దేవకీ వసుదేవులను కంసుడు బంధించడానికి కారణం నారదుడేనా..
దేవకీ వసుదేవులను కంసుడు బంధించడానికి కారణం నారదుడేనా..
భాగవతం అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం. అందులో కృష్ణుని జననం చాలా విచిత్రంగా ఉంటుంది. తన మేనమామ కంసుడిని వధించడానికి పుట్టే కృష్ణుడి జీవితం కంస వధకు ఒక ఎత్తు అయితే.. కంస వధ అనంతరం మరొక ఎత్తులా ఉంటుంది. అయితే కృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీవసుదేవులను కంసుడు చెరసాలలో బంధించడం వెనుక నారదుడి ప్రమేయం ఉందా??
నారదుడు చేసే ప్రతి పనీ లోకకల్యాణం కోసమే.. అనే విషయం పురాణాలలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. దేవకీనందనులను కంసుడు చెరసాల పాలు చేయడమనే విషయంలో కూడా ఇదే దాగుంది. విషయంలోకి వెళితే…
ఒకరోజు నారదమహర్షి తన అలవాటు ప్రకారం లోకాలన్ని తిరుగుతూ భూలోకంలో కంసుడు వద్దకు వచ్చాడు. నారదుడిని చూసి కంసుడు గౌరవంగా ఆహ్వానించి ఆసనం చూపించి కూర్చోబెట్టాడు. నారద మహర్షీ.. ఏమిటి లోకాలలో విశేషాలు అని అడిగాడు.
నారాదుడు కంసుడితో ఏముంటుంది కంసా… లోకాలలో ఎప్పుడూ ఉండేవే.. జరిగేవే… జరుగుతూ ఉన్నాయి. అది సురే కానీ.. నువ్వేమో రాక్షస రాజువు.. కానీ నీ చుట్టూ దైవ స్వరూపులు కొందరున్నారనే విషయం నువ్వు మరచిపోయావా?? అని అడిగాడు నారదుడు.
నా చుట్టూ దైవస్వరూపులు ఉన్నారా?? ఏమి మాట్లాడుతున్నావు నారద మహర్షీ.. అని అడిగాడు కంసుడు అయోమయంగా..
అయ్యో కంసా.. నువ్వు రాక్షస రాజువని నీకు ఎంతో తెలివి తేటలు ఉంటాయని, గొప్ప శక్తివంతుడవని అనుకున్నానే.. కానీ నీకు నీ చుట్టూ ఉన్న వాటి గురించి కూడా తెలియధే… అన్నాడు నారదుడు కంసుడిని దెప్పిపొడుస్తున్నట్టు.
రోషం వచ్చిన కంసుడు అసలు నువ్వేమి చెబుతున్నావో వివరంగా చెప్పవయ్యా… దేవతలను పరుగులు పెట్టించగలను నేను. అలాంటి నా చుట్టూ దైవస్వరూపులు ఉండటం ఏమిటి?? నన్నెదో చేయాలని కొత్త పథకం వేస్తున్నట్టున్నారే.. అన్నాడు కంసుడు.
"ఖచ్చితంగా పసిగట్టావు కంసా… నువ్వు నీ చుట్టూ ఉన్న నందుడు, ప్రజాపురంలో ఉన్న గోపికలు, గోపాలురు, వసుదేవుడు, దేవకీ, యాదవులు మొదలైన వారు అందరూ సాధారణ మనుషులే కదా అని అనుకుంటున్నావు. కానీ వాళ్ళందరూ మనుషుల రూపాల్లో పుట్టిన దైవ స్వరూపులు అనే విషయం నీకు తెలియకపోవడం నిజంగా విచారంగా ఉంది" అన్నాడు నారదుడు.
ఏమిటి నారదా నువ్వంటున్నది.. వాళ్ళు దైవ స్వరూపులు ఏంటి?? అని అడిగాడు కంసుడు విషయం వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో.
అవును కంసా… నేను చూపింది నిజం. వాళ్ళు మాత్రమే కాదు. నీ దగ్గరున్న సేవకులలో.. నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్లలో చాలామంది దేవతలే.. ఈ రూపంలో నీదగ్గర ఉన్నారు" అని అన్నాడు నారదుడు.
నారాదుడి మాటలు కంసుడికి అయోమయంగా తోచాయి.
నారదుడే మళ్లీ కంసుడితో.. భూదేవి రాక్షసుల బాధ భరించలేక తన బాధను అంతా ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పుకుంది. ఆ శ్రీ మహావిష్ణువు ఏమో రాక్షసులను వధించడానికి మళ్ళీ అవతరిస్తానని చెప్పాడు. అయినా కంసా.. నీకు నీ సంగతి తెలుసా?? నువ్వు నీ మొదటి జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి. ఆ తరువాత మళ్ళీ రాక్షస జన్మలు ఎత్తుతూ వస్తున్నావు. నిన్ను ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తి వదిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నిన్ను వధించడానికి దేవకీ గర్భంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడు" అని చెప్పాడు.
నారదుని మాటలు కంసుడికి సూదుల్లా గుచ్చుకున్నాయి. వెంటనే దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించాడు. యాదవ కులాన్ని సర్వనాశనం చెయ్యాలని అనుకుని అందరిపైనా యుద్ధం చేసాడు. కంసుడికి ఎదురు తిరిగినా వారి తలలు నరికేశాడు. ఎంతో మంది రాక్షస రాజులతో స్నేహం పెంచుకున్నాడు. కంసుడు బాధలు భరించలేక యాదవులు కురు, పాంచాల, కేకయ, సాల్వ, విదర్భ, నైషధ, విదేహ, కోసల రాజ్యాలకు వలస వెళ్లారు. ఇలా యాదవ వంశం విచ్చిన్నమవ్వడానికి, దేవకీ నందనులను కంసుడు బంధించడానికి నారదుడి మాటలే కారణమయ్యాయి.
◆నిశ్శబ్ద.