తులసి వృక్షంగా ఎలా మారింది?
తులసి వృక్షంగా ఎలా మారింది?
ఒక రోజున నారద మహర్షి శంఖ చూడుడనే రాక్షస రాజు వద్దకు వచ్చి "రాక్షసరాజా! మహర్షులంతా శివునితో నువ్వు బాధలు పెడుతున్నావని, వాటినింక భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్దిరోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈ లోపుగా నువ్వే కైలాసం మీదికి దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు" అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షససేనలు కైలాసం వైపు కదలినాయి.
యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. దేవసేనాని కుమారస్వామి చిత్తై పోయాడు. కాళి అతన్ని ఏమీ చెయ్య లేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడుని దగ్గర కృష్ణ కవచముంది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదాన్ని బహూకరించాడు. అది దగ్గర ఉన్నంతవరకు అతడికి అపజయముండదు, ఇక అతని భార్య తులసి మహాపతివ్రత. కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. తరువాత అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు. అందుకని వ్యర్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడుని కవచం దానమడిగాడు. వచ్చినవాడు విష్ణువని, తనకు కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడుడు. ఆ కవచం ధరించి అచ్చు శంఖచూడునిలానే తయారయి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడుని తలతెగ నరికాడు శంకరుడు.
నిద్రా సమయంలోను, రతిక్రియ తరువాత మాయలు నిలవవు. విష్ణుమూర్తికి నిజ రూపం వచ్చేసింది. తులసి కోపం హద్దులు దాటి పోయింది. మోసంతో తన శీలాన్ని హరించి, తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ, శంఖచూడుని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలంలా పవిత్ర మవుతుంది. శంఖ ధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసముంటుంది.
తులసీ! నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీనది రూపంలో ప్రవహిస్తుంది. నువు పవిత్రమైన తులసి వృక్షానివౌతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమయిపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళం దానం చేస్తే వేయిగోవులు దానం చేసిన ఫలం వస్తుంది. మరణకాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే, ఆ జీవి పుణ్య లోకాలకు పోతాడు. నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి లక్ష ఆశ్వమేథాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరవ పరచినవాడు నరకానికి పోతాడు. నువు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామము.
సాలగ్రామాలు 1) లక్ష్మీనారాయణము, 2) లక్ష్మీ జనార్ధనము, 3) రఘునాథము, 4) వామనము, 5) శ్రీథరము, 7) దామోదరము, 7) రఘురామము 8) రాజ రాజేశ్వరము 9)అనంతము 10) మదుసూదనము 11)హయగ్రీవము 12) నారశింహము 13) లక్ష్మీ నృశింహము అని అనేక రకాలుగా ఉంటాయి.
వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖము, జలసీలను, పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు" అని అనేక వరాలిచ్చాడు. అప్పటినుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీనదిగా ప్రవహిస్తోంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు.
◆నిశ్శబ్ద.