దుఃఖం లేని ఆనందం సాధ్యమేనా??

 

దుఃఖం లేని ఆనందం సాధ్యమేనా??


1.ప్రతి సుఖం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. 

2. సుఖము కానీ దుఃఖము కానీ శాశ్వతములు కావు, వస్తూ పోతూ ఉంటాయి.

కాబట్టి వీటి కోసం ఆరాట పడటం మంచిది కాదు. ఆత్మసుఖము శాశ్వతము, ఎన్నటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీది కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం శాశ్వతము. విషయ వాంఛలు, ప్రాపంచిక సుఖములు, చిన్ని దీపం అయితే ఆత్మ సుఖము సూర్యుని వెలుగు లాంటిది. కాని దీపము వద్దకు పురుగు చేరినట్టు మానవులు దీపం దగ్గరకు చేరి మాడి పోతున్నారు. ఇదే అజ్ఞానము. అందుకే జ్ఞానులు, తెలివిగలవారు, సూర్యరశ్మిని ఆశ్రయించి వేడిని, వెలుగును, ఆరోగ్యమును పొందుతున్నారు. కాబట్టి జ్ఞానికి ప్రాపంచిక విషయములలోనూ, విషయ వాంఛలయందు రక్తి, అనురక్తి ఉండకూడదు (విరక్తి ఉండాలి) అని బోధిస్తుంటారు.

 ధనం, పదవి, ఆస్తి, విద్య, అధికారము ఉండవచ్చు. కానీ విషయ వాంఛల వెంట పరుగెడితే అనర్ధం చుట్టుకుంటుంది. ఉదాహరణకు అత్యంత ఉన్నత స్థానము అధిరోహించిన ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, అవినీతి కుంభకోణాలలోనూ, లైంగిక వేధింపుల కేసులలో ఇరుక్కోవడం ఏమిటి. వారి చదువు, హెూదా, పదవి, సంపద, జ్ఞానము ఏమయ్యాయి. వారు కూడా దీపం దగ్గర చేరిన పురుగులే కదా. ఆలోచించండి.

సం స్పర్శ అంటే బాగా తాకడం అని మామూలు అర్థం. బయట ప్రపంచంలో ఎన్నో శబ్దాలు, దృశ్యాలు, రుచులు, తాకితో సుఖం కలిగించేవి, తాకితే ఒళ్లు పులకరించేవి, చక్కని సువాసనలు, ఎన్నోఉన్నాయి. ఇవి అన్నీ కూడా బయట ఉంటే ప్రయోజనం లేదు. మన జ్ఞానేంద్రియములు వాటిని తాకాలి. వాటితో సంయోగం చెందాలి. అప్పుడే వాటి వలన కలిగే సుఖదుఃఖాలు మనము అనుభవించగలము. అటువంటి స్వర్శవలన, సంయోగమువలన మొదట్లో కొంత సుఖం కలిగిగినా, సాధారణంగా దు:ఖము కలుగుతుంటుంది. అందుకే దుఃఖయోనయ అని అన్నారు. అంటే ఈ స్పర్శలు, సంయోగములు అన్నీ దుఃఖములను కలిగించేవే. మొదట్లో కొంత సుఖం కలిగినా, చివరకు అన్నీ దుఃఖంతో అంతం అవుతాయి.

మొదట్లో చక్కెరతో చేసిన మిఠాయి తియ్యగా ఉంటుంది. అతిగా తింటే వెగటు పుడుతుంది. తినగ తినగ గారెలు చేదు అనే సామెత ఉంది కదా! మరి ఇవి ఎందుకు నిరంతరం ఆనందాన్ని ఇవ్వవు అంటే ఇవి ఆద్యనవన్త: అంటే వీటికి మొదలు, ఆఖరు అనేవి ఉన్నాయి. కొన్ని వస్తువులు, కొందరు మనుషులు, ధనం, బంగారం, ఆస్తి మన దగ్గరకు వస్తే సుఖంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. అవి పోతే అంతులేని దుఃఖం. రావడం, పోవడం వాటి లక్షణం కాబట్టి, అవి వచ్చినప్పుడు సుఖం, పోయినపుడు దుఃఖం తప్పదు. ఒకే విషయం, ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి దు:ఖం కలిగిస్తుంది. భార్య పక్క చుట్టాలు వస్తే, భార్యకు ఆనందం, మొగుడు మొహం మొటమొట లాడుతుంది. అదే భర్త పక్క వారు వస్తే భార్య ముఖం ముడుచుకుంటుంది భర్త ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. కాబట్టి మనకు శాశ్వతమైన ఆనందం ఏదీ ఇవ్వలేదు. 

రెండవ మెట్టు ప్రాపంచిక విషయాలను, విషయ వాంఛలను పూర్తిగా వదిలిపెట్టాలి. మనసులో కూడా వాటి గురించి ఆలోచన, సంకల్ప వికల్పాలు కలుగ కూడదు. ఇది చాలా కష్టము. ఎవరికీ సాధ్యంకాదు. పైపైన వదిలిపెట్టామని అనుకున్నా, లోలోపల అయ్యో ఇవన్నీ అనుభవించలేక పోయామే అనే దిగులు, దుఃఖం, ఎదుటి వాడు అనుభవిస్తున్నాడే అనే అసూయ మనసును వేధిస్తుంటాయి. కాని, ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానికి రెండూ సాధ్యమే. కాబట్టి ముందు ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తరువాత పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అప్పుడు దుఃఖము లేని అనంతమైన ఆనందాన్ని పొందవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ.