త్రికరణ శుద్ది అంటే??
త్రికరణ శుద్ది అంటే??
ఉద్ధరేదాత్మనా౨౨ త్మానం నాత్మానమవసాదయేత్|
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః॥
ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తనకు తాను అధోగతిపాలు కాకూడదు. ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు.
మూడుముక్కలలో చెప్పినా ముఖ్యమైన విషయం చెప్పాడు పరమాత్మ. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరూ వచ్చి ఉద్ధరించరు. స్వామీజీలు, బాబాలు మార్గం చూపిస్తారు. కానీ, ఎవరూ మిమ్మల్ని ఉద్దరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు. మీకు మీరే మిత్రుడు. మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవడానికి మీరే కారణము కాని ఎవరో కాదు. అన్న పరమ సత్యాన్ని బోధించాడు పరమాత్మ.
ఈ లోకంలో ప్రతి వాడుకూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకోవాలి. ప్రతి వాడు కూడా తనను తాను ఉద్ధరించుకోడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు. మంచి మార్గము చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సింది మానవుడే. కృషితో నాస్తి దుర్భిక్షమ్ అని అన్నారు. నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు, ఏమీ చదవకుండా, స్వామీ నన్ను పాస్ చెయ్యి అని రోజూ శివాలయం వెళ్లినా, సాయిబాబాకు మొక్కినా, ఏమీ ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు పరమాత్మ. మనకు ఉన్న దుఃఖములు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణచక్రము నుండి తప్పుకోవాలన్నా, ముందు మన కృషి, ప్రయత్నము ఉండాలి.
"నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా....ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం ఏ చేసి లాభం లేదు...... అంతా దేవుడి దయ ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది...... శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదు" ఇటువంటి శుష్కవేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండటం, ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే, భగవంతుడు మనకు తన వంతు సాయం అందిస్తాడు.
ఈ సముద్రం దాటడం నావల్లకాదని హనుమంతుడు చేతులు ముడుచుకొని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యం అయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగమును అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహము, తృప్తి, నిష్కామకర్మ మొదలగు వాటి వలననే అది సాధ్యం అవుతుంది. పూర్వకాలములో ఋషులు ఎన్నో కష్టములకు ఓర్చుకొని తపస్సులు చేసారు. సాధన చేసారు. ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సాధించారు. తుదకు సిద్ధి పొందారు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు.
గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు. ఆచరించ వలసిన ధర్మం శిష్యునిది. ఎవరికి ఆకలి అయితే వారే తినాలి, ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి. మనలను మనం సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనసులో అనుకున్నది మాట్లాడటం, మాట్లాడింది ఆచరించడం. ఒకటి అనుకొని, మరొకటి మాట్లాడుతూ, మరొకటి చేస్తుంటే దానిని ఉద్దరించుకోవడం అనరు. దిగజారడం అంటారు. కాబట్టి ముందు మనలను మనం ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనో బుద్ధి ఇంద్రియాలను సమన్వయపరచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, సమన్వయం పాటిస్తున్నాయో లేదో అని అనునిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి.
ఈ పరీక్షలు ఎవరో వచ్చి చేయరు. మనకు మనమే చేసుకోవాలి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి. బుద్ధితో మనసును, మనసుతో ఇంద్రియాలను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి. ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తుండాలి. అంతే కానీ మనలో ఉన్న మనో, బుద్ధి, ఇంద్రియాలను సోమరులుగా చేసి పనికిరాని వాటిగా చేయవద్దు. బుద్ధి పని చేయకుండా మనసు పనిచేయడం, బుద్ధి మనసుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడం, ఇలా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా, దేని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తే అవి తప్పుదారిపడతాయి. మానవుని అధోగతి పాలు చేస్తాయి.
మరొక విషయం. ఎవరికి వారే మిత్రులు ఎవరికి వారే శత్రువులు, తనకు తానే మిత్రుడు అయి తనను తాను ఉద్ధరించుకోవాలి. పరిశుద్ధమైన మనసే తన మిత్రుడు. కల్మషమైన మనసు తన శత్రువు అని అనుకోవాలి. ప్రతి వాడికీ మనసు ఉంటుంది. అది రెండుగా పని చేస్తుంది. ఒకటి మంచి గానూ మరొకటి చెడ్డగానూ, ఇది ప్రతివాడిలో ఉంటుంది. వాటి మధ్య అనునిత్యం జరిగే సంఘర్షణే మహాభారతయుద్ధం. కాబట్టి మంచి చెడుల కలయికే మనస్సు. మంచి మనసు మనకు మిత్రుడయితే, చెడ్డ మనసు మనకు శత్రువు. ప్రతివాడూ తనలోని చెడును జయించి మనసును మంచి మార్గంలోకి మళ్లించాలి. శత్రువును జయించి మిత్రుడుగా చేసుకోవాలి. ఈ పని చేస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అలా కాకుండా మనసును కల్మషాలతో నింపుకుంటే తన మనసే తనకు శత్రువుగా మారి, అతనిని అధోగతి పాలు చేస్తుంది.
◆వెంకటేష్ పువ్వాడ.