మనస్సుకు శిక్షణ ఇవ్వడం ఎందుకు అవసరం!

 

మనస్సుకు శిక్షణ ఇవ్వడం ఎందుకు అవసరం!

ఆధ్యాత్మిక స్వేచ్ఛను కోరుకునే వారికి మనస్సు పవిత్రమైనప్పుడు స్వేచ్ఛ అరచేతిలో పండులా అందుబాటులో ఉంటుంది. రజస్సు, తమస్సులు, కామ క్రోధ రూపంలో వ్యక్తమవుతాయి. వాటికి శిక్షణనిచ్చి సత్త్వంలోకి తీసుకురావాలి. అయితే ఎవరికి వారే ఈ శిక్షణను ఇచ్చుకోవాలి. 'నేను సహాయం చేస్తాను. కానీ, నీ మనస్సుకు నీవే శిక్షణ నిచ్చుకో”అని పిల్లలకు తల్లితండ్రులు చెప్పాలి. ఈ శిక్షణ అన్ని చోట్లా, అన్ని వేళలా లోలోపల జరుగుతుండాలి. విచిత్రం ఏమిటంటే ఎవరూ ఈ శిక్షణ అవసరం అనుకోవడం లేదు. అందువల్ల మనస్సు ఎప్పుడూ ఇంద్రియ విషయ వాసనలతోనే మునిగి ఉంటుంది. ఆ శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతాడు.

ఇన్రియాణిమనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే | ఏతైర్విమోహయత్యేషఃజ్ఞాన మావృతృదేహినమ్ ||

ఏ కోట బలహీనంగా ఉంటే ఆ కోటపై దండెత్తాల్సిందిగా యుద్ధరంగంలో శత్రువులు చెబుతారు. అలాగే, మనలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ వ్యక్తి యొక్క ప్రముఖమైన నిర్మాణ కేంద్రాలు. అందువల్ల వాటిని ఎదుర్కోవలసిందిగా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.

'ఇంద్రియాణి మనః బుద్ధి: అస్య అధిష్ఠానమ్ ఉచ్యతే' - ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి - శరీరంలోని ముఖ్యమైన నిర్మాణాలు. సమాజంలో ఉన్న అవినీతి, దౌర్జన్యం మనస్సు నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సరిగ్గా ఎక్కడ, ఏ ప్రదేశంలో ఈ శత్రువు స్థావరముంది? అంటే దానికి శ్రీకృష్ణుడు మూడు స్థావరాలు అని చెబుతూ, ముందు ఈ భౌతిక శరీరం. ఈ శరీరంలో ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ ఉంది. అన్ని చెడులకూ ప్రధాన స్థావరం అది. రెండోది మనస్సు. సరైన జాగ్రత్త తీసుకోకుంటే కొద్దికాలంలోనే బుద్ధిని కూడా వ్యాధి ఆవరిస్తుంది. అప్పుడు మంచి చెడుల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. బుద్ధి రోగపూరితం కాకుంటే మనల్ని రక్షిస్తుంది. అయితే, వ్యక్తిలో ఏ స్థావరంలో ఆ వ్యాధి ఉందో ముందు కనిపెట్టాలి.

'ఏతైః విమోహయతి ఏషః జ్ఞానమ్ అవృత్య దేహినమ్' - వ్యక్తి వికాసానికి దూరంగా ఈ మూడూ ఉంటాయి. అప్పుడే మాయ మనిషిని ఆవరించి ఉంటుంది. సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు ఎవరూ ఏ తప్పులూ చేయరు. నువ్వు తప్పు చేశావంటే నిన్ను ఏదో ఆవరించిందనే అనుకోవాలి. ‘కఠోపనిషత్తు' (మూడో అధ్యాయం, శ్లోకాలు 3 నుంచి 9)లో మానవుణ్ణి రథ రూపకల్పనతో పోల్చారు. యముడు, నచికేతునితో 'జీవితం పరిపూర్ణతకు మార్గం అనీ, ప్రతి మానవుడూ ఆ ప్రయాణానికి కావలసినవి కలిగి ఉన్నాడనీ, అవే బండి, కళ్ళాలు, గుఱ్ఱాలు, బండి నడిపేవాడు కావాలనీ, అవన్నీ నీలో కూడా ఉన్నాయనీ, దానితో సుఖంగా ప్రయాణం చేయమనీ' చెప్పాడు.

వ్యాధి ఏ స్థానంలో ఉన్నా కూడా ప్రయాణం సరిగ్గా సాగదు. ప్రయాణం అనేది బుద్ధి అధీనంలోనే ఉండాలి. అంతేకానీ, ఇంద్రియాలు, మనస్సుల అధీనంలో ఉండకూడదు. మానవ దేహంలో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నిరోధించి, శిక్షణనిచ్చి, వాటికి మార్గాన్ని చూపించాలి. దాని వల్ల గొప్ప శక్తి విలువైన రీతిలో ఉపయోగపడుతుంది. వరద ప్రవాహాన్ని నియంత్రించి, జలాశయాల నుంచి నీటిని పంటలకూ, విద్యుచ్ఛక్తికీ ఏ విధంగా వినియోగించుకోగలుగుతున్నామో, అదే విధంగా మనిషిలోని శక్తిని నియంత్రించి  జీవితంలో ఏది విలువైందిగా భావిస్తారో దానికి వినియోగించుకోవాలి. అలా చేయకుంటే అది ఇంద్రియ ప్రయాణమే అవుతుంది కానీ, మనిషి ప్రయాణం కాదు. అంటే నదీ ప్రవాహం వృథాగా సముద్రంలో కలిసిన రీతిగా అవుతుంది.

సామాజిక పరిణామంలో ఉన్నతమయిన విలువలనూ, శాంతినీ పెంచాలనుకున్నా, వ్యక్తిగత విలువలను పెంపొందించుకోవాలన్నా, మనస్సుని మంచి దారికి మళ్ళించే శిక్షణ ఇవ్వడం అవసరం.

                                            *నిశ్శబ్ద.