సుఖాలే కావాలి కష్టాలు వద్దు అని ప్రార్థిస్తున్నారా...

 

సుఖాలే కావాలి కష్టాలు వద్దు అని ప్రార్థిస్తున్నారా.. 


మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు - రెండూ అనివార్యం. కష్టసుఖాలు కావడి కుండలు అని అనడం అంటారు. ఈ రెండింటినీ తమ జీవిత కాలంలో అనుభవించని వారు ఎవరూ లేరు. ఏ మహాత్ముని జీవితం తరచిచూసినా, ఏ మహానాయకుని జీవన గమనాన్ని పరిశీలించినా కథ ఇంతే. జరుగుతున్న ప్రతి సంఘటనా ఆ సర్వేశ్వరుని సంకల్పమే అనీ, ఈ రోజు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదనీ, కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారుతూనే ఉంటాయనీ శాస్త్రాలు వివరిస్తూనే ఉన్నాయి. అయితే మహామహులు కూడా తడబడ్డ సంఘటనలు తెలుస్తూనే ఉన్నాయి. సర్వకాల సర్వావస్థలయందూ భగవంతుని సాన్నిహిత్యాన్నీ, స్మృతినీ విడువని వ్యక్తి జీవితం ధన్యమైనది.


మన శ్రేయోభిలాషులు ఎవరు? స్నేహితులు ఎవరు? హాని కలిగించేవారు ఎవరు? ఎవరితో ఎలా మెలగాలి? అన్న విషయాలపై మనకు అవగాహన కలిగించే కాలం కష్టాల కాలం. ప్రతి అణువులోనూ దివ్యత్వాన్ని దర్శించేందుకు అనువైన కాలం. అనునిత్యం దైవాన్ని స్మరించేందుకు అనుకూలమైన కాలం. ఆ భగవంతుని సాంగత్యాన్నీ, ప్రేమపూర్వకమైన ఓదార్పునూ అనుభవిస్తూ కన్నీటి వెల్లువలో సాంత్వన పొందే అమృత సదృశమైన సమయం. మనం పరివర్తన చెంది, పరిశుద్ధ జీవనం కొనసాగించడానికి అద్భుతమైన కాలం 'కష్టాల కాలం'. అందుకే కష్టాలకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. అవి మనల్ని దైవానికి దగ్గరగా తీసుకుని వెళతాయి.


ఇక మనం భయపడవలసిన కాలం ఏదంటే అదే  'సుఖాల కాలం'. అనుకోకుండా అన్నీ కలిసి వస్తుంటాయి. తిరిగి రావనుకున్న బకాయిలను ఇంటికి వచ్చి చెల్లిస్తారు. పిల్లలు, బంధువులు, స్నేహితులతో జీవితం సంబరంగా గడుస్తుంటుంది. హాయి... హాయిగా మన గురించి మనం ఆలోచించే సమయం లేకుండా చేస్తుంది. ఈ కలిసొచ్చే కాలం. పెద్దలు, అనుభవజ్ఞులు, శ్రేయోభిలాషుల మాటలు వినేందుకు అసలు సమయమే ఉండదు. ఇక దైవం సంగతి దేవునికే ఎరుక. ఆ భగవంతుని అవసరం అంతగా లేని కాలం అది. సుఖసంతోషాలతో పాటు ఆర్భాటాలూ, హైరానాలూ ఎక్కువ అవుతాయి. మానసిక, శారీరక అలసటతో జీవితాన్ని ఆదమరచి అనుభవిస్తాం. పూజలు, యాగాలు యాంత్రికంగా మారతాయి. ఏకాంతమే ఉండదు. ఇక భగవంతుణ్ణి స్మరించేందుకు సమయం ఎక్కడ? కష్టాల్లోనూ, సుఖాల్లోనూ భగవంతుణ్ణి సదా స్మరిస్తూ జీవితం గడిపే ఓ రామభక్తుని కథను  తెలుసుకుంటే..


ఒక ఊరిలో ఓ రామభక్తుడు ఉండేవాడు. అతడు వస్త్రాలు నేసి, బజారులో అమ్ముతుండేవాడు. వస్త్రాలను నేస్తున్నప్పుడూ, అమ్ముతున్నప్పుడూ అంతా 'రామేచ్ఛ' వల్ల జరుగుతుందని శ్రీరాముణ్ణి తలచుకుంటూ ఉండేవాడు. రోజంతా పనిచేసి రాత్రి ఇంటికి వచ్చిన తరువాత కూడా స్నానపానాదులను ముగించుకొని భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు. ఇలా భగవచ్చింతనలో రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. ఎప్పటిలాగే ఒక రోజు రాత్రి ఇంటి బయట కూర్చొని భగవన్నామ స్మరణ చేస్తున్నాడు. హఠాత్తుగా కొంత మంది దొంగలు వచ్చి తాము దొంగిలించిన ధనాన్ని మోయడానికి ఆ భక్తుణ్ణి తమతో లాక్కుపోయారు. అలా దొంగసొమ్ము మూటలు అతని నెత్తి మీద పెట్టి వెళుతుండగా రక్షకభటులు వెంబడించారు. వెంటనే ఆ దొంగలు తప్పించుకొని పారిపోయారు. కానీ భక్తుని వద్ద సొమ్ముల మూట ఉండడం వల్ల రక్షకభటులు అతణ్ణి నిర్బంధించారు. 


మరుసటిరోజు అతణ్ణి న్యాయస్థానానికి తీసుకు వెళ్ళారు. అతడు న్యాయాధిపతితో "నేను 'రామేచ్ఛ' వల్ల రాత్రి ఇంటి బయట కూర్చొని, భగవన్నామస్మరణ చేస్తున్నాను. 'రామేచ్ఛ' వల్ల దొంగలు వచ్చి, సొమ్ముల మూటను మోయమంటూ నన్ను లాక్కుపోయారు. 'రామేచ్ఛ' వల్ల రక్షకభటులను చూసి దొంగలు పారిపోయారు. ఇంతలో 'రామేచ్ఛ' వల్ల రక్షకభటులు వచ్చి నన్ను నిర్బంధించారు. నేనిప్పుడు 'రామేచ్చ' వల్ల మీ ముందు నిలబడ్డాను" అని చెప్పాడు. ఈ రామభక్తుడు చెప్పినదంతా విన్న న్యాయాధిపతి అతడు నిర్దోషి అని నిర్ధారణ చేసి, విడుదల చేయించాడు. ఆ రామభక్తుడి లాగే మనం కూడా సుఖాల్లోనూ, కష్టాల్లోనూ ఆ సర్వేశ్వరుణ్ణి సదా స్మరిస్తూ, ఆయన పట్ల శరణాగతి భావంతో ఉండగలిగితే మన జన్మ నిజంగా ధన్యమైనట్లే


                                           *నిశ్శబ్ధ.