సమన్వయం అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
సమన్వయం అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ సర్వశక్తిసంపన్నులు. ముగ్గురూ ఒకరికొకరు తీసిపోరు. వారు ముగ్గురూ సమానులే. కానీ ముగ్గురూ తమ తమ అధికార పరిధులను స్పష్టంగా నిర్ణయించుకున్నారు. సృష్టి బ్రహ్మ పని. దాని బాగోగులు చూడటం విష్ణువు పని. లయమొందించటం శివుడిపని. దీంట్లో అవసరాన్ని బట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొనసాగుతున్నారు తప్ప, వారి నడుమ అహాలు లేవు. ఆరాటాలు, పోరాటాలు లేవు. విష్ణువు వైకుంఠంలో సకలభోగాల నడుమ శయనిస్తాడన్న అసూయ శివుడికి లేదు. శివుడు వెండి కొండల నడుమ పులిచర్మం ధరించి, జటాజూటాలతో ఉంటాడని విష్ణువుకు చిన్న చూపు లేదు. వీరికి 'బ్రహ్మ' పట్ల అంతు లేని గౌరవం. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అభిమానించుకుంటూ, ఒకరి శక్తిని మరొకరు గుర్తించి, సమన్వయం సాధించటం కనిపిస్తుంది. ఇది మనకు ఓ గొప్ప పాఠం నేర్పుతుంది.
ఒకరి పట్ల మరొకరు చూపించే ప్రేమ, అభిమానం, గౌరవం మొదలైన విషయాల మీదనే వారి మధ్య ఆరోగ్యకరమైన సత్సంబంధాలు కొనసాగుతాయి.
కానీ ప్రస్తుత కాలంలో మైత్రి కాని, శాంతి కానీ సమాన బలశాలుల నడుమ మాత్రమే సాధ్యమౌతుంది. ఎప్పుడైతే బలాబలాల నడుమ వ్యత్యాసముంటుందో అక్కడ స్నేహం ఉన్నా, శాంతి ఉన్నా అది శాశ్వతం కాదు. ఓ సారి ఓ ఎలుక పిల్లిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. దాంతో పిల్లి ఎలుకల నడుమ స్నేహం ఆరంభమైంది. ఈ రెంటిలో పిల్లి ఎలుక కన్నా శక్తిమంతురాలు కాబట్టి వారి స్నేహం సమానమైంది కాదు, శాశ్వతమైంది కాదు. పిల్లికి ఆకలి వేసినప్పుడో, ఆగ్రహం కలిగినప్పుడో, అది తన దగ్గరే నిశ్చింతగా ఉన్న ఎలుకను తినక తప్పదు. ప్రపంచంలో జరిగేదీ ఇదే.
బలవంతుడు, బలహీనుల మధ్యస్నేహం స్నేహం కాదు. అది బలవంతుడు, బలహీనుడి పట్ల చూపుతున్న దయ మాత్రమే. ఎప్పుడైతే ఇద్దరూ సమానశక్తి కలవారై ఉంటారో, అప్పుడు మాత్రమే వారి మధ్య స్నేహం నిలుస్తుంది. ఈ నిజాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 'సమన్వయం' నిరూపిస్తుంది. అవసరమైనప్పుడు ముగ్గురూ కలిసికట్టుగా సంఘటిత శక్తితో రాక్షసులను ఎదుర్కొన్నారు. లేనప్పుడు ఎవరి వ్యవహారాలు వారు చూసుకున్నారు.
ఇది అధికారులకే కాదు, దేశాలకు కూడా వర్తిస్తుంది. శక్తిమంతమైన దేశం, బలహీన దేశం వైపు స్నేహం కోసం చేయి చాస్తోందంటే అర్థం, ఆ స్నేహహస్తం వెనుక బలమైన దేశస్వార్థం ఏదో ఉందన్నమాటే. ఇది గ్రహించకుండా బలహీనమైన దేశం, అంత శక్తిమంతుడు తన స్నేహం కోసం అర్రులు చాస్తున్నాడని ఉబ్బితబ్బిబ్బ వుతుంది. గర్వపడుతుంది. ఆ తరువాత అనుభవిస్తుంది. గతచరిత్రనే కాదు, వర్తమానం కూడా ఈ నిజాన్ని నిరూపిస్తుంది. 'రాజనీతి'లో 'దౌత్యానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. తమ శక్తియుక్తులను, శత్రువు మనసును గ్రహించగలిగిన దూత మాత్రమే సరైన రీతిలో దౌత్యం నెరపగలడు. నాటి పురాణాలలోనూ, నేటి కాలంలోనూ రెండు విధాలా ఇది సరిగ్గా సరిపోయే అంశం.
◆నిశ్శబ్ద.