శిష్టాచారము అంటే ఏమిటి??

 

శిష్టాచారము అంటే ఏమిటి??

ధర్మములకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహా ఋషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారాలను, వ్యవహారాలను, కర్మలను దర్శించి, అందులో మానవాళికి ఉపయుక్తమైన వాటిని, మానవులు ఆచరించవలసిన వాటిని, తమ బుద్ధిని జ్ఞానమును జోడించి, మనకు తెలియజేసారు. వేదములను ఋషులు దర్శించారు కానీ సృష్టించలేదు. అందుకే వారు వేద ద్రష్టలు, స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి వేదములు అంటే శృతులు మనకు మొదటి ప్రమాణము.

వేదములు మానవాళికి సులభంగా అర్థం అయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడా పొందుపరచబడి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవులకు జీవిత కాలం సరిపోదు. ఆ కారణం చేత మరి కొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసి, వాటిలో ఉన్న సారమును, ధర్మములను అన్నిటినీ ఒక చోట చేర్చి మనకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. సృృతులు మనకు రెండవ ప్రమాణము. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి మొదలగునవి. వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించవలసిన ధర్మములను, విధులను, కర్మలను వివరంగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు, తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే, స్మృతి తల్లి చెప్పినట్టు వివరంగా, చిన్న చిన్న కథలరూపంలో లాలించి, బుజ్జగించి, అర్థం అయ్యేటట్టు చెబుతుంది.

శృతులు కానీ, స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, అవి చదివినా అర్థం కాని వారికి, మూడవ ప్రమాణం శిష్టాచారం. అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనం ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చేసారో వాటిని ప్రమాణంగా స్వీకరించాలి. మానవులకు ఎక్కడెక్కడ దేని గురించి అయినా సందేహాలు వస్తే, వారి ఇష్టం వచ్చినట్టు చేయకుండా జ్ఞానులు అయిన పురోహితులు చెప్పినట్టు చేయడం మంచిది. 

పాండవులు ఒక అర్థరాత్రి పూట ఒక గంధర్వునితో తగాదా పెట్టుకున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. "అయ్యా! మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు కానీ మీరు ఒక పురోహితుని మీ ముందు ఉంచుకోండి. ఆయన మీకు తగినసమయంలో ధర్మబోధ చేస్తాడు. పురోహితుడు లేకుండా మీరు ఎక్కడకు వెళ్లవద్దు." అని చెప్పాడు. అప్పటి నుండి వారు ధౌమ్యుడిని తమ పురోహితునిగా పెట్టుకున్నారు.

కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వారి పురోహితులను, పెద్దలను, జ్ఞాసులను ఆశ్రయించాలి. వారి ఆచార వ్యవహారములను అనుసరించాలి. ఇదే మూడవ ప్రమాణము. ఈ మూడు ప్రమాణములలో ఆఖరిది అయిన శిష్టాచారమే సామాన్య మానవులకు, చాలా ప్రముఖమైనది, ఆచరించతగ్గది. ఎందుకంటే శ్రుతులు, స్మృతులు కేవలం బోధిస్తాయి. కాని శిష్టాచారము పెద్దలు ఏం చేస్తున్నారో చూచే అవకాశం కల్పిస్తుంది. అదే చూసి నేర్చుకోవడం. పెద్దవారు, బుద్ధిమంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మమార్గమునే అనుసరిస్తారు. వారిని చూసి వారి పిల్లలు కూడా అదే ధర్మమార్గమును అనుసరిస్తారు. అది వాళ్ల ఆచారంగా, ఒక ప్రమాణంగా తరతరాలకు సంక్రమిస్తుంది.

అందుకే మనుషులకు శిష్టాచారము ఎంతో మంచి మార్గం అయింది.

                                   ◆వెంకటేష్ పువ్వాడ.