బీదరికానికి నిజమైన అర్థం ఏమిటి??
బీదరికానికి నిజమైన అర్థం ఏమిటి??
మానవుడు సంఘర్షణను తన దైనందిన జీవనంలో ఒక అంతర్భాగంగా అంగీకరించాడు. ఎందుకంటే, అతడు పోటీ మనోభావాన్ని, అసూయను, దురాశను, ఆక్రమణ శీలతను, సంచయం చేసుకునే ప్రవృత్తినీ జీవితంలో సహజమయిన విషయాలుగా ఆమోదిస్తున్నాడు. అటువంటి జీవన విధానాన్ని అంగీకరిస్తున్నాం అంటే సంఘాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిస్తున్నామన్నమాట. మర్యాద ముసుగులలో దోబూచులాడుతున్నా మన్నమాట. మనలో చాలమందిమి మర్యాదస్తులుగా వ్యవహరించాలని తపన పడుతున్నాం గనుక, మనం ఇందులో చిక్కుబడి పోతున్నాం.
మన మనుసులను హృదయాలను వెదికి చూసుకున్నప్పుడు, మన ఆలోచన సరణిని పరిశీలించినప్పుడు, దైనందిన జీవనంలో మన వర్తనం సమీక్షించుకున్నప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా తెలిసి వస్తుంది. సంఘం అనే చట్రానికి ఒదిగి పోయి వున్నంత వరకూ జీవితం రణక్షేత్రంగా రూపొందవలసిందే అని. దానికి ఒదిగి వుండకుండా, ఆమోదించకుండా వైదొలగినప్పుడు ఏ ధార్మికజీవీ అటువంటి సంఘాన్ని ఆమోదించలేదు. అప్పుడు మనం పూర్తిగా స్వేచ్ఛాజీవులం అవుతాము, సంఘం యొక్క మానసిక చట్రం నుంచి బయట పడుతాము.
సంఘంలోని అనేక వస్తువులతో మనం నిండిపోయి వున్నాం. సంఘం మనలో సృష్టించినదీ, మనం మనలో సృషించుకున్నదీ ఏమిటంటే… దురాశ, అసూయ, కోపము, అసహ్యం, ఈర్ష్య అదుర్గా వీటి అన్నిటితోనూ మనం మనల్ని నింపుకున్నాం. ప్రపంచంలోని అనేక మతాలు 'బీదరికం' అనేదానిని బోధించాయి. సన్యాసి ఏదో రంగువస్త్రం ధరిస్తాడు. పేరు మార్చుకుంటాడు. తల గొరిగించుకుంటారు, ఓ గుహలో ప్రవేశిస్తాడు. బీదరికం పవిత్రతలకు సంబంధించిన వాగ్దానాలు చేస్తాడు.
తూర్పుదేశాలలో అయితే అతను ఒకే బట్ట, ఒకే అంగవస్త్రం, ఒంటిపూట భోజనంతో వుంటాడు. మనం అటువంటి బీదరికాన్ని ఆదరిస్తాం కాని, ఈ బీదరికాన్ని ఆశ్రయించిన మనుషులు తమ అంతరంగంలో యింకా సంఘం తాలూకు వస్తువులపట్ల మక్కువతోనే వున్నారు. పరువు ప్రతిష్టలకోసం పాకులాడుతునే వున్నారు. ఈ సంస్థకో ఆ సంస్థకో చెంది వున్నారు. ఈ మతాన్నో ఆ మతాన్ని సమాశ్రయించుకు వున్నారు. సంస్కృతి సంప్రదాయాలలో యింకా శాఖోపశాఖలుగా చీలిపోయే వున్నారు. ఇది బీదరికం కాదు.
బీదరికం అంటే ప్రపంచం నుంచి సంఘం నుంచి పూర్తిగా స్వేచ్ఛగా వుండడం. మరిన్ని ఉడుపులు వున్నా, మరింత భోజన వసతి వున్నా మరేం ప్రమాదం లేదు. దురదృష్టవశాత్తు ఎక్కువ మంది మనుషులలో తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలనే తహతహ విపరీతంగా వున్నది.
మనసు సంఘ వ్యవస్థ నుంచి విముక్తి పొందినప్పుడు, బీదరికం అతి సుందరమయి రూపొందుతుంది. ఆంతరికంగా రావాలి ఈ బీదరికం. అప్పుడు వెంపర్లాట, అడగడం, కోరికలు ఇటువంటివి ఏమీ వుండవు. ఇలాంటి ఆంతరిక బీదతనమే ఎలాంటి సంఘర్షణ లేని జీవిత సత్యాన్ని ఆకళింపు చేసుకోగలుగుతుంది. అటువంటి జీవితం ఏ గుడులలోను, గోపురాలలోను దొరకనటువంటి మహత్తర కటాక్షం.
సంఘర్షణ యొక్క మూలస్థానం నుంచి, సంఘం యొక్క మానసిక వ్యవస్థ నుంచి బయట పడడం ఎలా సాధ్యం? సంఘర్షణ తాలూకు కొన్ని శాఖలను కొట్టివేసి చిగుళ్లు కత్తిరించి వేయడం అంతకష్టమైన పని కాదు. కాని, మనం ఆలోచిస్తున్నది పూర్తిగా అంతరంగ, బహిరంగ ప్రశాంతత తీసుకు రాగల స్థాయి ఎలా లభిస్తుందని. అంటే అర్థం ప్రాణచలనం లేకుండా పడివుంటామని కాదు అందుకు వ్యతిరేకంగా మనం బహుముఖంగా, జీవనసత్త్వంతో కూడి పరిపూర్ణ శక్తివంతులం అవుతాము.
◆నిశ్శబ్ద.