Read more!

స్త్రీ విషయంలో భారతీయులకు, విదేశీయులకు గల తేడా చెప్పిన స్వామి వివేకానందుడు!!

 

స్త్రీ విషయంలో భారతీయులకు, విదేశీయులకు గల తేడా చెప్పిన స్వామి వివేకానందుడు!!
 


భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ దేశాలకు విస్తరింపజేసిన ఘనత స్వామి వివేకానంద గారిదే. ఆయన భారతదేశంలో మహిళలకు, విదేశాల్లో మహిళలకు మధ్య వ్యత్యాసాన్ని ఈ కింది విధంగా తెలియజేశారు..

మహిళ అనగానే భారతీయుడి మనస్సులో స్ఫురించేది మాతృభావమే. భగవంతుణ్ణి సైతం భారతీయులు 'తల్లి' అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు బాల్యంలో ప్రతిరోజూ పొద్దున తల్లి వద్దకు ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళం. అందులో ఆమె తన కాలి బొటన వేలును ముంచేది. ఆ నీటిని మేము తాగేవాళ్ళం.

పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే భార్య. స్త్రీత్వం అక్కడ భార్యత్వంలో కేంద్రీకృతమై ఉంది. భారతదేశంలో సహజంగా అందరికీ స్త్రీత్వ ప్రభావం అంతా మాతృ భావంలో కేంద్రీకృతమై ఉంది.

నేను ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబుతున్నాను. దాన్ని బట్టి ఉభయ పక్షాలనూ మనం పోల్చి చూడవచ్చు. ఈ భేదాన్ని చూడండి… 

 "భారతీయ కుటుంబంలో గృహిణికి స్థానం ఏదీ?" అని పాశ్చాత్యులు అడుగుతారు. "అమెరికన్ కుటుంబంలో తల్లికి స్థానం ఏదీ?" అని భారతీయులు అడుగుతారు. తల్లి పరమ పూజ్యురాలు. నాకు ఈ శరీరాన్ని ప్రసాదించింది. నన్ను నవమాసాలూ తన గర్భంలో మోసింది. అవసరం అయితే నా కోసం తన ప్రాణాలనైనా ఇస్తుంది. నేనెంత దుర్మార్గుడినైనా, అపకారినైనా, నా మీద ఎడతెగని ప్రేమ గలది. అలాంటి తల్లి ఎక్కడ? విడాకుల కోసం చీటికీ మాటికీ న్యాయ స్థానాలకు వెళ్ళే భార్య ఎక్కడ? అమెరికా దేశస్థులారా! తల్లికే అగ్రస్థానం ఇచ్చే కుమారుణ్ణి మీ దేశంలో నేను చూడలేదు. మరి మేమో మరణకాలంలో సైతం భార్యకూ, బిడ్డకూ కూడా ఆ తల్లి స్థానాన్ని ఇవ్వం. తల్లి కన్నా ముందు చావవలసి వచ్చినప్పుడు సైతం ఆమె ఒడిలో ప్రాణాలను విడవాలనుకుంటాం.

 ఏదీ ఆ తల్లి? స్త్రీ అనే మాట భౌతిక శరీరంతో సంబంధపడిందేనా! శరీర సంబంధాన్ని ప్రధానీకరించే ఆదర్శాలంటే భారతీయుని మనస్సు భయపడుతుంది. ఓ మహిళా! నీ పేరుకూ, శారీరకాలైన చుట్టరికాలకూ ఎలాంటి సంబంధమూ ఉండరాదు. తల్లి అనే మాట నాటికీ నేటికీ పరమపూజ్యమైనది. వేరే ఏ మాట అలా దురాశలను తొలగించగలదు? దుష్కామాలను అణచగలదు? అమ్మకే అగ్రస్థానమిచ్చే సంస్కృతి భారతీయులది. అదే మన ఆదర్శం.

                                           *నిశ్శబ్ద.