యాగం కంటే ఏకాదశి ఉపవాసం చాలా గొప్పదంటారు ఎందుకంటే..!
యాగం కంటే ఏకాదశి ఉపవాసం చాలా గొప్పదంటారు ఎందుకంటే..!
హిందూ మతంలో అన్ని ఉపవాసాలలోకి ఏకాదశి ఉపవాసం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి ఉపవాసం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ ఉపవాసాన్ని స్వచ్చమైన హృదయంతో ఆచరించే వారు తమ పాపాలన్నింటినీ వదిలించుకుంటారని నమ్ముతారు. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి ఈ ప్రపంచంలోని అన్ని సుఖాలను అనుభవిస్తాడని, మరణం తరువాత వైకుంఠ ప్రాప్తి పొందుతాడని అంటారు.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి ఒకటైతే, కృష్ణపక్ష ఏకాదశి రెండవది. ఏడాది పొడవునా 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏడాది మొత్తంలో వచ్చే ఏకాదశుల అన్ని రోజులలో ఉపవాసం ఉండటం వల్ల ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే యాగం చేసిన దాని కంటే ఎక్కువ ఫలితం వస్తుందని అంటారు. దీని గురించి తెలుసుకుంటే..
మహా విష్ణువుకు ప్రీతి..
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి విష్ణువుకు చాలా ప్రియమైనది. పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను యుధిష్ఠురుడికి వెల్లడించాడు. ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని ఇస్తుంది. అన్ని కోరికలను తీరుస్తుంది. అకాల మరణ భయం తొలగిపోతుంది. శత్రువులు నశిస్తారు. సంపద, శ్రేయస్సు, కీర్తి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఏకాదశి ఉపవాసం అన్ని ఉపవాసాలలోకి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం పాటించడం వల్ల జనన మరణ చక్రం నుండి మనిషి విముక్తి పొందుతాడని, మోక్షాన్ని పొందుతాడని చెబుతారు.
ఏకాదశి ఉపవాసం ఆచరించడం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. నమ్మకం, భక్తితో ఈ ఉపవాసం ఆచరించే వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఏడాది పొడవునా జరిగే ప్రతి ఏకాదశి ఉపవాసం వేర్వేరు ఫలితాలను కలిగి ఉంటుంది.
యాగం కంటే గొప్పది..
పురాణాల ప్రకారం ఏకాదశిని హరి వాసర అని పిలుస్తారు. అంటే విష్ణువుకు పూజలు చేసే రోజు అని అర్థం. ఏకాదశి ఉపవాసం యజ్ఞాలు, వేద ఆచారాల కంటే కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుందని పండితులు అంటున్నారు. ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం కారణంగా పూర్వీకులకు సంతృప్తి కలుగుతుంది. స్కంద పురాణం కూడా ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి.
పురాణాలు, స్మృతి గ్రంథాలలో..
హరివాసర ఏకాదశి, ద్వాదశి ఉపవాసాలు పాటించకుండా తపస్సు, తీర్థయాత్ర లేదా మరే ఇతర పుణ్యకార్యాలు ఎన్ని చేసినా మోక్షం లభించదని స్కంద పురాణం చెబుతోంది. ఏకాదశి ఉపవాసం ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండా ఆచరించినా, తెలిసి లేదా తెలియకుండా ఆచరించినా పాపాలన్నీ తొలగిపోతాయట. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటారని చెబుతారు.
కాత్యాయన స్మృతి ప్రకారం ఎనిమిది నుండి ఎనభై సంవత్సరాల వయస్సు గల స్త్రీపురుషులందరూ, లింగ భేదం లేకుండా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి అన్ని పాపాలు, దోషాలను నివారించడానికి 24 ఏకాదశుల పేర్లు, వాటి ప్రాముఖ్యతను కూడా వివరించాడు.
పురాతన కాలం నుండి వేద సంస్కృతిలో యోగులు, ఋషులు ఇంద్రియ కార్యకలాపాలను భౌతికవాదం నుండి దైవత్వంగా మార్చడం ఎందుకు ముఖ్యమో, దాని ప్రాధాన్యత ఏమిటో వివరించారు. ఏకాదశి ఉపవాసం అలాంటి ప్రాధాన్యత కలిగినదే. నిజమైన ఏకాదశి అంటే పది ఇంద్రియాలను, మనస్సును ప్రాపంచిక విషయాల నుండి దేవుని వైపు మళ్లించడం. మన పది ఇంద్రియాలను, ఒక మనస్సును నియంత్రించుకోవడం. కామం, కోపం, దురాశ మొదలైన ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి ప్రవేశించకుండా చూడటం. ఏకాదశి అనేది ఒక రకమైన తపస్సు, భగవంతుడిని గ్రహించి, భగవంతుడిని సంతోషపెట్టడానికి మాత్రమే ఆచరించాలి.
*రూపశ్రీ.