కాలసర్పదోషం వెంటాడుతోందా.. ఈ పరిహారాలు పాటించండి..!
కాలసర్పదోషం వెంటాడుతోందా.. ఈ పరిహారాలు పాటించండి..!
జ్యోతిష్యం ప్రకారం మనిషి జీవితంలో ఇబ్బందులు, సమస్యలు ఏర్పడటానికి చాలా రకాల గ్రహాల ప్రభావాలు కారణం అని చెబుతారు. కొందరు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఎంత మంచి జీవనాన్ని సాగిస్తున్నా ఏవో ఒక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. మనిషి జీవితంలో ఉండే దోషాలలో కాలసర్ప దోషం కూడా ఒకటి. కాల సర్ప దోషం జీవితంలో ఊహించని సంఘటనలకు దారితీస్తుంది. కాలసర్ప దోషం నుండి ఉపశమనం పొందడానికి కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల ప్రభావాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంతకీ కాలసర్ప దోష ఉపశమనానికి ఏ పరిహారాలు పాటించాలి తెలుసుకుంటే..
నల్ల నువ్వులు..
ప్రతి సోమవారం నల్లనువ్వులను గంగా జ లంలో కలిపి ఆ జలంతో శివలింగ అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కాల సర్ప దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల జీవితంలో చాలా మంచి మార్పు కలుగుతుందని చెబుతున్నారు.
నాగపంచమి పరిహారం..
నాగపంచమి రోజు కాలసర్ప దోషం ఉన్నవారు పరిహారం పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతి గుడిలో నాగుల విగ్రహాలు ఉంటాయి. గుడికి వెళ్లి నాగుల విగ్రహాలను పూజించడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుందట. అయితే నాగులకు పూజ చేసేటప్పుడు మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు.
నదిలో..
వెండి లేదా రాగి లోహాలతో చిన్న పాముల జతలను చేయించి వాటిని పవిత్ర నదులలో వదిలిపెట్టాలి. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందట.
మహా మృత్యుంజయ మంత్రం..
కాలసర్ప దోషంతో ఇబ్బంది పడేవారు మహా మృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. అలాగే శివారాధన చేయాలి. ఇలా చేస్తే కొన్ని రోజులలోనే ఫలితాలు కనిపిస్తాయట.
రావిచెట్టుకు నీరు..
కాలసర్ప దోషం నుండి ఉపశమనం పొందాలని అనుకునేవారు శనివారం రోజు రావిచెట్టుకు నీరు పోసి, చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది.
నల్ల దుప్పటి..
కాలసర్ప దోషంతో ఇబ్బంది పడేవారు పేదలకు, అవసరంలో ఉన్నవారికి నల్లని దుప్పట్లు దానం చేయడం, ఉజ్జయిని లేదా నాసిక్ లోని శైవ ఆలయంలో కాలసర్ప దోష పూజ చేయించుకోవడం వల్ల కాలసర్ప దోషం నుండి త్వరగా ఉపశమనం పొందుతారట.
*రూపశ్రీ.