ఆధునిక వైద్యులు, విజ్ఞానవంతులు, మేధావులు అంతా ఇవే చెప్తున్నారు. డైటింగ్ చేయించే డాక్టర్లు ఇదే చెప్తున్నారు. వాళ్లు చెప్తే పనికి వచ్చేది మనువు చెప్తే పనికి రాకుండా పోవటం, మన సమాజంలో మంచి చెప్పే వాటి పట్ల ఉన్న చులకనను స్పష్టం చేస్తుంది. ఎందుకంటే డాక్టర్లు, మేధావులు అంతా చేతులు కాలిన తరువాత ఆకులను పట్టుకోమని చెప్తున్నారు. అనారోగ్యం పాలైన తరువాత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు. అందుకని వాళ్ళ మాటలు బాగా అర్థమౌతాయి. ఏదైనా చేజారిన తరువాతి దాని విలువ తెలుస్తుంది కదా!

                                           ◆నిశ్శబ్ద.