విదురుడు ఎందుకంత గొప్పవాడిగా గుర్తించబడ్డాడు? ఆయన చెప్పిన నీతి ఏంటి..
మహాభారతలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఇందులోని ప్రతి పాత్ర నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఇందులో దర్శనమిచ్చే ఆదర్శపాత్ర విదురుడు. ధృతరాష్ట్రుడికీ, దుర్యోధనుడికీ అనేక నీతులు బోధించిన మంత్రి విదురుడు. ఈ నీతిని కౌరవులు పెడచెవిన పెట్టారు. పతనమయ్యారు. మంచి మాటలు విని, ఆకళింపు చేసుకొని, ఆచరిస్తే జీవితం ఫలవంతం అవుతుందన్నది అసలు నీతి. హస్తినాపుర చక్రవర్తి విచిత్రవీర్యుని భార్యలు అంబిక, అంబాలికలు. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే చనిపోతాడు. అప్పుడు విచిత్రవీర్యుడి తల్లి సత్యవతి - తన కోడళ్ళయిన అంబిక, అంబాలికలకు సంతానం ప్రసాదించమని వ్యాసుణ్ణి నియోగిస్తుంది.
వ్యాసుడి వేషం చూసి అంబిక కళ్ళు మూసేసుకొంటుంది. ఆ కారణంగా అంధుడు జన్మించాడు. అతనే ధృతరాష్ట్రుడు. ఇక అంబాలిక వ్యాసుణ్ణి చూసేసరికి పాలిపోయింది. అందుకే పాండురోగం ఉన్న పాండురాజు జన్మించాడు. ఇక అంబిక దాసికి, వ్యాసుడికి జన్మించినవాడు విదురుడు. వ్యాసుణ్ణి చూసి అంబిక, అంబాలికల్లా ఆ దాసి ఏ విధమైన రుగ్మతకూ లోనుకాలేదు కాబట్టి విదురుడు ఆరోగ్యంగా జన్మించాడు. అయినా ధృతరాష్ట్ర, పాండురాజుల్లా మహారాణి పుత్రుడు కాడు, దాసీతనయుడు అందుకే చక్రవర్తి కాలేకపోయాడు. అయితేనేం? మంత్రికాగలిగాడు. నీతికి నిలయం అయ్యాడు. అసలు నీతికి విదురుడు పర్యాయపదమయ్యాడు.
తిక్కన మహాభారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసంలో విదురనీతి ఉంది. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొన్నాక తమ అర్థరాజ్యం తమకు ఇవ్వమంటూ పాండవులు కౌరవుల్ని కోరతారు. కానీ కౌరవులు అధర్మబద్ధంగా ప్రవర్తిస్తారు. ఇంత జరిగాక కూడా కౌరవులు సంజయుణ్ణి పాండవుల వద్దకు రాయబారిగా పంపుతారు. పాండవుల వద్దకు వెళ్ళి సందేశం వినిపించి వెనక్కు వచ్చిన తర్వాత హస్తినాపురంలో ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు కలుస్తాడు. "మీరు చేస్తున్నది తప్పు, పాండవుల పక్షాన్నే ధర్మం ఉంది. ఓ ధృతరాష్ట్రా! మీరూ, మీ కొడుకులూ అధర్మవర్తనులు. అయినా మీ రాయబారిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను"అని నిజాన్ని నిర్భయంగా తెలిపాడు.
ఫలితంగా ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. మనసంతా కకావికలమైంది. తాము తప్పుచేస్తున్నామని తెలిసి, సంపద కోసం కన్న కొడుకులపై ప్రేమతో దోషాలకు పాల్పడడం హృదయాన్ని కలచి వేసింది. అందుకే కాస్త ఊరడింపు మాటలు చెబుతాడు కదా అని రాత్రికి రాత్రి విదురుణ్ణి తన వద్దకు రప్పించుకొంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ఆ రాత్రి పూట అసలు మనిషికి ఎందుకు నిదురపట్టదు, మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడు, మనిషి తన జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలంటే ఏం చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానంగా విదురుడు నీతివాక్యాలను వెల్లడించాడు. ఈయన చెప్పిన సమస్త నీతిని విదురనీతిగా పిలుస్తారు.
*నిశ్శబ్ద.